సూపర్‌ పాపులర్‌ బాలు

Sakshi interview with SP Balasubrahmanyam

బాలసుబ్రహ్మణ్యం– మరో పేరు షణ్ముఖుడు – అంటే ఆరు ముఖాలు కలిగినవాడు. నటన, డబ్బింగ్, గానం, సంగీతం, నిర్మాత, స్టూడియో (కోదండపాణి) అధినేత... ఇలా ఆయన షణ్ముఖుడు అయ్యాడు.

పదహారణాల రుపాయినోటులో పదహారు భాషలున్నట్లే సూపర్‌ పాపులర్‌ బాలు గళంలో పదహారు భాషల, 40 వేల పాటలున్నాయి. రేపు ఈ గాన గంధర్వుడి జన్మదినం. ఈ సందర్భంగా సాక్షి ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ...

సాక్షి తరఫున మీకు ఒక రోజు ముందుగా జన్మదిన శుభాకాంక్షలు.

తల్లిదండ్రుల చల్లని నీడలో మీరు ఎదిగిన విధానం గురించి చెప్పండి?
మా తండ్రిగారు నేను ఏం చదవాలని ఎప్పుడూ నిర్దేశించలేదు. ఇంజనీరింగ్‌ చదువుకోవాలని నేను కన్న కలకు తగినట్టుగా నాకు చదువు చెప్పించారు. అలాగే సంగీతంలో నిష్ణాతుడినవ్వాలని, నాకు ప్రజ్ఞాపాటవాలు ఉన్నాయని ఆయన ఎన్నడూ అనుకోలేదు. నేను హాయిగా పాడతానని ఆయనకు తెలుసు.

ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ‘ఏదైనా పాట చల్లగా పాడు నాయనా’ అనేవారు. పాటల పోటీలలో బహుమతులొస్తే, సంతోషంగా తల నిమిరేవారు. ఆకాశవాణిలో వచ్చే సంగీత విద్వాంసుల కార్యక్రమాలు వినిపిస్తూ, వారు ఎందుకు ప్రఖ్యాతులయ్యారో చెప్పేవారు. సెలవులలో మా తాత గారి ఇంటికి మద్రాసు వెళ్లినప్పుడు, మహాగాయకుల సంగీత కచేరీలు వినే అవకాశం వచ్చింది.

మీ నాన్నగారు రాసిన పాటలకు బాణీలు కట్టాలని అనుకున్నారు కదా..!
మా నాన్నగారు అద్భుతంగా హరికథ చెబుతారని అందరూ అనుకునేవారు. మా అమ్మ ‘‘మీ నాన్నగారి హరికథకు వెళ్లను, ఆయన పాత్రలో పరకాయ ప్రవేశంచేసి కంట తడి పెట్టుకుంటే, నేను చూడలేను’’ అనేది.  ఆయన చెప్పిన హరికథలన్నీ ఆయన స్వయంగా రాసి, స్వరపరచుకున్నవే.

నాన్నగారి జీవిత చరిత్ర పుస్తకంగా రాయించి, విడుదల చేసినప్పుడు కొన్ని పాటలు ముద్రించారు. ఆయన రాసిన పాటలకు బాణీలు కట్టి పాడాలని తాపత్రయం. 1962లో ఆలిండియా రేడియో జాతీయ పోటీలలో నాన్నగారు రాసిన ‘‘పాడవే పల్లకీ...’’ పాటను నాకు తోచిన రీతిలో స్వరబద్ధం చేసి పాడి, రెండవ బహుమతి సంపాదించుకున్నాను.

మీకు సాహిత్య అభిలాష ఎలా కలిగింది?
సముద్రాల రాఘవాచారి గారితో నాన్నగారికి అనుబంధం ఉంది. నాగయ్యగారితో కూడా అనుబంధం పెరిగింది. ఆయన తీస్తున్న ‘రామదాసు’ సినిమా కోసం నాన్నగారితో హరికథ రాయించి, పాడించి రికార్డు చేశారు. ఆ హరికథతోనే సినిమా మొదలు పెట్టాలనుకున్నారు. కాని ఎందుకో అవ్వలేదు.

ఆ రికార్డును పొదువుకోలేకపోయాను. ఘంటసాల వారి పాటలు, బాలమురళి పాడే పద్ధతి గురించి నాన్నగారు చెబుతుండటంతో, ఇవన్నీ జీర్ణించుకుపోయి,  భాష పట్ల, అభిమానం, అభినివేశం పెరిగాయి.

అవార్డులు అందుకున్నప్పుడు మీ తల్లిదండ్రుల స్పందన ఏమిటి?
అవార్డులందుకున్నప్పుడు తల్లిదండ్రులకు సంతోషంగానే ఉంటుంది. నాన్నగారు ‘బాగా పాడావా నాయనా! బహుమతి వచ్చిందా! సంతోషం!’ అనేవారు. నాకు బీఈలో అంటే ఇంజనీరింగ్‌లో సీటు వచ్చినప్పుడు మాత్రం ఆయన పొంగిపోయారు. వాకిట్లో తిన్నె మీద కూర్చుని వచ్చీపోయేవాళ్లతో, మా వాడు అనంతపురంలో బీ....ఈ చదువుతున్నాడు అని ‘ఈ’ అక్షరాన్ని గట్టిగా నొక్కి చెప్పారు. లేకపోతే బీఏ అనుకుంటారని భయం.

ఒకానొక జాతీయ పురస్కారం వచ్చిన సందర్భంలో అమ్మను, నాన్నను మొట్టమొదటిసారి విమానంలో ఢిల్లీకి తీసుకెళ్లాను. ప్రభుత్వం లాంఛనాల ప్రకారం ఇచ్చే జనపథ్‌ హోటల్‌లో కాకుండా, మరో పెద్ద హోటల్‌లో  (ఆ రోజుల్లో రోజుకు 20 వేల రూపాయలు అద్దె) సూట్‌ తీసుకున్నాను. అవార్డు అందుకున్నాక, ‘దేశాధ్యక్షుడి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంద’న్నారు.

హోటల్‌కు వచ్చాక, ఒక నిశి రాత్రి, పక్క గదిలో ఉన్న నన్ను నిద్ర లేపి, బాత్రూమ్‌లోకి తీసుకువెళ్లి, ‘ఇందులో ఏది తిప్పితే నీళ్లు ఎలా వస్తాయో అర్థం కావట్లేదు’ అన్నారు. చూపించాను. ఆయన బెడ్‌రూమ్‌లో దిండు కింద వేసుకుని పడుకున్నారు. ‘ఏంటి నాన్నా’ అంటే, ‘ఆ హంసతూలికా తల్పం మీద నిద్ర పట్టట్లేదు, కిందే హాయిగా ఉంది. ఇంతకీ ఈ గదికి అద్దె ఎంత’ అని అడిగారు, విషయం చెప్పాక, ‘మనం ఉపయోగించుకోని ఈ సౌకర్యాలకి అంత పెనాల్టీ కట్టడం అవసరమా నాయనా’ అన్నారు. ఆ సంస్కారం నాకు ఇంకా బాగా గుర్తుంది.

జేసుదాసుగారితో కలిసి కచేరీ చేయాలనే ఆలోచన ఉందా?
జేసుదాసుగారితో కలసి కచేరీ చేయాలనే ధైర్యం నాకు లేదు, ఆయనకు మాత్రం కోరికగా ఉంది. ఈ మధ్య ఆయన ‘మనిద్దరం కలిసి త్యాగరాజ ఆరాధనోత్సవాలలో తిరువయ్యారులో కచేరీ చేద్దాం. నాలుగు కీర్తనలు నేర్చుకుని పాడటం కష్టం కాదుగా’ అన్నారు. ఆయన మాటకు ఎదురు చెప్పలేక ‘సరే’ అన్నాను కాని, తప్పించుకు తిరుగుతున్నాను.

వేదిక మీద సంప్రదాయ సంగీత కచేరీ చేయాలంటే, మనోధర్మంతో రాగం తానం పల్లవి, చిట్ట స్వరం వేసి పాడేంత ప్రజ్ఞాపాటవం ఉండాలి. చాలా రోజులుగా సంప్రదాయ సంగీతం నేర్చుకోవాలనే కల ఉంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో నాకు తెలియదు.

పాదపూజ గురించి
యాభై సంవత్సరాల నా సినీ సంగీత వృత్తి జీవితం సంపన్నం చేసుకున్న సందర్భంలో ‘ఎస్‌పీబీ 50’ అనే మకుటంతో మా అబ్బాయి నా చేత ప్రపంచయాత్ర మొదలుపెట్టించాడు. ప్రారంభించడానికి ముందర మా అమ్మ ఆశీస్సులు తీసుకున్నాను. జేసుదాసు ఆశీస్సులు కూడా తీసుకోవాలనిపించింది. ఆయనకు పాద పూజ చేస్తే బాగుంటుందని మా ఆవిడ సూచించింది.

జేసుదాసు గారికి ఫోన్‌ చేసి నా యాత్ర విషయం చెప్పి, ఇంటికి వచ్చి వ్యక్తిగతంగా మిమ్మల్ని ఆహ్వానించి, మీ ఆశీర్వాదం తీసుకోవాలి అని చెప్పాను. ఆయన ‘తప్పకుండా వస్తానని తారీఖు నోట్‌ చేసుకున్నారు.  అనుకున్నప్రకారం ఆ రోజు సాయంత్రం విజయ గార్డెన్స్‌లో ప్రెస్‌ మీట్‌ నాలుగున్నరకే పెట్టాం. మీడియా అంతా వచ్చారు. జేసుదాసుగారు సతీసమేతంగా విచ్చేశారు.

వేదిక మీదకు వెళ్లిన తరవాత నేను ముక్తసరిగా నా మాటలు ప్రారంభించి, ముగించి, ఆయనకు పాదపూజ చేసి, ఆ నీళ్లు నెత్తిన చల్లుకున్నాను. ఆయన విస్తు్తపోయారు. ఆయన మాటిమాటికీ ‘నా తమ్ముడు, నా తమ్ముడు’ అంటుంటే పులకించిపోయాను. ఆయన ఆశీర్బలంతో∙నా యాత్ర  దిగ్విజయంగా సాగుతోంది. నా జీవితంలో మరచిపోలేని మధురమైన సంఘటనగా పొదువుకున్నాను,

మీ పాటల ప్రయాణం గురించి చెప్పండి.
ఒక్కొక్క పాట గురించి చెబుతూంటే ఒక గ్రంథం రాయొచ్చు. మర్యాదరామన్న చిత్రంతో నా చిత్ర ప్రవేశం జరిగింది. కోదండపాణి గారు నాకు అవకాశం ఇచ్చిన సంగతి నేను ఎన్నటికీ మరువలేను. ఆ తరవాత ఇంక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈ సందర్భంలో నేను పద్మనాభంగారికి చిర ఋణగ్రస్తుడిని. నా జీవితాన్ని మలుపు తిప్పిన పాటలు ఎన్నో ఉన్నాయి.

‘చెల్లెలి కాపురం’ చిత్రంలోని ‘చరణ కింకిణులు ఘల్లుఘల్లుమన’ ఒక మైలురాయి కిందే లెక్క. ఘంటసాల మాస్టారు పాడవలసిన పాటను, నా మీద నమ్మకంతో పాడించిన సంగీతదర్శకులకు ఋణపడి ఉంటాను.  నేను రికార్డు చేసిన రెండవ పాటే మహదేవన్‌గారికి పాడాను. ఆ విషయం మా గురువుగారికి చెబితే, ఆయన ‘అక్కడ పుహళేంది అనే ఒక అబ్బాయి ఉంటాడు.

అతడు పాడే విధానం, మాడ్యులేషన్‌ని గమనించి, అలాగే పట్టుకో. అప్పుడు పాట బాగా వస్తుంది’ అని చెప్పారు. నా ఎదుగుదలలో శంకరాభరణం సహా పుహళేందిగారి భాగస్వామ్యం ఎంత ఉందో చెప్పడానికి వీల్లేదు. శంకరాభారణంలో పాడలేనని పారిపోయిన సందర్భంలో ఆ పాటలు నేర్పించడానికి తాపత్రయ పడిన ఆయనకు సదా ఋణపడి ఉంటాను.

సంగీత దర్శకుల గురించి?
సత్యంగారికి నేను పాడిన మొట్టమొదటి పాట, ‘పాల మనసులు’  సినిమాలో ‘ఆపలేని తాపమాయె’. ఇదొక కామెడీ సాంగ్‌. చలంగారికి పాడాలి. ఈ పాట నేను ఎల్‌ఆర్‌ ఈశ్వరి పాడుతున్నాం. సోదరి విజృంభించి పాడేస్తోంది. నా పాట తీరు చూసి, తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు సత్యం గారు.

బయట  నిలబడి ఏడుస్తూంటే... అట్లూరి పూర్ణచంద్రరావుగారు నన్ను బుజ్జగించి, సత్యం గారిని సన్నగా మందలించి, ‘చిన్న పిల్లవాడు, జాగ్రత్తగా నేర్పించి పాడించాలి’ అనగానే,  ‘పాట తెలియని కొత్తవాళ్లని తీసుకు వచ్చి మా నెత్తినేస్తారు’ అని చిరాకు పడిన సత్యం గారు, ఆ తరవాత ‘మా అబ్బాయి బాలునే పాడాలి’ అనే స్థాయికి తీసుకువచ్చారు. పెండ్యాల, ఎస్‌. రాజేశ్వరరావు, మాస్టర్‌ వేణు, చలపతిరావు... ఆరోజుల్లో ఉన్న దిగ్దంతులు అద్భుతమైన పాటలు ఇచ్చి, నా చేత పాడించారు.

నాకు పేరు వచ్చేట్టు చేశారు. వాటి వెనకాల ఉన్న కవుల సహకారం కూడా మరువలేను. మా అన్నయ్య చక్రవర్తి నాకోసం పెద్ద పెద్ద హీరోలతో యుద్ధం చే శాడు. ‘చిన్నా’ అని పిలిచేవాడు.  ‘కష్టమైన పాటను మనం కంపోజ్‌ చేయొచ్చు, బాలు పాడేస్తాడు’ అనే నమ్మకం వాళ్లకు కలగడానికి నాకు శక్తిని కలిగించిన వీళ్లందరికీ నేను ఋణపడి ఉంటాను.

ఎన్టీఆర్, ఏఎన్నార్‌ గొంతులకు అనుకూలంగా పాడటానికి కారణం?
అంతవరకు మిగతా వాళ్లందరికీ పాడుతూ పాడుతూన్న నాకు ఎన్‌టీఆర్, ఏఎన్నార్‌లకు పాడటానికి చలపతిరావుగారు మంచి సలహా ఇచ్చారు. ‘నువ్వు ఘంటసాల గారిలానైనా పాడాలి లేదా వాళ్ల వాయిస్‌కి దగ్గరగా పాడగలగాలి’ అన్నారు.

ఘంటసాల మాస్టారిలాంటి గాత్రం నాకు లేదు. అందుకని నాలాగ నేను పాడుతూ, వారిని అనుసరిస్తూ (అనుకరణ కాదు) వారికి దగ్గరగా నా గానాన్ని తీసుకురావడానికి ప్రయత్నించాను. కృతకృత్యుడినయ్యాను. కమెడియన్స్‌కి మాత్రం వాళ్ల గాత్రానికి తగ్గట్టుగా పాడటానికి ప్రయత్నించాను.

ఉన్నత శిఖరాలకు చేరడానికి చేసిన ప్రయత్నం
నేను ఉన్నత శిఖరానికి చేరాననుకోలేదు. వచ్చిన పాటను బాగా పాడాను.  పాటల ఆలంబనతో ఒక్కొక్క మెట్టూ ఎక్కుతూ పైకి వచ్చానని మాత్రం చెప్పగలను.

‘భావయుక్తంగా పాడటం మీతోనే ఆఖరు’ అంటున్నారు!
అది ఒక ఉత్ప్రేక్ష మాత్రమే. గొప్పవాళ్లు వస్తూనే ఉంటారు. నేను ఒక నటుడిని కూడా కావడం వల్ల మొదట్లో భావాన్ని కొంచెం ఎక్కువగానే పలికించేవాడిని. నిర్దేశించుకోవడం అనుభవం ద్వారా తెలిసింది. ఐ కెన్‌ సే దట్‌ ఐయామ్‌ ద రేరెస్ట్‌ సింగర్‌. నా గాత్ర ధర్మం అలాంటిది. గొప్ప గొప్ప గాయకులు ఎంతో భావయుక్తంగా పాడాలని ప్రయత్నించినా వాళ్ల గొంతులోంచి అది బయటకు రాదు. పాటను కవి చేత పలికించి తెలుసుకునేవాడిని. ఇది అందరూ ఆచరించాలి.  

ఘంటసాలగారితో మీ పాటల ప్రయాణం
‘ఏకవీర’ చిత్రంలోని ‘ప్రతిరాత్రి వసంతరాత్రి’ తో ప్రారంభించాను యాత్ర. ఆ తరవాత ఐదారు పాటలు పాడాను. చిన్నతనం నుంచి వారి పాటలు వేదిక మీద పాడుతూ పెరిగాను. ఆయనతో కలిసి పాడుతున్నప్పుడు భయానికి లోనయ్యాను. ఆయనది చిన్నపిల్లాడి మనస్తత్వం, ఉద్వేగానికి లోనయ్యే తత్వం. ఈ పాట సమయంలో  ‘దేవుడా నేను తప్పు చేసి ఆయనకు ఇబ్బంది కలిగిం^è కూడదు’ అన్నారు. ఆయనను చూశాక, ఆయన ఆశీర్వాదం పొందాలనుకోవడం అవసరమనిపించింది. ఆయన ఆశీర్వచనాలు నాకు శ్రీరామరక్ష.

ఇళయరాజా పాటలు
ఇళయరాజా పాటలు రెండు నెలలుగా పాడటం మొదలుపెట్టాను. సంవత్సరకాలం పాటు పాడకపోవడానికి కారణం... నొప్పి, బాధ. అంతకుమించి ఆ విషయాలు చెప్పడం అనవసరం. చట్టపరంగా రాయల్టీకి సంబంధించినవి చేయిస్తూనే ఉన్నాను. ఆయన పంపిన నోటీసుకి తలవొగ్గవలసిన అవసరం లేదు. కాని చురుక్కుమన్న గుండెతో తీసుకున్న నిర్ణయం. ప్రస్తుతం నేను ఆయన పాటలు పాడుతూనే ఉన్నాను.

కోటి, శ్రీలేఖలను విమర్శించారనే విషయం మీద మీ స్పందన?
అసలు జరిగిన విషయం ఏంటంటే, నేను ఇళయరాజా దగ్గరకు వెళ్లి వీళ్లు చేసిన పాటల గురించి, ‘చూడరా ఆర్కెస్ట్రయిజేషన్‌ నీకు ఏ మాత్రం తగ్గకుండా చక్కగా చేస్తున్నారు’ అని చెప్పి సంతోషించాను. ఇంతే తప్ప, ఇళయరాజా లాగ కోటి సంగీతం చేస్తున్నాడని ఏనాడూ అనలేదు.

అలాగే శ్రీలేఖ పాట బాగోలేదని తిరస్కరించాననడం ఆశ్చర్యంగా ఉంది. చిన్న బిడ్డగా ఉన్నప్పుడు వచ్చీరాని మాటలతో ఆ అమ్మాయి పాడుతుంటే, సంతోషించానే తప్ప,   నేను ఆ అమ్మాయి పాటను తిరస్కరించడమేంటి? తరవాతి కాలంలో ఆ అమ్మాయి సంగీత దర్శకురాలిగా, మంచి గాయనిగా ఎదిగింది.

బాపు రమణల గురించి..
‘బంగారు పిచుక’ చిత్రంతో బాపుగారి సినిమాలకు నేను పాడటం మొదలుపెట్టాను. అందులో హీరో వేషం వేయమని అడిగారు. వేషాలు వేయడం మొదలెడితే పాటలు రావేమోనని ‘నాకు నటించడం ఇష్టం లేదు’ అని అబద్ధం చెప్పాను. ‘అందాల రాముడు’ సినిమాలో అన్ని పాటలూ నాతో పాడించాలనుకున్నారు.  సరిగ్గా ఆ సమయంలోనే నా మొట్టమొదటి విదేశీయానం సింగపూర్‌కి వెళ్లవలసి రావడంతో,  ఆ సినిమా మిస్‌ అయ్యాను.

ఆ తరవాత బాపురమణల తూర్పు వెళ్లే రైలు, సీతమ్మ పెళ్లి, జాకీ సినిమాలకు సినిమాలకు  సంగీతం సమకూర్చాను. హిందీలో చేసిన హమ్‌పాంచ్‌ (మన వూరి పాండవులు) చిత్రానికి నాచేత బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్, రీరికార్డింగు చేయించారు. రమణగారు రాసిన కోతికొమ్మచ్చి ఆడియో బుక్‌ సింహభాగం నేనే చదివాను. వారు నా బొమ్మ వేసి, ‘బాలు సరస్వతీ నమస్తుభ్యమ్‌’ అని రాసి ఇచ్చారు.  వారిద్దరూ లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను.

నా తప్పులు నేనే దిద్దుకోవాలి
నేను పాడిన పాటలలో తెలియక చేసిన తప్పులను నేనే దిద్దుకుంటాను. పాత పాటలలో నాటి గాయనీగాయకులు తెలియకుండా ఎన్నో తప్పులు దొర్లించారు. దానికి వాళ్లు మాత్రమే బాధ్యులు కారు. ఉచ్చారణ దోషాలున్నప్పుడు, పక్కనే కూర్చున్న కవి సవరించాలి. అప్పట్లో ఆ తప్పులను ఎందుకు సర్దేవారు కాదో నాకు తెలియదు.

భాష మీద ఉన్న మక్కువతో పెంపొందించుకున్న జ్ఞానంతో, ఆ పాటలు వింటున్న ప్రతి సారి పంటి కింద రాయిలా తగిలి, ‘అయ్యో’ అనిపించేది. బాధ్యత గల గాయకుడిగా ‘ఈ తప్పును దయచేసి మీరు చేయకండి’ అని చెప్పడం నా బాధ్యత.

చివరగా...
సినిమా పరిశ్రమ నాకు భుక్తినిచ్చింది, ముక్తినిచ్చింది. అందరి అభిమానాన్ని పొందేలా చేసింది. నాకంటూ ఒక దిశానిర్దేశం చేసింది. నాకంటూ ఒక బాధ్యతను పెంచింది. త్రాసులో ఒక పక్కన సినిమా పరిశ్రమ అయితే, మరోపక్క నా పాటలను వినిపించిన అన్ని భాషలకూ చెందిన సంగీత ప్రియులు ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా నా అభిమానులు, ‘ఇంకా బాలు పాట పాడాలి పాడాలి’ అని కోరుకుంటున్నారంటే అది నేను చేసుకున్న పుణ్యం.

నా పాట వల్ల కాని, నా మాట వల్ల కాని, ఎవరికైనా ఇబ్బంది కలిగించి ఉంటే, ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను క్షమను అర్థిస్తున్నాను. అందరికీ నేను చిర ఋణగ్రస్తుణ్ని. సాక్షి పేపర్‌ ద్వారా నన్ను మరొక్కసారి శ్రోతలకు దగ్గర చేస్తున్నందుకు సాక్షివారికి సర్వదా కృజ్ఞుణి. సర్వేజనాః సుఖినోభవంతు, సర్వే సుజనా సుఖినోభవంతు, స్వస్తి

– సంభాషణ: వైజయంతి పురాణపండ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top