జర్నలిస్ట్‌ కావాలనుకున్నా

Sakshi Special Interview With Serial Actress Sadhana

ఎనిమిదవ తరగతిలోనే టీవీ సీరియల్స్‌కు పరిచయం అయిన సాధన బుల్లితెర ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుంటోంది. జీ తెలుగులో ‘ప్రేమ,’ జెమినీ టీవీలో ‘రెండు రెళ్లు ఆరు’ సీరియల్స్‌లో నటిస్తున్న సాధన చదువులోనూ రాణిస్తోంది. వర్క్‌ గ్యాప్‌లో చదువుకుంటూ ఇటు నటనని, అటు చదువునూ బ్యాలెన్స్‌ చేసుకుంటూ ముందుకు సాగుతున్న సాధన చెబుతున్న ముచ్చట్లివి. 

ఇండస్ట్రీతో పరిచయం?
మా అమ్మ టీవీ ఆర్టిస్ట్‌. నేను చిన్నగా ఉన్నప్పుడు అమ్మతో పాటు లొకేషన్స్‌కి వచ్చేదాన్ని. అలా ఒకరోజు టీవీ వాళ్లు నా ఆడిషన్స్‌ తీసుకున్నారు. అలా ఈ ఫీల్డ్‌కి స్కూల్‌ డేస్‌లోనే నేనూ పరిచయం అయ్యాను. పుట్టింది ఖమ్మం. చదువు అంతా సాగింది హైదరాబాద్‌లోనే. చిన్నప్పుడు డ్యాన్స్‌ అంటే విపరీతమైన ఇష్టం ఉండేది. చాలా బాగా డ్యాన్స్‌ చేసేదాన్ని. దీంతో ఏదో ఒక రోజు ఫేమ్‌ వస్తుంది, మానొద్దు అని ఇంట్లో ఎంకరేజ్‌ చేస్తుండేవారు. అనుకోకుండా ఒక అవకాశం రావడంతో ఇలా మీ అందరి ముందుకు వచ్చే అదృష్టం దక్కింది. సీరియల్‌ వర్క్స్‌తో పాటు ఎంబీఏ సెకండియర్‌ చేస్తున్నాను. 

ఫీల్డ్‌లో ప్లస్‌లు మైనస్‌లు ?
ఏ కెరియర్‌ తీసుకున్నా ప్లస్‌లూ మైనస్‌లు అంతటా ఉంటాయి. అన్నింటా మన వ్యక్తిత్వమే మెయిన్‌. ఇక్కడ నా వర్క్‌ విషయానికి వస్తే ఉదయం 6:30 గంటలకు లొకేషన్‌లో ఉంటాను. మళ్లీ రాత్రి 9 గంటలకు ప్యాకప్‌ చెప్పేంతవరకు అక్కడే ఉంటాను. నెలలో ఇరవై రెండు రోజులు ఇలాగే వర్క్‌ ఉంటుంది. నిద్ర ఉండదు. రోజులో నాలుగైదు గంటలు పడుకుంటాను. కానీ, ఇదే నా ప్రపంచం. ఈ వర్క్‌ లేకపోతే నన్ను నేను ఊహించుకోలేను. నెలల తరబడి ఒక సీరియల్‌కి వర్క్‌ చేస్తాం. రేటింగ్‌ బట్టి ఒక్కో సీరియల్‌ ఐదేళ్లు కూడా పడుతుంది. సీరియల్‌ టీమ్‌ అంతా కొన్ని రోజుల్లోనే ఫ్యామిలీ మెంబర్స్‌ అయిపోతాం.. డ్రైవర్‌ నుంచి మేకప్‌ మ్యాన్, లైట్‌ బోయ్‌ వరకూ.. అంతా ఒకే కుటుంబం. చివరగా సీరియల్‌ పూర్తయ్యి గుమ్మడికాయ కొట్టిన రోజు మాత్రం చాలా బాధగా అనిపిస్తుంది. అలాంటి టైమ్‌లో రెండు–మూడు సార్లు ఏడ్చేశాను కూడా. ప్రతిరోజూ లొకేషన్‌లో ఫన్నీ థింగ్స్‌ ఉంటూనే ఉంటాయి. కొన్ని చిన్న చిన్న గొడవలుంటాయి. మా రోల్స్‌ని మిగతావాళ్లు ఇమిటేట్‌ చేసి ఉడికిస్తుంటారు. సీనియర్స్‌ కూడా మమ్మల్ని ఇమిటేట్‌ చేస్తుంటారు. చాలా సరదాగా గడిచిపోతుంది. 

రియల్‌ లైఫ్‌లో ప్లస్‌లు మైనస్‌లు?
నా చిన్నప్పుడే అమ్మానాన్న విడిపోయారు. మొదట అక్క పుట్టినప్పుడే ‘ఆడపిల్ల’ అని నాన్న చాలా ఫీలయ్యారంట. నేనూ ఆడపిల్లను అనేసరికి నాన్న మమ్మల్ని వదిలి వెళ్లిపోయాడు. అయినా అమ్మ బాధపడలేదు. మా అమ్మే నాన్న అయి మమ్మల్ని పెంచింది. అక్కను డాక్టర్ని చేసింది. నేను యాక్టర్‌ని అయ్యాను. మా భవిష్యత్తు గురించి అమ్మ పడే తపన వల్లే మేమీ రోజుకు ఇలా ఉన్నాం. మా జీవితంలో అమ్మ పెద్ద ప్లస్‌. అమ్మ లేకపోతే మేం లేం.

ఇన్నేళ్ల కెరియర్‌లో బాగా నచ్చిన పాత్ర?
‘రెండు రెళ్లు ఆరు’ సీరియల్‌లో కృష్ణ పాత్ర అంటే నాకు చాలా ఇష్టం. కృష్ణ ఒక జర్నలిస్ట్‌ క్యారెక్టర్‌. ఆ పాత్ర చాలా పవర్‌ఫుల్‌. డైనమిక్‌. ఒక అమ్మాయి ధైర్యవంతురాలిగా ఎలా ఉండాలో చూపుతుంది. అన్యాయం జరిగితే తట్టుకోదు. ఎవరైనా తప్పు చేస్తే ఊరుకోదు. అస్సలు రాజీపడదు. నేనూ రియల్‌ లైఫ్‌లో జర్నలిస్ట్‌ అయితే బాగుంటుంది అని చాలా సార్లు అనుకునేదాన్ని. ఎన్నో స్టోరీస్‌ కవర్‌ చేయచ్చు, ప్రజలకు సాయంగా ఉండచ్చు అనిపించేది. ఆ ఇష్టం ఇప్పుడీ పాత్ర ద్వారా తీరింది. యాక్టింగ్‌ ఫీల్డ్‌లో ఉన్న అడ్వాంటేజీ ఏంటంటే రియల్‌ లైఫ్‌లో ఉన్న డ్రీమ్స్‌ని ఇలా కొద్దిగాౖ నెనా సాటిస్‌ఫై చేసుకోవచ్చు.  

కన్నడ హీరోయిన్స్‌కే ఇక్కడ అవకాశాలు ఎక్కువ?
నిజమే, తెలుగు వారికి తెలుగులో అవకాశాలు లేకుండా పోయాయి. ఇక్కడ వాళ్లలో ఏం తక్కువైందో తెలియడం లేదు. వేరేవాళ్లను ఎందుకు ఎంకరేజ్‌ చేస్తున్నారో తెలియదు. లేదంటే, మనవాళ్లు కూడా చాలా మంది భయపడి ఈ ఇండస్ట్రీకి రావట్లేదేమో అనిపిస్తుంది. 

షూటింగ్‌ లేకపోతే..?
ఫుల్‌గా నిద్రపోతాను. కాస్త తీరిక అనిపిస్తే వంట చేస్తాను. బాగా వండుతాను. అమ్మ, అక్క నా వంటను చాలా ఎంజాయ్‌ చేస్తారు. ఆ తర్వాత నాకు నచ్చిన డ్యాన్స్‌ ఉండనే ఉంది. అక్కతో కలిసి షటిల్‌ ఆడటం చాలా బాగుంటుంది. అమ్మ, నేను, అక్క కూర్చుంటే కబుర్లతో సమయమే తెలియదు. 
– నిర్మలారెడ్డి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top