వేళ్ల మధ్య చర్మం చెడి  ఎర్రబారుతోంది.. ఏం చేయాలి? | Sakshi
Sakshi News home page

వేళ్ల మధ్య చర్మం చెడి  ఎర్రబారుతోంది.. ఏం చేయాలి?

Published Fri, May 18 2018 12:50 AM

Redness of the skin between the fingers? - Sakshi

నా వయసు 56 ఏళ్లు. గృహిణిని.  నా కాళ్లు ఎప్పుడూ తడిలోనే ఉంటుంటాయి. శాండల్స్‌ కూడా వేసుకోను. ఈమధ్య నా కాలి వేళ్ల మధ్యన చర్మం చెడినట్లుగా అవుతోంది. చూడటానికి ఎర్రగా, ముట్టుకుంటే మంటగా అనిపిస్తోంది. నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. 
– పి. ఉదయమ్మ, నిజామాబాద్‌ 

మీరు చెబుతున్నది చాలా సాధారణంగా కనిపించే సమస్య. నీళ్లలో ఎక్కువగా ఉండేవారు, నిత్యం నీళ్లలో కాళ్లు తడుస్తూ ఉండేవారికి ఇది ఎక్కువగా వస్తుంటుంది.  దీన్ని వైద్యపరిభాషలో ‘క్యాండిడియాసిస్‌’ అంటారు. మీ సమస్యను దూరం చేసుకోవడం కోసం మీరు ‘టెర్బినఫైన్‌’ అనే మందు ఉన్న క్రీమును ప్రతిరోజూ ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి చొప్పున నాలుగు వారాల పాటు రాసుకోవాలి. అలాగే ఇట్రకొనజోల్‌ 100 ఎంజీ అనే ట్యాబ్లెట్‌ను పొద్దునే టిఫిన్‌ అయ్యాక వేసుకోవాలి. అన్నిటి కంటే ముఖ్యమైనది కొన్నాళ్ల పాటు మీరు తడిలో, తేమ ఉన్న చోట కాలు పెట్టకుండా జాగ్రత్త తీసుకోవాలి. లేదా అలాంటిచోట్ల తిరగాల్సి వస్తే కాలికి తడి అంటకుండా స్లిప్పర్లు వేసుకొని తిరగండి. 

మీసాలలో విపరీతమైన దురద...  తగ్గేదెలా? 
నా వయసు 28 ఏళ్లు. వృత్తిరీత్యా ప్రతిరోజూ బైక్‌పై ఎక్కువగా తిరుగుతుంటాను. నాకు ప్రతిరోజూ  మీసాలలో విపరీతమైన వస్తోంది. రోమం మూలల్లో ఇది ఎక్కువగా  అనిపిస్తోంది. గత నెల రోజులుగా ఇలా జరుగుతోంది. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి.  – ఎమ్‌. కమల్, హైదరాబాద్‌ 
మీరు పేర్కొన్న వివరాల ప్రకారం మీరు సెబోరిక్‌ డర్మటైటిస్‌ అనే సమస్యతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. ఇది మీ మీసాలు ఉన్న చోట సెబమ్‌ అనే నూనె వంటి దాన్ని  ఎక్కువగా స్రవిస్తుండటంతో వస్తున్న సమస్య. మీ సమస్యను అధిగమించడానికి ఈ సూచనలు పాటించండి.  మొమటోజోన్‌తో పాటు టెర్బనాఫిన్‌ యాంటీ ఫంగల్‌ ఉండే కార్టికోస్టెరాయిడ్‌ కాంబినేషన్‌ క్రీమును ప్రతిరోజూ రాత్రిపూట మీ మీసాల వద్ద చర్మంపై రాసుకోండి. ఇలా పది రోజులు చేయడం వల్ల ఫలితం కనిపిస్తుంది. కొద్ది నెలల పాటు ఐసోట్రెటినాయిన్‌ ట్యాబ్లెట్లను నోటి ద్వారా కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మీ సమస్య పరిష్కారం కోసం ఒకసారి డర్మటాలజిస్ట్‌ను కలవండి.

బొబ్బలువచ్చాయి... మచ్చలుగామారకూడదు అంటే?
నా వయసు 32 ఏళ్లు. రెండు రోజుల క్రితం చూడకుండా వేడిగా ఉన్న పాత్రను చేత్తో పట్టుకున్నాను. వేడిగా ఉందని చూసుకోకపోవడంతో బాగా కాలాయి. బొబ్బలు కూడా వచ్చాయి. అవి తర్వాత ఒంటిపై మచ్చల్లాగా ఉండిపోతాయేమోనని   ఆందోళనగా ఉంది. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి.  – రహమత్‌బానో, గుంటూరు 
మీ అరచేతుల్లో బొబ్బలు వచ్చాయంటే ఆ తీవ్రత సెకండ్‌ డిగ్రీ బర్న్స్‌ను సూచిస్తోంది. ఒకవేళ ఈ బొబ్బలు చాలా పెద్దవిగా ఉంటే మీరు దగ్గర్లోని డర్మటాలజిస్ట్‌ను కలిసి, క్రమం తప్పకుండా డ్రస్సింగ్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు మీరు  మూడు రోజుల పాటు అజిథ్రోమైసిన్‌ వంటి యాంటీబయాటిక్స్‌ కూడా వాడాల్సి ఉంటుంది. ఇక గాయాలపై రోజుకు రెండుసార్లు మ్యూపిరోసిన్‌ అనే యాంటీబయాటిక్‌ పూతమందు వాడాలి. ఇది వారంరోజుల పాటు పూయాల్సి ఉంటుంది. మీ బొబ్బలు ఆ తర్వాత మచ్చలుగా మారకుండా ఉండాలంటే సిల్వర్‌ సల్ఫాడైజీన్‌తో పాటు మైల్డ్‌ కార్టికోస్టెరాయిడ్‌ వాడాల్సి ఉంటుంది. గాయం మానిన తర్వాత కూడా మచ్చలు వస్తే క్లిగ్‌మాన్స్‌ రెజీమ్‌ వంటి స్కిన్‌ లైటెనింగ్‌ క్రీమ్స్‌ను రెండుమూడు వారాలపాటు వాడాల్సి ఉంటుంది. ఆ తర్వాత కోజిక్‌ యాసిడ్, ఆర్బ్యుటిన్, నికోటినమైడ్‌ వంటివి ఉన్న నాన్‌స్టెరాయిడ్‌ క్రీమ్స్‌ వాడాల్సి ఉంటుంది. ఆ తర్వాత కూడా మచ్చలు వస్తే ఫ్రాక్షనల్‌ లేజర్‌ లేదా ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుంది. 

కళ్లజోడు  ఆనేచోట నల్లమచ్చలు... పోయేదెలా? 
నేను గత కొన్నేళ్లుగా కళ్లజోడు వాడుతున్నాను. అది ఆనుకునే చోట ముక్కు ఇరువైపులా నల్లటి మచ్చలు వచ్చాయి. కొన్ని క్రీములు కూడా వాడి చూశాను. అయినా ఎలాంటి  ఫలితం లేదు. ముక్కుకు ఇరువైపుల ఉన్న ఈ మచ్చలు తగ్గిపోయే మార్గం చెప్పండి.  – సుమ, రాజంపేట 
కళ్లజోడును ఎప్పుడూ తీయకుండా, నిత్యం వాడేవారికి, ముక్కుపై అది రాసుకుపోవడం (ఫ్రిక్షన్‌) వల్లæఇలాంటి సమస్య రావడం చాలా సాధారణం. అక్కడి చర్మంలో రంగుమార్చే కణాలు ఉత్పత్తి (పిగ్మెంటేషన్‌) జరిగి, ఇలా నల్లబారడం మామూలే. కొన్నిసార్లు అలా నల్లబడ్డ చోట దురద కూడా రావచ్చు. మీ సమస్య తొలగడానికి ఈ కింది సూచనలు పాటించండి. n మీకు వీలైతే కళ్లజోడుకు బదులు కాంటాక్ట్‌ లెన్స్‌లు వాడండి n కోజిక్‌ యాసిడ్, లికోరిస్, నికోటినెమైడ్‌ ఉన్న క్రీమును మచ్చ ఉన్న ప్రాంతంలో రాయండి n అప్పటికీ ఫలితం కనిపించకపోతే మీకు దగ్గర్లోని డర్మటాలజిస్ట్‌ను కలవండి.
డాక్టర్‌ స్మిత ఆళ్లగడ్డ
చీఫ్‌ ట్రైకాలజిస్ట్‌ – డర్మటాలజిస్ట్, 
త్వచ స్కిన్‌ క్లినిక్, గచ్చిబౌలి, హైదరాబాద్‌ 

Advertisement
Advertisement