పరి పరిశోధన | Periodical research | Sakshi
Sakshi News home page

పరి పరిశోధన

Dec 25 2017 1:32 AM | Updated on Dec 25 2017 1:32 AM

Periodical research - Sakshi

వైరస్‌లను ఖతం చేసే బుల్లి యంత్రాలు!
తనలోకి చొచ్చుకుపోయే వైరస్‌లను కణాలు ఎలా చంపుతాయి? అది కూడా తనకు హాని జరక్కుండానే? ఆసక్తికరమైన ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కున్నారు యూటా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. డీఎన్‌ఏ పోగుల్లా ఉండే వైరస్‌లలోని రసాయనాలను క్రమేపీ కత్తిరించేసే బుల్లి యంత్రాల్లాంటివి కణాల్లో ఉంటాయని వీరు ఈగలపై జరిపిన పరిశోధనల ద్వారా తెలుసుకున్నారు. బుల్లి యంత్రం అనగానే ఇదేదో కత్తెరలు, రంపాలతో ఉండదు.

జన్యువుల ద్వారా ఉత్పత్తి అయ్యే ఒక ప్రొటీనే... కణాల్లోకి వైరస్‌లు చొచ్చుకు రాగానే చైతన్యవంతమైపోయి.. వాటిని కత్తిరించేస్తాయని, తద్వారా ఇన్ఫెక్షన్‌ విస్తరించకుండా అడ్డుకుంటాయని అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పీటర్‌ షెన్‌ తెలిపారు. కణం లోపల వైరస్‌లు తమని తాము కాపీ చేసుకుని పెరిగిపోవడం ద్వారా ఇన్ఫెక్షన్‌ను వ్యాప్తి చేస్తాయన్నది తెలిసిందే. ఇంగ్లిష్‌ అక్షరం ‘ఎల్‌’ ఆకారంలో ఉండే ఈ ప్రొటీన్‌కు ‘డైసర్‌’ అని పేరు పెట్టారు. వైరస్‌ దగ్గరకు రాగానే డైసర్‌ దాంట్లో ఉండే తాడులాంటి డీఎస్‌ ఆర్‌ఎన్‌ఏను పట్టుకుని ముకకలు ముక్కలుగా చేస్తుంది.

సాధారణ డీఎస్‌ ఆర్‌ఎన్‌ఏకు, వైరస్‌లు ఉత్పత్తి చేసే వాటికి మధ్య ఉన్న స్వల్పమైన తేడా ఆధారంగా డైసర్‌ వాటిని గుర్తించగలదని పీటర్‌ తెలిపారు. డైసర్‌ లాంటిదేదో ఒకటి ఉందని చాలాకాలంగా తెలిసినప్పటికీ అది ఏమిటి? ఎలా పనిచేస్తుందన్న అంశంపై మాత్రం స్పష్టత లేదని.. తమ ప్రయోగాలను మానవుల్లో వైరస్‌ ఇన్ఫెక్షన్లను మరింత సమర్థంగా తొలగించేందుకు ఉపయోగించవచ్చునని ఆయన వివరించారు.

చూస్తే.. వాసన పీలిస్తే... ఆకలి తగ్గుతుందా?
అహ నా పెళ్లంట సినిమాలో ఓ సీన్‌ ఉంటుంది. పిసినారి కోట శ్రీనివాసరావు కోడిని వేలాడదీసి.. దాన్ని చూస్తూ ఆహా.. ఓహో అని లొట్టలేస్తూ అన్నం తింటూ ఉంటాడు. అది చూసి సుత్తి వీరభద్రరావుకు పిచ్చెక్కే విషయాన్ని కాసేపు పక్కన బెడితే.. ఆహారాన్ని తినకుండా కేవలం చూస్తేనో.. లేదంటే వాసన పీలిస్తేనో మన ఆకలి తగ్గిపోతుందా? అవుంటున్నారు పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. బాగా ఆకలేసినప్పుడు ఇలా చేస్తే మెదడులో తినాలన్న కోరికను పుట్టించే న్యూరాన్లు కొద్దిసేపు పనిచేయకుండా పోతాయని జె.నికోలస్‌ బెట్లీ అనే శాస్త్రవేత్త తెలిపారు.

‘‘ఈ న్యూరాన్లు పనిచేస్తూన్నంత సేపు అవి ఆకలవుతోంది.. ఏదైనా తిను అనే సంకేతాలు మెదడుకు పంపుతూ ఉంటాయి’’ అని... మన ఆహారంలోని పోషకాల ఆధారంగా ఈ అలారమ్‌ పనిచేస్తూంటుందని వివరించారు. ఎలుకలపై చేసిన కొన్ని ప్రయోగాల ద్వారా తాము ఈ అంచనాకు వచ్చామని వివరించారు. ఆహారం జీర్ణమయ్యే సమయంలో శరీరంలో విడుదలయ్యే కొన్ని ఎంజైమ్‌లను ఎక్కించినప్పుడు ఈ న్యూరాన్ల క్రియను తక్కువ చేశాయని చెప్పారు.

ఇంకోలా చెప్పాలంటే ఆకలి లేకుండా పోతుందన్నమాట. ఊబకాయాన్ని తగ్గించుకునేందుకు, తద్వారా ఇతర ఆరోగ్య సమస్యలను ముందుగానే అడ్డుకునేందుకు ఇదో మార్గమని నికోలస్‌ అంటున్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో మనిషి దీర్ఘకాలం అంతరిక్ష ప్రయాణాలు చేసే పరిస్థితి ఉన్నప్పుడు ఆహారాన్ని సమర్థంగా వాడుకునేందుకూ ఈ టెక్నిక్‌ను వాడుకోవచ్చునని సూచిస్తున్నారు.  

దాల్చిన చెక్కతో కొవ్వు కరుగుతుంది!
విషయం పాతదేగానీ.. ఇంకోసారి శాస్త్రీయంగా ఆధారాలు దొరికాయి కాబట్టి ఇంకోసారి దీన్ని ప్రస్తావించాల్సి వస్తోంది. ఏంటా విషయం అంటారా? దాల్చిన చెక్క వాడితే కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది అని! ఒక చెట్టు బెరడైన దాల్చిన చెక్కను ఆయుర్వేదంతో పాటు చాలారకాల ఇతర వైద్య విధానాల్లోనూ మందుగా ఏళ్లుగా వాడుతున్న సంగతి తెలిసిందే. తాజా పరిశోధనల ద్వారా ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకూ ఉపయోగపడుతుందని స్పష్టమైంది. అధిక కొలెస్ట్రాల్‌ కారణంగా ఏటా కొన్ని లక్షల మంది మరణిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో కొంతమంది మధుమేహులను ఎంచుకుని వారికి ప్రతిరోజూ దాదాపు ఆరు గ్రాముల దాల్చిన చెక్క పొడి అందించడం మొదలుపెట్టారు. నాలుగు నెలల తరువాత పరిశీలిస్తే రక్తంలోని హానికారక ట్రైగ్లిజరైడ్లతోపాటు కొలెస్ట్రాల్‌ కూడా తగ్గినట్లు స్పష్టమైంది. అయితే ఇది ఎల్‌డీఎల్, హెచ్‌డీఎల్‌లపై మాత్రం ఎలాంటి ప్రభావం చూపలేదు. ఇంకో అధ్యయనంలోనూ ఇదే విషయం రూఢి అయింది. అయితే దీంట్లో ఉండే కౌమారిన్‌ అనే పదార్థంతో కాలేయంపై దుష్ప్రభావం చూపుతుందని ఇతర పరిశోధనలు చెబుతున్న నేపథ్యంలో ఎంత మోతాదులో తీసుకోవాలన్న అంశంపై ప్రశ్నలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో శరీర బరువులో ప్రతి కిలోకు 0.1 మిల్లీ గ్రాముల చెక్క తీసుకోవడం మేలని యూరోపియన్‌ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement