కందకాల వల్ల నాలుగేళ్లుగా నీటి కొరత లేదు!

no shortage of water for four years on strenches - Sakshi

వైద్యనిపుణులైన డాక్టర్‌ పూర్ణచంద్రారెడ్డికి రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం మల్కారం గ్రామపరిధిలో 7 ఎకరాల మామిడి తోట ఉంది. ఇది తొమ్మిదేళ్ల తోట. ఎర్రనేల. నీటి సదుపాయం కోసం 12 బోర్లు వేశారు. ఒక్క బోరే సక్సెస్‌ అయ్యింది. అందులోనూ వేసవి వచ్చిందంటే నీరు బాగా తగ్గిపోతుండేది. తోటను నిశ్చింతగా బతికించుకోవడం కోసం నీటి లభ్యత పెంచుకోవడానికి ఏం చేయొచ్చని ఆలోచిస్తుండగా నాలుగేళ్ల క్రితం ‘సాక్షి’, తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం సంయుక్తంగా చేపట్టిన కందకాల ద్వారా ‘చేను కిందే చెరువు’ ప్రచారోద్యమం గురించి డాక్టర్‌ పూర్ణచంద్రారెడ్డికి తెలిసింది. సంఘం ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాద్‌ రెడ్డి(99638 19074 ), అధ్యక్షులు సంగెం చంద్రమౌళి (98495 66009)లను సంప్రదించారు. వారు సూచించిన విధంగా వాలుకు అడ్డంగా మీటరు లోతు, మీటరు వెడల్పు, 25 మీటర్ల పొడవు మించకుండా కందకాలు తవ్వించారు. 5 మీటర్లు వదిలి అదే వరుసలో మరో కందకం.. అలా తోట అంతటా కందకాలు తవ్వించారు. అప్పటి నుంచీ నీటి కొరత సమస్యే లేదని డా. పూర్ణచంద్రారెడ్డి తెలిపారు.

‘మా ప్రాంతంలో ఈ సంవత్సరం పెద్దగా వర్షాలు పడలేదు. చుట్టు పక్కల పొలాల్లో బోర్లకు నీటి సమస్య వచ్చింది. మాకు మాత్రం ఇప్పుడు కూడా ఎటువంటి సమస్యా లేదు. నాలుగేళ్ల క్రితం తవ్వించిన కందకాల ప్రభావం వల్లనే బోరులో నీటికి కొరత లేకుండా ఉందని స్పష్టంగా అర్థం అవుతున్నది. ఈ నాలుగేళ్లలో ఎంత వర్షం కురిసినప్పుడు కూడా.. మా పొలంలో నుంచి చుక్క నీరు కూడా బయటకు పోకుండా ఈ కందకాల ద్వారా భూమిలోకి ఇంకిపోతున్నాయి. అందువల్లే నీటికి కొరత రాలేదని చెప్పగలను. వచ్చే వేసవిలో కూడా నీటి సమస్య ఉండబోదనే అనుకుంటున్నాం..’ అని ఆయన ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. తమ తోటకు మూడు వైపులా గోడ నిర్మించామని, మరో వైపు కందకాలు తవ్వామని.. వర్షపు నీరు బయటకు పోకుండా పూర్తిగా ఇంకుతుంటుందన్నారు. కందకాలు తవ్వుకుంటే రైతులకు చాలా మేలు జరుగుతుందన్నారు.          
వివరాలకు.. ప్రకాశ్‌– 97011 46234.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top