జంటపూల నవ్వు | Sakshi Family interviews suma and rajeev | Sakshi
Sakshi News home page

జంటపూల నవ్వు

Published Mon, Oct 19 2015 11:32 PM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM

జంటపూల నవ్వు - Sakshi

రాజీవము వికసించింది. సుమము పరిమళించింది. పూలు రెండయినా పండు ఒక్కటే. పండంటి కాపురం ఒక్కటే. ఇద్దరూ పని చేస్తారు. ఇద్దరూ సర్దుబాటు చేసుకుంటారు. ప్రేమ బంధమైంది. బంధం బాధ్యతైంది. బాధ్యత లేని ప్రేమ... ప్రేమ లేని బంధమవుతుందని... అహం లేని బంధం... ప్రేమ ఉన్న అనుబంధమవుతుందని... తప్పు చేయకపోయినా క్షమించమని అడిగే నిస్వార్థం ఉంటే... తప్పు చేస్తే ఎత్తి చూపగల చనువు ఉంటే... మేరేజస్ ఆర్ హెవెన్ అని ఈ జంటపూలు చెబుతున్నాయి.
 
హాయ్... నమస్తే...
రాజీవ్- సుమ: హాయ్ (నవ్వుతూ)

ఇద్దరిదీ ఒకే ఫీల్డ్ కదా. జనరల్‌గా వచ్చే సమస్యలు ఏమైనా ఉంటాయా?
సుమ: బేస్ ఎంటర్‌టైన్‌మెంటే అయినా ఇద్దరివీ డిఫరెంట్ ప్రొఫెషన్స్. తనది ఫిల్మ్. నాది టెలివిజన్. సినిమాల్లో వీళ్లదంతా షార్ట్ షార్ట్ వర్క్ (నవ్వుతూ)... నా వర్క్ మాత్రం తరతరాలుగా (ఎపిసోడ్స్...) సాగుతూనే ఉంటుంది. ముందే అనుకున్నాను తన సినిమాల్లో నేను నేను జోక్యం చేసుకోకూడదు అని. నా షోకి మాత్రం తను గెస్ట్‌గానైనా రావచ్చు.
రాజీవ్: అదే బెస్ట్. ఇంట్లో ఎలాగూ పరస్పర ప్రమేయం ఉంటుంది. ఇక ప్రొఫెషన్స్‌లో కూడా ఎందుకు అనుకున్నాం. ఆమె చికాకులు ఆమెవి. నా తల నొప్పులు నావి.
     
అవునా... అలాంటి చికాకులు ఉంటాయా?
రాజీవ్: ఎందుకుండవండీ... వ్యక్తిగతంగా ఎన్ని సమస్యలు ఉన్నా ఈ ప్రొఫెషన్‌లో స్క్రీన్ మీద మాత్రం నవ్వుతూ కనిపించాలి. చలాకీగా ఉండాలి. రెండేళ్ల కిందట మా మామగారు (సుమ తండ్రి) చనిపోయారు. ఆ మరుసటి రోజు తనో ఎపిసోడ్ నవ్వుతూ చేయాల్సిన పరిస్థితి. ఎవరు చేయగలరు? కాని తను చేసింది. చాలా బాధనిపించింది.
సుమ: మిగతా ప్రోగ్రామ్స్ అన్నీ ఆపేయగలిగాం. కానీ ‘క్యాష్’ ప్రోగ్రామ్‌కి మరో ఎపిసోడ్ లేదు. షెడ్యూల్ టైమ్‌కి కొత్త ఎపిసోడ్ పడాల్సిందే. అందుకని లోపల ఎంత బాధ ఉన్నా పైకి మాత్రం నవ్వుతూ... ఇప్పటికీ తలుచుకుంటూనే కన్నీళ్లు వచ్చేస్తాయి.
     
మరి ఇవి ఇంటి దాకా రావా?...
సుమ: వస్తాయి. కాని కాన్షియస్‌గా బయటి పని బయటే ఇంటి పని ఇంటికే అనుకోవాలి. నేను ఇంటికి వచ్చేసరికి మా ఇద్దరు పిల్లలు చేయని పనులు, చేసిన పనులతో దాడి చేయడానికి రెడీగా ఉంటారు. మదర్ డ్యూటీయే ఫస్ట్... అనుకుని వాళ్ల లోకంలో పడిపోతాను.
రాజీవ్: అది నిజమే. ఇంకా చెప్పాలంటే ఈ ఐదేళ్లుగా మా పనుల్లో మేముండిపోయి మాట్లాడ్డమే బాగా తగ్గిపోయింది. ఈవెనింగ్ కాస్త టైమ్ ఉంటే ‘నీ ప్రోగ్రామ్‌కి ఫలానా సెలబ్రిటీ వచ్చారట...’ అంటాను. ‘ఆ.. వచ్చారనుకుంటాను.. గుర్తులేదు’ అంటుంది ఆవులిస్తూ. ఇంకో వన్ ఇయర్ ఇలాగే ఉంటే ‘రాజీవ్ ఎవరు?!’ అని అడుగుతుందేమో అని అప్పుడప్పుడు భయం వేస్తుంది కూడా ... (ఇద్దరూ నవ్వులు)
     
మరి మీ మధ్య సారీ చెప్పుకునే సందర్భాలు లేవా?
రాజీవ్: ఎందుకండవ్? సారీ... అనేది ఆలుమగల మధ్య కచ్చితంగా ఉండి తీరాల్సిన పదం. నాకు విరివిగా అలవాటైపోయిన పదం (నవ్వులు). ఈ మధ్య 20-30 రోజులు షూటింగ్ కోసం వేరే వేరే ఊళ్లలో ఉండాల్సి వస్తోంది. అనుకున్న సమయానికి ఇంటికి రాలేకపోతే చటుక్కున వచ్చే పదం సారీనే...! ఒక్కోసారి అనాలోచితంగా కూడా తనను హర్ట్ చేసి సారీ చెబుతుంటాను.
సుమ: అలాంటి ఓ విషయం చెబుతాను. ప్రొడక్షన్ పనిలో భాగంగా కథలు వినడం, ఆర్టిస్ట్‌లను సెలక్ట్ చేయడం మామూలే. అలా ఒకసారి బెంగుళూరు మోడల్ అట... నాకు మాట మాత్రం కూడా చెప్పకుండా రాత్రి టైమ్‌లో ఇంటికి తీసుకొచ్చారు.
రాజీవ్: ఆ అమ్మాయి అలా ఇంటికి వస్తుందని ముందు నాకే తెలియలేదు. తనకు కేటాయించిన హోటల్ రూమ్ బాలేదన్నారు. నాకేం చేయాలో తోచక ఇంటికి తీసుకొచ్చేశాను.
సుమ: మొత్తానికి ఆ రోజు బాగా ఇరిటేట్ అయ్యాను. ఎప్పుడైనా అలా తీసుకురావాలంటే నా పర్మిషన్ కాస్త తీసుకో... అని చెప్పాను. ఆ తర్వాత ‘సారీ’ చెప్పారు.
     
ఇద్దరిలో ఎవరు సెన్సిటివ్?
సుమ: నేనే. (రాజీవ్‌నుద్దేశించి) నువ్వు సెన్సిబుల్ కదా! అందుకని.
రాజీవ్: సిచ్యుయేషన్ బట్టి ఉంటుంది.
     
గొడవలు వచ్చినప్పుడు....
సుమ: మా నాన్నకు అమ్మకు కూడా గొడవలవుతుండేవి. ఆ విధంగా భార్యాభర్తలు అన్నప్పుడు ఇవి చాలా సాధారణం అని తెలుసు. ఈయన మాట్లాడితే వాయిస్ గంటకొట్టినట్టు ఉంటుంది. చెప్పాల్సిన పాయింట్ గట్టిగా చెప్పేసరికి మొదట్లో భయపడిపోయేదాన్ని. మాట్లాడకుండా ఫోన్‌లో మెసేజ్‌లు పంపించేదాన్ని. కొన్నిసార్లు స్లిప్ రాసి బాత్రూమ్‌లో అద్దం మీద అతికించేదాన్ని. ఇలా చాలా ట్రిక్స్ ఉన్నాయిలెండి... ఇప్పుడు అలాంటి సందర్భాలు చాలా తక్కువ.
రాజీవ్: అయ్యో, తనూ అరుస్తుంది ఎప్పుడైనా! అయితే ....(ముసి ముసిగా నవ్వుతూ)
 సుమ: ఇప్పటి నా అరుపులో కొంచెం బెటర్‌మెంట్ ఉందిలెండి. కానీ, నా అరుపు ఈయనకు కామెడీగా ఉంటుంది... బాగా కోపం వచ్చి అరిచేస్తే.. ఈయన హహహ... అని నవ్వేస్తారు. ఈయన నవ్వు చూసి నాకు నవ్వొస్తుంది.
 రాజీవ్:  రెండు పులులు సింహాలు కొట్టుకుంటుంటే.. అది వేరే... కానీ, నా అరుపుకి- తన అరుపుకి ఎప్పుడు మ్యాచ్ అవ్వాలి?!
     
ఇద్దరిలో మనీ మేనేజ్‌మెంట్ ఎవరి చేతుల్లో ఉంటుంది?
రాజీవ్: వితౌట్ డిస్కషన్ సుమదే. హోమ్‌మినిస్టరూ తనే, ఫైనాన్స్ మినిస్టరూ తనే. నేనేదైనా ఖర్చుపెడితే సుమకు చెప్పే చేస్తాను.
సుమ: మొదటి నుంచీ రాజీవ్ ఈ విషయంలో ఆ బాధ్యతను నాకే అప్పజెప్పారు. వందరూపాయలు సంపాదించుకొచ్చినా తెచ్చిస్తారు. మొదట్లో ఖర్చులు, అప్పులు, రాబడి అన్నీ రాసుకునేవాళ్లం. ఇప్పుడా పద్ధతి పాటించడం లేదు. నీ మనీ, నా మనీ అనే డిఫరెన్స్ మా మధ్య ఎప్పుడూ లేదు. అలా ఉంటే సమస్యలు తప్పవు.
     
పిల్లల పెంపకం...
రాజీవ్: ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనల్ని మనం తప్పించుకోవడానికి ‘నీ పెంపకమే తప్పు’ అని ఎదుటివారిని హర్ట్ చేయడం ఇద్దరిలోనూ ఉంటుంది. మా వరకు ఆ సందర్భం రాలేదు.

ఇన్ని పనుల్లో సుమకు మీ (రాజీవ్ కనకాల) సాయం...
రాజీవ్: తెలియని పనుల జోలికెళితే అది కిచిడీ అవుతుంది. అందుకే అటువైపుగా వెళ్లనుగాక వెళ్లను. ఎప్పుడైనా ఒక్కొక్కసారి చేస్తుంటాను.

సుమకు బయట యాంకర్‌గా చాలా పేరు వచ్చింది కదా! మీరు ఎప్పుడైనా జెలసీగా ఫీలయ్యారా?
రాజీవ్: బయట అంతా ఇదే మాటంటుంటారు. కానీ అలాంటిదేమీ లేదు. తను యాంకరింగ్ బాగా చేస్తుంది.
సుమ: రాజీవ్ ప్రొడక్షన్ వర్క్, ఐడియాస్ చాలా క్రియేటివ్‌గా ఉంటాయి.
     
ఇరువైపులా బంధుత్వాలను ఎలా నిలబెట్టుకుంటున్నారు...?
సుమ: బేసిక్‌గా వీళ్ల బాబాయిని నా బాబాయి అనుకొని వీళ్ల అత్తను మా అత్త అనుకొని ఇలా ఎక్కువగా పట్టించుకుంటాను. మా నాన్నతోడ పది మంది అమ్మతోడ ఏడుగురు. పెద్ద ఫ్యామిలీ. రెండువైపులా ఎక్కడుంటే అక్కడ అంతా నన్ను చాలా చాలా ఇష్టపడతారు.
రాజీవ్: వీళ్లంతా డౌన్ టు ఎర్త్. అందరూ ఒక రేంజ్‌లో ఉంటారు. కానీ చాలా మామూలుగా ఉంటారు. అది నాకు బాగా నచ్చుతుంది. వీళ్ల బంధువుల ఇళ్లకు ఫంక్షన్లప్పుడు వెళతాను. కానీ, మాట్లాడటం తక్కువ. బేసిక్‌గా లాంగ్వేజ్ ప్రాబ్లమ్. ఆ మలయాళం నాకు రాదు. వెళ్లినా ఎవరితోనూ కలవలేను.
సుమ: కేరళకు వెళ్లి రెండేళ్లు అవుతుంది. ఈ మంత్‌లో వాయినాడ్ వెళుతున్నాం. తీసుకెళ్లి రాజీవ్‌ని అక్కడి అడవుల్లో వదిలేసొస్తాను.. (నవ్వులు)
రాజీవ్: నేనే వదిలి వెళ్లాలనుకుంటున్నా... (నవ్వులు)..
ఇద్దరూ: ఊరికే అంటున్నామండి... పేపర్లో నోట్ చేయకండి.
     
బయట సుమ తన వాక్‌ప్రవాహంతో హడలెత్తిస్తుంటుంది.. మరి ఇంట్లో...
సుమ: అబ్బే అస్సలు లేదండి. చూస్తున్నారుగా... ఈయన మాటల ముందు నా మాటలెంత. వినడమే తప్ప అస్సలు మాట్లాడలేను. నోట్లో నుంచి మాటే రాదు...
రాజీవ్: ... తను చాలా స్పాంటేనియస్‌గా మాట్లాడుతుంది. లాజిక్‌గా లా పాయింట్స్ లాగుతుంది. కానీ ఇక్కడ రిసీవింగ్ ఉంటే కదా (నవ్వులు)!
     
ఎప్పుడైనా ఈ ఫలానా షోకి యాంకరింగ్ చేయమని మీరు(రాజీవ్) సుమని రిక్వెస్ట్ చేశారా?

రాజీవ్: అయ్యో, చాలా సార్లు. మామూలు రిక్వెస్ట్ కాదు.... కుందనపు బొమ్మ సినిమా ఆడియో లాంచ్‌కైతే ఎంత రిక్వెస్ట్ చేశానో మాటల్లో చెప్పలే ను. రోజూ తను ఎంతో అలసిపోయి వస్తుంది నిజమే. కాని అటు చూస్తే డెరైక్టర్ నా క్లోజ్ ఫ్రెండ్. వాడికీ కాదని చెప్పలేను.  ‘ప్లీజ్, ఒక్క పదినిమిషాలు వచ్చి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి వెళ్ల’మని ఎంత రిక్వెస్ట్ చేశానో. అక్కడ నా తెలివంతా ప్రదర్శించాననుకోండి! మొత్తానికి ‘సరే’ అంది. ప్రోగ్రామ్ ఓకే చేసుకున్నాం. పెద్ద పెద్ద సెలబ్రిటీలంతా వచ్చారు. కానీ, సుమ టైమ్‌కి రాలేకపోయింది. అప్పుడు నా టెన్షన్ చూడాలి. ప్రేమలో ఉన్నప్పుడు తొలి రోజుల్లో వెయిట్ చేసిన దాని కన్నా ఎక్కువ టెన్షన్‌తో వెయిట్ చేశా. మరి షో సక్సెస్ కావాలంటే సుమ ఉండాల్సిందే కదా.
     
మీరు దేనికి రిక్వెస్ట్ చేస్తుంటారు?
సుమ: ఊర్లు అయినా టూర్లు అయినా అందరం కలిసి ఎక్కడికైనా వెళ్దామా అని గతంలో అడిగేదాన్ని. ‘చెబుతాను...’ అనేవాడు. జవాబు ఉండేది కాదు. ఇప్పుడదంతా ఏమీ లేదు. ‘మనం ఫలానా రోజు అంతా కలిసి టూర్ వెళుతున్నాం’ అని చెబుతున్నా. ఏ ప్లేస్ అని కూడా చెప్పడం లేదు. గతంలో స్కూల్ నుంచి పాపను కాస్త పికప్ చేసుకుంటారా... అని అడిగేదాన్ని. ఇప్పుడు- పాప డ్యాన్స్ క్లాస్‌లో ఉంది... పూర్తవగానే తీసుకు రండి అంటున్నాను. ప్రస్తుతం అలాంటి ఫేజ్‌లో ఉన్నాను. (నవ్వులు)
     
ఇంటి పనులు వంట పనుల్లో వంకలు పెడుతుంటారా?
సుమ: ఈ విషయంలో నేను చాలా లక్కీ అండి. మావారు, మా అబ్బాయి నా వంటలు తెగ మెచ్చేసుకుంటారు. వంకలు పెట్టే డ్యూటీ మా అమ్మాయిది.
రాజీవ్: బాగుంది అంటే బాగుందని చెబుతాం. లేదంటే లేదు.
     
ఆ సంగతి ఏమోకానీ మీతో ఈ సంభాషణ మాత్రం నిజంగానే బాగుంది.
సుమ: థాంక్యూ
రాజీవ్: నాదీ సేమ్ డైలాగ్ (నవ్వుతూ)
- నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
 
ఇద్దరూ సంపాదనాపరులైతే...
ఆలూమగల జీవననౌక సాఫీగా సాగాలంటే ఇద్దరి మధ్య ఎలాంటి సమస్యలు తలె త్తినా సమాన బాధ్యత తీసుకోవాలి. ఇద్దరూ సంపాదనాపరులు (వర్కింగ్ పీపుల్) అయినప్పుడు ఈ బాధ్యత ఇంకాస్త పెరుగుతుంది అంటున్నారు ఫ్యామిలీ కౌన్సెలర్ వాణీమూర్తి.
* ఇద్దరూ ఒకరిపట్ల ఒకరు కృతజ్ఞతతో  ఉండాలి. నాకు ‘ఈమె’, నాకు ‘ఈయన’ దొరకడం అదృష్టం అని భావించాలి.
పొరపాట్లు కావు ఇద్దరి మధ్య ఉన్న బంధం ముఖ్యం అని గుర్తించాలి.
* ఇద్దరికిద్దరూ ఏ చిన్న పొరపాటు దొర్లినా ‘సారీ’ చెప్పుకోగలగాలి. అలాగే ‘థాంక్యూ’లకు కూడా స్పేస్ ఇవ్వాలి.
* ‘ప్రేమగా, ఆనందంగా ఉండటానికే పెళ్ళి చేసుకున్నాం’ అనే విషయం గుర్తుపెట్టుకోవాలి.
* ఎదుటివాళ్లే నన్ను అర్థం చేసుకోవాలి అనే దృక్ఫధం ఉండకూడదు.
* ఇప్పుడు చాలా మంది ప్రేమలో ఉన్నామనే భ్రమలో ఉంటున్నారు. ప్రేమ ఉంటే గొడవలు వచ్చినా వెంటనే సర్దుకుపోతాయి.
* ఇది నా కుటుంబం. ఈ కుటుంబం కోసం ‘నేను ఇవి పాటించాలి’ అనే నియమం ఇద్దరికిద్దరూ పెట్టుకోవాలి.
* ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఒకరి వర్క్‌ని ఇంకొకరు కించపరచకూడదు. గౌరవం లేని చోట బంధాలు బీటలు వారుతాయి.
* ఇద్దరూ బయటి పనులతో అలసిపోయి ఉంటారు కాబట్టి, ఇంటి పనులూ పంచుకోవాలి.
* ఇద్దరిలోనూ ఒకే ఇంట్రస్ట్ జీవితాంతం ఉండదు. పెళ్లి ఎప్పటికీ ఉండాల్సిన బంధం కాబట్టి, ఇద్దరికీ నచ్చే అంశాలకు ప్రాముఖ్యం ఇవ్వాలి.
* ఇద్దరిలో ఒకరికి బలహీనతలు ఎక్కువ ఉండచ్చు. ఆ బలహీనతల నుంచి బయటపడటానికి మరొకరు వెన్నుదన్నుగా ఉండాలి.
* నా సంపాదన, నీ సంపాదన అనే తేడా చూడకూడదు.  
* ఏదైనా చెబితే తప్పుగా అర్థం చేసుకోవడం, లేకపోతే అస్సలు అర్థం చేసుకోకపోవడం ఉండకూడదు.
- వాణీమూర్తి, ఫ్యామిలీ కౌన్సిలర్

Advertisement
 
Advertisement
 
Advertisement