మామిడిని ఆశించే తెగుళ్లకు సేంద్రియ పద్ధతుల్లో నివారణ

Prevention of organic farming for mango pests - Sakshi

బూడిద తెగులు, ఆకుమచ్చ తెగులు, మసి తెగులు.. ఇవి మామిడి తోటల్లో కనిపించే ప్రధాన తెగుళ్లు. వీటి నివారణకు సేంద్రియ పద్ధతుల్లో రైతులు అనుసరించదగిన నివారణ చర్యలను సుస్థిర వ్యవసాయ కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్‌ జి. రాజశేఖర్‌ (83329 45368) ఇలా సూచిస్తున్నారు.

బూడిద తెగులు (పౌడరీ మిల్‌ డ్లూ్య)
లక్షణాలు: కాడలపై, పూల మీద, చిరుపిందెల మీద తెల్లని పౌడరు లాంటి బూజు ఏర్పడుతుంది. ఈ బూజు వల్ల పూలు, పిందెలు వడలిపోయి రాలిపోతాయి. పంటకు నష్టం కలుగుతుంది. 

నివారణ: ∙పూత, మొగ్గలు కనిపించిన వెంటనే లీటరు నీటికి 3 గ్రాములు ‘నీటిలో కరిగే గంధకా’న్ని కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి 
►శొంఠిపాల కషాయం కూడా ఒకసారి పిచికారీ చేయవచ్చు. 

ఆకుమచ్చ తెగులు
లక్షణాలు: ఈ తెగులు కొల్లోటోట్రైకం అనే బూజు (శిలీంధ్రం) వల్ల వస్తుంది. వర్షాలు లేదా పొగమంచు అధికంగా ఉన్న సమయాల్లో దీని వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఆకుల మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడి క్రమంగా మచ్చలు కలిసిపోయి ఆకులు త్వరగా పండుబారి రాలిపోతాయి. లేత రెమ్మలపై నల్లని మచ్చలు ఏర్పడి పూలగుత్తులు, పూలు మాడిపోతాయి. తెగులు సోకిన కాయలపై నల్లటి గుంత మచ్చలు ఏర్పడి కాయలు కుళ్లిపోతాయి. 

నివారణ: పూత దశకు ముందే ఎండిన కొమ్మలను తీసివేసి వాటిని నాశనం చేయాలి ∙బోర్డో మిశ్రమం 1 శాతం లేదా 3 గ్రాముల కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ చెట్లపై పిచికారీ చేయాలి ∙బాగా పులిసిన పుల్లని మజ్జిగ 6 లీటర్లు + 100 గ్రాముల ఇంగువను 100 లీటర్ల నీటిలో కలిపి చెట్లపై 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. 

మసి తెగులు (సూటీ మోల్డ్‌)
లక్షణాలు: ఈ తెగులు ‘క్యాప్నోడియం’ అనే శిలీంధ్రం ద్వారా వస్తుంది. రసం పీల్చే తేనెమంచు పురుగు, పిండినల్లి విసర్జించిన తియ్యని పదార్థం ఆకుల మీద పిందెలు, కాయల మీద పడి నల్లటి మసిలా పెరుగుతుంది. దీనివల్ల కిరణజన్య సంయోగ క్రియకు అంతరాయం కలుగుతుంది. కాయ సైజు తగ్గిపోయి, రాలిపోతాయి. 


నివారణ: రసం పీల్చే పురుగులను 5 శాతం వేప కషాయం లేదా నీమాస్త్రం ఉపయోగించి అరికట్టాలి. 2 కిలోల గంజి పొడి(స్టార్చి)ని 5 లీటర్ల వేడి నీటిలో కలిపి, దీనికి 100 లీటర్ల నీటిని చేర్చి గంజి ద్రావణం తయారు చేయాలి. గంజి ద్రావణాన్ని మసి తెగులు సోకిన చెట్ల కొమ్మలకు, ఆకులపై కాయలపై బాగా తడిసేటట్లు పిచికారీ చేయాలి. 

నీమాస్త్రం 
రసంపీల్చే, ఇతర చిన్న చిన్న పురుగుల నివారణకు నీమాస్త్రం పనికివస్తుంది. 5 కిలోల పచ్చి వేపాకు ముద్ద (బాగా నూరిన) లేదా 5 కిలోల ఎండు ఆకులు లేదా వేప పండ్ల పొడిని 100 లీటర్ల నీటిలో వేయాలి. అందులో 5 లీటర్ల గో మూత్రం, 1 కిలో ఆవు పేడను కలపాలి. తర్వాత ఒక కర్ర సహాయంతో బాగా కలపాలి. 24 గంటల వరకు మూత పెట్టి మురగబెట్టాలి. ఆ తర్వాత గుడ్డతో వడకట్టుకొని, పంటలకు పిచికారీ చేసుకోవాలి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top