వేడి తగ్గించే వినూత్న పదార్థం!

Periodical research - Sakshi

నాటింగ్‌హామ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ వినూత్న ఆవిష్కరణ చేశారు. తనంతట తానే ఉష్ణోగ్రతను తగ్గించుకునే ఓ పదార్థాన్ని తయారు చేయగలిగారు. అంతేకాదు.. ఈ పదార్థంతో కాలిన గాయాలకు మెరుగైన చికిత్స కల్పించవచ్చు... అంతరిక్షంలో రేడియోధార్మికత తదితర శక్తుల నుంచి రక్షణ పొందవచ్చు కూడా. కృత్రిమ ప్లాస్టిక్‌... అతిసూక్ష్మస్థాయి చానెళ్లు.. కొన్ని ద్రవాలతో రూపొందిన ఈ కొత్త పదార్థం ధర్మాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవచ్చు.

మొక్కలు, మానవ శరీరాల మాదిరిగా పనిచేసే ఈ పదార్థం కాలిన గాయాల నుంచి వేడిని తొలగించేందుకు బాగా ఉపయోగపడుతుందని.. తద్వారా గాయం తొందరగా మానేందుకు అవకాశం ఏర్పడుతుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్‌ మార్క్‌ ఆల్ట్‌సన్‌. అంతేకాకుండా.. అంతరిక్ష ప్రయాణాల్లో సౌర రేడియోధార్మికత కారణంగా వేడి విపరీతంగా పెరిగిపోతూంటుందని.. ఈ వేడిని క్రమ పద్ధతిలో తగ్గించడం.. ఒక దగ్గర కేంద్రీకృతమయ్యేలా చేయడం.. ఆ తరువాత ఆ వేడిని విద్యుత్తుగా మార్చగలగడం ఈ పదార్థం ప్రత్యేక లక్షణమని వివరించారు. ప్రస్తుతం తాము ఈ పదార్థాన్ని పరిశోధనశాలలో ప్రయోగాత్మకంగా పరిశీలించి చూశామని.. తగినన్ని నిధులు సమకూర్చుకున్న తరువాత వాణిజ్య స్థాయిలో పరిశోధనలు చేస్తామని వివరించారు.

మూర్ఛను ముందుగా గుర్తించే పరికరం...
మూర్ఛ లక్షణాలు ఎప్పుడు కనిపిస్తాయో చెప్పడం కష్టం. ఏమాత్రం ముందు తెలిసినా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అనవసరమైన గాయాలు, ప్రాణాపాయం నుంచి రక్షణ పొందవచ్చు. ఐండోహోవెన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఇప్పుడు అచ్చంగా అలాంటి యంత్రాన్ని తయారు చేశారు. చేతి కంకణం మాదిరిగా తొడుక్కునే ఈ యంత్రాన్ని తాము 28 మంది రోగులపై పరీక్షించి సత్ఫలితాలు సాధించామని... మూర్ఛ వచ్చే ముందు ఈ యంత్రం ఓ అలారం మోగిస్తుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్‌ జొహాన్‌ అరెండ్స్‌ తెలిపారు.

గుండె కొట్టుకునే వేగం, కదలికలను గుర్తించే సెన్సర్ల ద్వారా ఈ యంత్రం పనిచేస్తుందని చెప్పారు. పరీక్షల సమయంలో ఈ యంత్రం 96 శాతం సందర్భాల్లో ముందస్తు హెచ్చరికలు జారీ చేసిందని వివరించారు. మూర్ఛ రోగం ఉన్నవారిలో ఆకస్మిక దాడుల కారణంగా 20 శాతం మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుందని.. ఈ యంత్రాన్ని వాడటం ద్వారా మరణాలను గణనీయంగా తగ్గించవచ్చునని చెప్పారు. శబ్దాలు, వీడియోల ద్వారా కూడా అలారం పని చేసేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

వాయు, ధ్వని కాలుష్యంతో గుండెజబ్బులు!
వాహనాల ద్వారా వెలువడే కాలుష్యం ఒక్కటే గుండెకు సమస్య కాదు.. వీధుల్లోని రణగొణ ధ్వనులు కూడా గుండెపోటుకు దారి తీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు స్విట్జర్లాండ్‌కు చెందిన ట్రాపికల్‌ అండ్‌ పబ్లిక్‌హెల్త్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. స్విట్జర్లాండ్‌లో 2000 నుంచి 2008 వరకూ గుండెపోటుతో మరణించిన వారి వివరాలను పరిశీలించడం ద్వారా తామీ అంచనాకు వచ్చినట్లు ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మార్టిన్‌ రిసీ తెలిపారు.

ఉపగ్రహ చిత్రాల సాయంతో గాల్లోని కాలుష్యకారక కణాల మోతాదులు, స్విట్జర్లాండ్‌లోని మొత్తం 1834 కేంద్రాల నుంచి సేకరించిన నైట్రోజన్‌ డయాక్సైడ్‌ వివరాలను... ఎనిమిదేళ్ల మధ్యకాలంలో గుండెపోటుతో మరణించిన 19,261 మంది వివరాలతో జోడించి చూసినప్పుడు ఈ ఫలితాలు వచ్చినట్లు రిసీ తెలిపారు. కాలుష్య కారక కణాలు పార్టిక్యులేట్‌ మ్యాటర్‌ 2.5 ఎక్కువైన కొద్దీ మరణాల రేటు కూడా ఎక్కువవుతున్నట్లు ఈ అధ్యయనం ద్వారా తెలిసిందని అలాగే ప్రతి ట్రాఫిక్‌ రణగొణ ధ్వనుల మోతాదు పది డెసిబెల్స్‌ పెరిగితే గుండెపోటు వచ్చే అవకాశం రెండు శాతం వరకూ పెరిగిందని చెప్పారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top