వీళ్లకా.. వృద్ధాప్యమా?


నూరేళ్లూ నిండటం అనే మాట దేనికి చిహ్నమో తెలిసిందే... కాటికి కాళ్లు చాపడం అంటే దాన్నుంచి దూరంగా పరుగెత్తడమే అంటూ ‘నూరేళ్లూ నిండాక’ మారథాన్ సాధించాడో మహాసాహసి. భాషతో భాసిస్తూ ధగధగలాడే మహాశ్వేతసౌధంలా నిలిచిందో  నవకవన యువతి. తాతే కదా అని పంచ్ ఇస్తే తాట తీస్తా అంటూ హెచ్చరించాడో వృద్ధయువకుడు. కష్టాలు కత్తిగట్టి, నష్టాలు నడిచివచ్చి హలో అంటే చెలో, చెలో అంటూ వాటిని చెండాడుతూ తరిమాడు హనీబీ కంటే ఎక్కువగా కష్టపడి తెరపై తేనెలూరించిన బిగ్ బీ! ఏ యువతకూ తీసిపోని ఈ యువతరాన్నిచూసి. వీళ్ల నుంచి స్ఫూర్తి పొందడానికే... వీళ్ల వృత్తాంతాలు!

 

బామ్మమాట బంగారు బాట...

హాబి



ఆస్ట్రేలియాకు చెందిన జాన్ బాయ్‌డ్ వయసు 71 సంవత్సరాలు. వేగంగా సైకిల్ తొక్కే తీరును చూస్తుంటే... ఆమె వయసును ఎక్కువ చేసి చెప్పారేమో అనే భ్రమ కలుగుతుంది.‘‘ఈ వయసులో ఈ సాహహం ఎందుకు బామ్మా’’ అని ఇంటివారు, పొరుగు వారు వారించినా వేల మైళ్ల దూరం సైకిల్ మీద ప్రయాణం చేసి, విజయవంతంగా తిరిగివచ్చింది. బామ్మకు ఏడు మంది సంతానం. ఇరవై మంది మనవళ్లు, మనవరాళ్లు. ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి ‘సిటిజన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్’ అందుకున్న ఈ బామ్మ ‘మనకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకొని అందులో తలమునకలవుతుంటే, అనారోగ్యం ఎప్పుడూ దరిచేరదు’’ అంటున్నారు.

 

 గాల్లో తేలినట్లుందే...వయసు తగ్గినట్లుందే!

 సాహసం

 

వస్త్రప్రపంచ రారాజుగా పేరు గాంచిన విజయపథ్ సింఘానియా (67)కు ఇంట్లో నుంచి కాలు కదపకుండా సుఖాలు అనుభవించేంత ఆస్తి ఉంది. అయితే ఆయన ఏదో ఒక రూపంలో కష్టపడడానికే ఇష్టపడతారు. ‘హాట్ ఎయిర్ బెలూన్ ద్వారా కొన్ని గంటల పాటు గాలిలో ప్రయాణించాలనుకుంటున్నాను’ అని ఆయన అన్నప్పుడు ఈ వయసులో రిస్క్ అవసరమా? అని కొందరు గొణుకున్నారు. ముంబాయిలోని 22 అంతస్తుల బిల్డింగ్ నుంచి హాట్ బెలూన్‌కు అమర్చిన క్యాబిన్ ద్వారా ఆయన 69,000 అడుగుల ఎత్తుకు ఎగిరి 5 గంటల తరువాత తిరిగి వచ్చారు.‘సాహసంతో చెలిమి చేయడానికి వయసు ఆటంకం కాదని చెప్పడానికే ఈ పని చేశాను’ అని సగర్వంగా చెప్పారు సింఘానియా.

 

 ఆరోగ్యంగా... ఆనందంగా!

 మిస్టర్ యూనివర్స్

 

మిస్టర్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయుడుగా మనోహర్ 102 సంవత్సరాల వయసులోనూ ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన బగైహతి (పశ్చిమబెంగాల్)లో నివసిస్తున్నారు. బాడీబిల్డింగ్ అనేది కేవలం శరీరానికి సంబంధించిన విషయం కాదని దానిలో మనసు కూడా నిమగ్నమవుతుందని అంటారు మనోహర్. పొగతాగడం, పొగాకు నమలడం లాంటి అలవాట్లను ఎప్పుడూ దరి చేరనివ్వలేదు.‘‘ఎంత ఎక్కువ కాలం జీవించాం అనేదికాదు, జీవించినంత కాలం చురుకుగా, ఉత్సాహంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. ఇదే నన్ను ఆరోగ్యంగా ఉంచుతుంది’’ అంటున్నారు మనోహర్.

 

వయసు సగం అవుతుంది...

 సేవ

 

ఆలోచనలు ఆరోగ్యంగా ఉంటే, మనసు ఆరోగ్యంగా ఉంటుంది. మనసు ఆరోగ్యంగా ఉంటే, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది... అని చెబుతుంటారు సింధుతాయి. కష్టాల కారడవిని దాటి వచ్చిన సింధుతాయి ‘అనాథల తల్లి’గా మహారాష్ట్ర వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. ఆమె చదివింది నాలుగో తరగతే అయినా... ఆమె పెంచిన పిల్లలు మాత్రం మెడిసిన్, ఇంజనీరింగ్‌లాంటి చదువులు చదివారు.‘ఈ వయసులో విశ్రాంతి తీసుకోవచ్చు కదా’’ అని ఆమెను అభిమానించేవాళ్లు అంటే... ‘నేను విశ్రాంతి తీసుకుంటే నా వయసు రెట్టింపు అవుతుంది, పిల్లలతో తీరిక లేకుండా గడిపితే సగం అవుతుంది’’ అంటారు 68 సంవత్సరాల సింధుతాయి.

 

ఒక్క పంచ్‌తో ఆటకట్టించాడు...

 బాక్సింగ్

 

 లండన్‌లోని తన నివాసంలో ఒకరోజు తీరిగ్గా దినపత్రిక చదువుకుంటున్న జాన్ కొకెలె (72) ఇంట్లోకి ఒక దొంగ చొరబడ్డాడు. వృద్ధుడు అనే కనికరం లేకుండా జాన్ ముఖం మీద ఒక బలమైప పంచ్ ఇచ్చాడు ఆ దొంగ. మరో పంచ్ ఇచ్చే లోపే దొంగోడికి ఒకే ఒక పంచ్ ఇచ్చాడు జాన్. ఈ దెబ్బతో దొంగోడు కుప్పకూలి పోయాడు. మరో పంచ్ కొసరుగా ఇచ్చి వాడిని పోలిసులకు అప్పజెప్పాడు జాన్. ఈ మాజీ బాక్సర్ గురించి చెప్పుకోవడానికి ఇది చిన్న ఉదాహరణ మాత్రమే. ఇప్పటికీ ఇరవై ఏళ్ల కుర్రాడిలా ఉత్సాహంగా ఉండే జాన్ దగ్గరికి బాక్సింగ్ టిప్స్ తెలుసుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో ఎందరెందరో వస్తుంటారు.

 

 ఎనభై ఎనిమిదిలోనూ ఎంతో చురుగ్గా...

 సాహిత్యం

 

 మహాశ్వేతాదేవి... సాహిత్య అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. ఆమె రాసిన నవలలు, కథలు, వ్యాసాలలో గిరిజన ప్రపంచాన్ని ఆవిష్కరించారు. ఆమె పుస్తకాలు తెలుగులో అనువాదమై పాఠకులను ఆకట్టుకున్నాయి. ఆమె సెకండ్ హ్యాండ్ సమాచారం మీద ఆధారపడకుండా తాను ఏ సమూహం గురించి రాస్తున్నారో, వారితో ప్రత్యక్షంగా మాట్లాడతారు. ఈ క్రమంలో దేశంలో ఎన్నో ప్రాంతాలు తిరిగారు. సామాజిక కార్యకర్తగా ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. ‘‘రాయడమనేది ఉత్తేజపరిచే పని’’ అని చెబుతున్న మహాశ్వేతాదేవి ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసులోనూ చురుగ్గా ఉండడానికి రచనా వ్యాసంగమే కారణం అంటారు.

 

 మృత్యువును జయించాడు...

 స్ఫూర్తి

 

 పంజాబ్‌కు చెందిన వరల్డ్ ఓల్డెస్ట్ మారథన్ రన్నర్ ఫౌజాసింగ్ వయసు 101 సంవత్సరాలు. అయిదు నెలల క్రితం జరిగిన హాంకాంగ్ మారథన్‌లో పదికిలోమీటర్ల దూరాన్ని 92 నిమిషాల వ్యవధిలో చేరుకొని తన సత్తా చాటారు. 1994లో ఫౌజా కుమారుడు చనిపోయాడు. ఈ విషాదంలో ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నాడు. విషాదం నుంచి ఫౌజాను బయటికి తీసుకురావడానికి హర్మేందర్‌సింగ్ అనే గురువు పరుగుపందేలలో పాల్గొనేలా చేశాడు. ఎన్నో జాతీయ,అంతర్జాతీయ పరుగు పందేలలో పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు ఫౌజా.‘‘పరుగెత్తడం అనేది లేకపోతే... విషాదంలో మునిగిపోయేవాడిని.’ అంటారు ఫౌజా.

 

 నిలువెత్తు ఉత్తేజిత చిత్రం!


 చిత్రకళ

 

 అంతర్జాతీయ చిత్రకారుడు యస్.హెచ్.రజా వయసు 92. కుంచె పట్టుకున్నప్పుడు మాత్రం ఆ 92 కాస్తా 29 అవుతుంది.‘‘నాలోని అంతర్గత అనుభూతులకు చిత్రరూపం ఇవ్వడమే నా పని’’ అంటారు రజా. అయితే ఆ పని తన చిత్రకళకు మాత్రమే పరిమితమైపోలేదు. ఆయన్ను నిరంతర యవ్వనుడిగా ఉంచుతుంది.‘ధ్యానం చేసిన వ్యక్తి మునపటి కంటే కొత్త ఉత్సాహంతో శక్తిమంతంగా కనిపిస్తాడు. చిత్రకళలో నాకు ఆ శక్తి కనిపించింది. యవ్వన ఆలోచనలు, వయసు పైబడిన ఆలోచనలు అంటూ ఉండవు. ప్రతి సృజనాత్మక ఆలోచనా వయసుకు అతీతమైనదే. సరికొత్తదే’’ అంటున్న రజా గీసిన బొమ్మలు చూస్తే ఆయన చెప్పింది ఎంత నిజమో తెలుస్తుంది.

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top