నీ పక్కన చోటుందా? 

Real story to old women deepika d.nayak - Sakshi

వైరల్‌

‘‘అది ముంబై మహానగరంలోని విరార్‌ స్టేషన్‌. అక్కడి నుంచి పరుగున వచ్చి చర్చ్‌గేట్‌ లోకల్‌ ట్రెయిన్‌ సెకండ్‌ క్లాస్‌ కంపార్ట్‌మెంట్‌లో లేడీస్‌ డబ్బా ఎక్కాను. కిటకిటలాడిపోతున్న ఆ డబ్బాలో  ఎలాగో చోటు సంపాదించుకుని కూర్చున్నాను. కాస్త అలసట తీర్చుకున్నాక నా దృష్టి ఎదురుగా నిలుచుని ఉన్న ఒక వృద్ధురాలి మీద పడింది. బక్కపల్చగా, ముతక దుస్తులు ధరించి, చేతిలో ఒక పాత బట్టల మూట పట్టుకుని ఉన్న ఆమె ‘‘అమ్మా! మీరు కొద్దిగా సర్దుకుంటే నేను కూడా కూచుంటాను’’ అని అడిగింది. ఆ పర్సనాలిటీకి కొద్దిస్థలం సరిపోతుంది. అయితే అక్కడ అంగుⶠం కూడా ఖాళీలేనట్టుగా అందరూ సీట్లకు అతుక్కుని కూర్చున్నారు.  అది చూసి నేను నా సీటులోంచి లేచి కాస్తంత సర్దుకుంటే ఆ పెద్దావిడ కూడా కూచుంటుంది కదా అన్నాను. కొందరు కొద్దిగా మెత్తబడ్డారు కానీ, అసలు విషయం ఏమిటంటే, ఖాళీ లేకపోవడం వల్ల కాదు, ఆమె అవతారం చూస్తుంటే వారికి తమ పక్కన ఆమెకి చోటివ్వబుద్ది కావడం లేదని, అందుకే సర్దుకుని కూర్చోడానికి ఇష్టపడటం లేదని అర్థమైంది. 

దాంతో నేనే కొంచెం జరిగి, నా పక్కన కూచోబెట్టుకున్నాను. కానీ ఇందాక జరిగిన సంఘటన ఆమెను ఎంతగా బాధపెట్టి ఉంటుందో అనిపించి దిగులేసింది. ఊరుకోలేక అదే మాట ఆమెతో అన్నాను– మీరు బాధపడకండమ్మా వాళ్ల ప్రవర్తనకు అని. అందుకామె చిన్నగా నవ్వి చెప్పింది ‘‘దాని గురించి నేనెప్పుడూ బాధపడనమ్మా. వాళ్ల విసుర్లు, ఛీత్కారాలు, చీదరింపులు అన్నీ మహా అయితే ఓ గంటసేపు పట్టే ప్రయాణం వరకే కదా! 65 సంవత్సరాల నా జీవన గమ్యంలో ఆ గంట ప్రయాణం ఎంత!? అయితే ఈ బక్కపల్చటి ముసలామె ఒకప్పుడు రాష్ట్రస్థాయిలో ప్రశంసలు పొందిన హాకీ ప్లేయరని తెలియకపోవడం వారి తప్పు కాదు కదమ్మా! ముతక బట్టలు ధరించిన ఈ ముసల్ది ఫ్రెంచి ఎంబసీలో భారతదేశం తరఫున పని చేసిన దుబాసీ అని తెలియకపోవడం వారి తప్పు కాదు కదా! విడిచిన బట్టలు మూట చేతపట్టుకుని, ముతక దుస్తులు కట్టుకుని సాదా సీదాగా ఉన్న ఈ అనాకారి ముసలామె వయసులో ఉన్నప్పుడు పార్ట్‌ టైమ్‌ మోడల్‌గా పని చేసిందని వారికేమైనా తెలుసా? చిన్నగా నెడితే చాలు తూలి పదిచోట్ల పడిపోయేంత బలహీనంగా ఉన్న ఈ బక్కపీనుగ తన భర్తని, ఏకైక కుమార్తెని కోల్పోయినా తట్టుకోగలగడమేగాక, జీవితంలో ఆనందాన్ని వెదుక్కుంటూ జీవన గమ్యాన్ని కొనసాగిస్తున్నంత బలమైనదని తెలిస్తే వారలా ప్రవర్తించరు కదా!

 నా ఆకారాన్ని, వాలకాన్ని చూసి ‘ఎప్పుడైనా ఈ రైలు ముఖం చూసెరుగుదువా?’ అంటూ చులకన చేసిన ఆ ముఖాలకు ఈ ముసల్దానికి దాదాపు యాభై ఏళ్లుగా ముంబై లోకల్‌ ట్రెయిన్‌లో ప్రయాణం అలవాటని తెలుసా? కృష్ణారామా అనుకుంటూ ఇంట్లోనో లేదా వృద్ధాశ్రమంలోనో మూలుగుతూ పడి ఉండక, ఇంత రద్దీగా ఉండే ఈ రైలు ఎక్కి విరార్‌ నుంచి బాంద్రాకు ప్రయాణం చేయడం కొన్ని సంవత్సరాలుగా జరుగుతూనే ఉందని, అదీ అభాగ్యులైన పిల్లలకు పాఠాలు చెప్పడం కోసమని వారికేమైనా తెలుసా తల్లీ?  మాసిపోయిన అట్టతో, ముట్టుకుంటే చాలు పొడి పొడిగా అయేలా ఉన్న పుస్తకాన్ని చూసి, అందులో విషయమేమీ ఉండదని నిర్ధారించడానికి వాళ్లేమైనా న్యాయనిర్ణేతలా అమ్మా?’’ అని అడుగుతుంటే ఆమె పక్కన కూర్చుని ప్రయాణం చేయడానికి నేను ఎంత అదృష్టం చేసుకుని ఉంటానో అనిపించి గర్వంతో కూడిన పులకరింత కలిగింది. వెంటనే ఆమెతో సెల్ఫీ తీసుకోవాలనుకున్న నా కోరికను ఏమాత్రం అణచుకోలేకపోయాను. మేము విడిపోయేటప్పుడు ఆమె నా కళ్లలో కదలాడుతున్న భావాలను చదివినట్లుగా అంది– ‘సంజీవని అనే మొక్క పేరును అందరూ వినే ఉంటారు. అది ప్రాణం పోసేలా ఉండాలనుకుంటాంగానీ అందంగా ఉండాలని అనుకుంటామా? నీ గుణమే నువ్వు’.ఫేస్‌బుక్‌లో దీపికా డి. నాయక్‌ అనే ఆమె పంచుకున్న జ్ఞాపకాల పరిమళాలివి. 
– డి.వి.ఆర్‌.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top