ఆకు కూరలతో బుర్రకు పదును! | Periodical research | Sakshi
Sakshi News home page

పరి పరిశోధన

Dec 23 2017 1:14 AM | Updated on Dec 23 2017 8:17 AM

Periodical research - Sakshi

ఆకు కూరలతో బుర్రకు పదును!
ఆకు కూరలు తింటే ఆరోగ్యం బాగుపడుతుందని చాలాసార్లు విని ఉంటాం. ఇందులో గొప్ప విశేషమేమీ లేకపోవచ్చు. కాకపోతే ఇవే ఆకు కూరలు ప్రతిరోజూ తింటూ ఉంటే... వయసుతో పాటు మెదడు పనితీరు మందగించడానన్నీ తగ్గిస్తుందని అంటున్నారు రూథ్‌ యూనివర్శిటీ మెడికల్‌ సెంటర్‌ శాస్త్రవేత్తలు. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే పదకొండేళ్లలో మెదడుకు జరిగే నష్టాన్ని ఒక్క రోజు ఆకుకూరలు తినడం ద్వారా పరిహరించవచ్చు. షికాగో ప్రాంతంలో నివసిస్తున్న దాదాపు వెయ్యిమంది వృద్ధులు (81 ఏళ్ల సగటు వయసు) పై పదేళ్లపాటు జరిపిన పరిశోధనల ద్వారా తాము ఈ అంచనాకు వచ్చినట్టు మార్థా క్లెయిర్‌ మోరిస్‌ అనే శాస్త్రవేత్త తెలిపారు.

మతిమరపు వంటి లక్షణాలేవీ లేని సమయంలో పరిశోధన మొదలుపెట్టామని, జ్ఞాపకశక్తి, ఆలోచనలకు సంబంధించి ఏటా పరీక్షలు పెట్టి చూశామని వివరించారు. వీటితోపాటు వారు ఎంత తరచుగా ఆకుకూరలు తింటూండేవారో తెలుసుకున్నామని మార్థా వివరించారు. ఈ అంశం ఆధారంగా వారిని ఐదు గుంపులుగా విభజించి పరిశీలనలు జరిపామని, రోజూ ఒక కప్పు కంటే ఎక్కువ ఆకుకూరలు తినే వారి మెదడు పని తీరుతో పోలిస్తే తక్కువ తినే వారి పని తీరు తక్కువగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఈ ఐదు గుంపుల మధ్య ఉన్న తేడాల ఆధారంగా ఒక కప్పు ఆకు కూరలతో 11 ఏళ్ల నష్టాన్ని నివారించవచ్చునన్న అంచనాకు వచ్చినట్లు చెప్పారు.

గ్లూకోజ్‌ ఎంతుందో చెప్పేస్తుంది..
మధుమేహులకు రక్తంలో చక్కెర మోతాదు ఎంతుందో తెలుసుకోవడం రోజువారీ పని. అయితే ఇందుకోసం సూదులతో గుచ్చుకోవడమంటే ఎవరికైనా కష్టమే. ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఉండనే ఉంది. ఇన్ని కష్టాలు ఉండటం వల్లనే చాలామంది మధుమేహులు రోజువారీ పరీక్షలకు వెనుకాడుతూ ఉంటారు. అయితే ఇకపై ఈ సమస్యలు దూరం కానున్నాయి. ఎలాగంటారా? షింగుహువా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సరికొత్త ప్యాచ్‌ సిద్ధం చేశారు మరి.

రెండు దశల్లో  పని చేసే ఈ ప్యాచ్‌తో సూది గుచ్చుకోకుండానే రక్తంలోని చక్కెర శాతం ఎంత అన్నది చెప్పేస్తుంది. ఈ ప్యాచ్‌ను చర్మంపై అతికించుకునే ముందు అక్కడ కొంచెం హైయాలోరొనిక్‌ యాసిడ్‌ను వేసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత ప్యాచ్‌పై ఓ కాగితం బ్యాటరీని ఉంచుతారు. ఫలితంగా యాసిడ్‌ కాస్తా కరిగి చర్మం లోపలికి వెళ్లి అక్కడ ఉన్న గ్లూకోజ్‌ను ఉపరితలంపైకి తెస్తుంది. దాదాపు 20 నిమిషాల తరువాత ప్యాచ్‌పై ఓ బయో సెన్సర్‌ను ఉంచితే చక్కెర మోతాదు ఎంతో తెలుపుతుంది. తాము ఇప్పటికే ఈ ప్యాచ్‌ను చైనాలోని కొన్ని ఆసుపత్రుల్లో మనుషులపై ప్రయోగించి చూశామని ప్యాచ్‌ ద్వారా వచ్చిన ఫలితాలు మెరుగ్గానే ఉన్నాయని, పరీక్షలు చేయించుకున్న కార్యకర్తలు కూడా ఎలాంటి బాధ అనుభవించలేదని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త తెలిపారు.

ఒంటరితనంతో ఆయువుకు హానికరం
ఆహారంలో మితిమీరిన కొవ్వు, ఎడాపెడా తగలేసే సిగరెట్లు, మోతాదుకు మించిన మద్యం ఆరోగ్యానికి హానికరమని అందరికీ తెలిసిన విషయమే. ఈ జాబితాలోకి ఒంటరితనాన్ని కూడా చేర్చాలంటున్నారు శాస్త్రవేత్తలు. మితమీరిన కొవ్వు, ధూమపానం, మద్యపానం మాదిరిగానే ఒంటరితనం కూడా మనుషుల ఆయువును హరించేస్తుందని హెచ్చరిస్తున్నారు.

రోజుకు పదిహేను సిగరెట్లు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంత చేటు జరుగుతుందో కుటుంబంలో అయిన వారి తోడు లేకుండా, సామాజిక సంబంధాలు కూడా పెద్దగా లేకుండా ఒంటరి జీవితం గడపడం వల్ల కూడా దాదాపు అంతే చేటు జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్యూయెర్టో రికోలోని ఎక్సెటర్‌ యూనివర్సిటీ, అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తలు ఒంటరి వ్యక్తులపై జరిపిన పరిశోధనల్లో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఒంటరితనం వల్ల గుండెకు, మెదడుకు చాలా హాని జరుగుతుందని, దీర్ఘకాలిక ఒంటరితనం ఆయువును హరించేస్తుందని ఈ శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement