ఒక లడ్డూ నన్ను జాదూగర్‌గా మార్చింది

Sakshi Exclusive Interview With Jaadugar Aanand

ఐదు దశాబ్దాలుగా 36  దేశాల్లో 37 వేలకుపైగా ఇంద్రజాల ప్రదర్శనలు. నాలుగు ప్రపంచ రికార్డులు. వేలాది సన్మానాలు. మ్యాజిక్‌ షోలతో పిల్లలు, పెద్దలను అమితాశ్చర్యంలో ముంచెత్తే ఫీట్స్‌. జాదూగర్‌ ఆనంద్‌గా ప్రసిద్దికెక్కిన ప్రముఖ ఇంద్రజాలికుడు అవస్తి ఆనంద్‌ సాధించిన ఘనత ఇది. ఇంద్రజాల ప్రదర్శనలో భాగంగా చిత్తూరు జిల్లా మదనపల్లెకు వచ్చిన జాదూగర్‌ ఆనంద్‌ ‘సాక్షి’తో ముచ్చటించారు.

మీరు ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. వాటిలో అమితంగా ఆకట్టుకున్నవి..?
పద్ధెనిమిదేళ్ళ వయస్సులో ‘అండర్‌ వాటర్‌ ఎస్కేప్‌’గా మొదటి రికార్డు, ఆ తర్వాత ఏడు ‘బ్లైండ్‌ ఫోల్డ్‌ ఫో’తో  రెండో ప్రపంచ రికార్డు సాధించాను. ఇండోర్‌ నుంచి భూపాల్‌ వరకు 210 కిలో మీటర్లు కళ్లకు గంతలు కట్టుకుని స్కూటర్‌ మీద ప్రయాణం చేయడం మర్చిపోలేని సంఘనలు. ఇప్పటి వరకు నాలుగు ప్రపంచ రికార్డులు, 36 దేశాలలో 37 వేలకు పైగా ప్రదర్శనలు నిర్వహించి మూడో ప్రపంచ రికార్డు, అత్యంత వేగవంత మెజీషియన్‌గా నాల్గవ ప్రపంచ రికార్డు సాధించినందుకు ఆనందంగా అనిపిస్తోంది.

షో జరిగే సమయంలో అకస్మాత్తుగా ప్రేక్షకుల్లో ఒక అమ్మాయిని స్టేజీ మీదకు పిలిపించి, ఎలాంటి ఆధారం లేకుండా గాలిలో పైకి లేపడం, మరొకరిని క్షణాల్లో మాయం చేయడం, తిరిగి వారిని ప్రేక్షకుల ముందుకు ప్రత్యక్షమయ్యేలా చేయడం... ఒకటి కావు అన్నీ ఆకట్టుకునేవే. స్టేజీ మీద ప్రదర్శించబడుతున్న సినిమా తెరలోకి వెళ్లి అక్కడి నటుల్ని స్టేజీ మీదకు తీసుకురావడం, అండర్‌ వాటర్‌ ఎస్కేప్‌ ప్రదర్శనలు అమితంగా ఆకట్టుకుంటాయి. ఏదైనా ప్రేక్షకుల అభినందనలు అందుకున్న ప్రతీసారి వారు ఆకట్టుకునే ప్రదర్శనలు ఇచ్చానన్న సంతృప్తి అన్ని రికార్డులకన్నా మించినదిగా భావిస్తాను.

మీ పేరు అవస్తి ఆనంద్‌. జాదూగర్‌ ఆనంద్‌గా ఎలా మారారు?
నేను పుట్టిపెరిగింది మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌ లో. మా కుటుంబంలో అందరూ బాగా చదువుకున్నవారే. ఆ రోజుల్లోనే నాన్న ఏ.పి.అవస్తి డాక్టర్, అమ్మ మహేశ్వరిదేవి ఫ్రొఫెసర్‌. మా ముగ్గురు అక్కయ్యలూ బాగా చదువుకున్నవారు. ఆఖరివాడినైన నేనూ పీజీ చేశాను. ఇప్పుడు నా వయసు అరవైఏడేళ్లు. ఆరేళ్ల వయసులో మా స్కూల్‌కి వెళ్లేదారిలో కొందరు గారడీవిద్య ప్రదర్శించేవారు. రోజూ అక్కడికి వెళ్లి ఆ గారడీ చూసేవాడిని. వాళ్లు గాల్లో నుంచి నాకు లడ్డూలు తీసి ఇచ్చేవారు. రోజూ లడ్డూలు తినేవాడిని.  అప్పుడే అనిపించింది ‘నేనే సొంతంగా గారడీ చేసి లడ్డూలు తెచ్చేసుకుంటే..’ అని. ప్రయత్నించా.. లడ్డూ రాలేదు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాను. ఒక్క లడ్డూ కూడా రాలేదు. కానీ నిరాశపడలేదు, ప్రయత్నాన్నీ వదలలేదు. ఎక్కడ ఏ చిన్న గారడీ, మ్యాజిక్‌ షోలు జరిగినా ఎంత దూరమైనా వెళ్లి చూసేవాడిని.

అలా అలా చిన్న చిన్న మేజిక్‌లు నేర్చేసుకున్నా. వాటిని మా స్కూల్లో ప్రదర్శించేవాడిని. చుట్టూ ఫ్రెండ్స్‌ బాగా ప్రోత్సహించేవారు. ఆ తర్వాత టీచర్లూ మెచ్చుకున్నారు. అక్కణ్ణుంచి గణేష్, దుర్గాదేవి నవరాత్రులలో జరిగే ఉత్సవాలలో ప్రదర్శనలు ఇచ్చేవాడిని. అక్కడ వారు ఇచ్చే డబ్బులు, అమ్మా–నాన్న ఇచ్చే పాకెట్‌ మనీతో ఇంద్రజాలానికి సంబంధించిన పుస్తకాలు కొనేవాడిని. చదివేవాడిని. ప్రాక్టీస్‌ చేసేవాడిని. అలా మొదలైన నా ప్రస్థానం.. అంతర్జాతీయ స్థాయి ‘జాదూగర్‌’గా మార్చింది. నాకెవ్వరూ గురువులు లేరు. స్వయంకృషి, స్వంతప్రయత్నంతోనే ఈ విద్యను సాధించాను.

మీకు గురువెవ్వరూ లేరు అంటున్నారు.. మీ తల్లిదండ్రుల సహకారం లభించలేదా?
లేదు. మా కుటుంబంలో ఏకైక మగ పిల్లవాడైనందున మా అమ్మానాన్నలు నాపై అనేక ఆశలు పెట్టుకుని, నన్ను డాక్టర్‌ చేయాలనుకున్నారు. నేను మెజీషియన్‌గా మారడం వారికి ఇష్టం వుండేది కాదు. అదేమైనా తిండి పెడుతుందా, దేనికి ఉపయోగపడుతుంది..? అనేవారు. అయితే వారి ఇష్టానికి వ్యతిరేకంగా ఇంద్రజాల విద్యలోనే రాణించాను.

నీళ్లలోనూ విన్యాసాలు చేశారు..
స్కూల్లోనూ, కాలేజీలోనూ చిన్న చిన్న మేజిక్‌ షోలు చేసిన నేను పద్దెనిమిదేళ్ల వయసులో సొంతంగా వేదికల మీద ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టాను. ‘అండర్‌వాటర్‌ ఎస్కేప్‌’లో భాగంగా తలకు ముసుగు వేసి, కాళ్లను, చేతులను సంకెళ్లతో బంధించి, ఒక పెట్టెలో పెట్టి తాళం వేస్తారు. ఆ పెట్టెను నదిలో పడేస్తారు. ఆ పెట్టెలో నుంచి తప్పించుకుని బయటకు రావాలి. సంకెళ్లను విడదీసేదెలా? పెట్టె తాళం పగలగొట్టేదెలా? బయటకు ఎలా వస్తాను అని పైన అంతా ఉత్కంఠ. కానీ, నేను కేవలం నలభైసెకన్లలో ఈ విన్యాసాన్ని ప్రదర్శించి నది నుంచి బయటకు వచ్చేశాను. ఇది కూడా స్వతహాగానే నేర్చుకున్నాను.

ప్రపంచ ప్రసిద్ధి పొందిన మీరు ఇక ముందు ఏం చేయబోతున్నారు?
ఇంద్రజాలాన్ని ప్రభుత్వాలు ఓ కళగా గుర్తించాలి. అప్పుడే ప్రాచీన భారతీయ సంస్కృతిలో భాగమైన ఇంద్రజాలాన్ని పరిరక్షించుకోగలుగుతాం. సర్కస్‌ అంటే రష్యాది అని... ఇంద్రజాలం అంటే ఇండియాది అని ప్రపంచం అంతటా పేరుంది. దేశానికి పేరు తెచ్చిన ఇంద్రజాల విద్యను కాపాడుకోవాల్సిన బాధ్యత మనమీదుంది. అన్ని రాష్ట్ర్రాల రాజధానుల్లో మ్యాజిక్‌ అకాడమీలు ఏర్పాటు చేసి ఇంద్రజాలాన్ని ప్రోత్సహించాలి. ఆ దిశగా నా కార్యాచరణను కొనసాగిస్తున్నాను.
– మాడా చంద్రమోహన్,
సాక్షి, మదనపల్లె, చిత్తూరు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top