రాజధర్మం | Sakshi
Sakshi News home page

రాజధర్మం

Published Sat, Jun 30 2018 8:36 PM

News Of Family Agriculture In  Mahabharat - Sakshi

దేశాన్ని పాలించే రాజు నీతిమంతుడైతే, న్యాయ బద్ధంగా వ్యవహరిస్తే ప్రజా క్షేమాన్ని కాంక్షిస్తే ఆ దేశం సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది. యధా రాజా తథా ప్రజా అని ఆర్యోక్తి. రాజును బట్టే ప్రజలు. చరిత్రలో చక్కని పాలన చేసి, గణుతికెక్కిన రాజులను రామునితోను, ఆ రాజ్యాన్ని రామరాజ్యంతోను పోలుస్తారు. రాముడు అంతటి ఆదర్శవంతుడైన పాల కుడు. ప్రజాభిప్రాయానికి విలువనిచ్చిన పాలకుడు. ప్రాచీన సాహిత్యం ఓ విజ్ఞాన భాండాగారం. పాలకులు పాటించవలసిన ధర్మాలు అందులో చక్కగా చెప్పారు. సుస్థిర దేశ పాలనకు, దేశ సౌభా గ్యానికి అవి ఎంతో ఉపకరిస్తాయి.

మహా భారతంలో సభా పర్వంలో నారదుడు ధర్మరాజు దగ్గరకు వచ్చినప్పుడు కొన్ని ప్రశ్నలడుగు తాడు. పాలకులైనవారు ఎలా ఉండాలో తెల్పుతా యవి. సర్వకాలాలకు వర్తించే ధర్మాలవి. రాజు ఎప్పుడూ ధర్మమందే మనసు నిలపాలి. తను చేయవలసిన రాజకార్యాలను సొంత బుద్ధితో అర్ధరాత్రి దాటిన తర్వాత ఆలోచించాలి. ఎందుకంటే అప్పుడు రాజు ఏకాంతంగా ఉంటాడు. అతని ఆలోచ నలకు ఏకాగ్రత ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలలో యోగ్యులైన వాళ్లను, వారి వారి శక్తి సామర్థ్యాలను గుర్తించి నియమించాలి. ముఖ్యంగా పన్నులు వసూలు చేయటంవంటి ధనార్జనకు సంబంధించిన పనులలో నిజా యితీపరులను, సమబుద్ధితో వ్యవహరించేవారిని, విలువలను పాటించే వారిని నియమించాలి. అవినీతిపరులను నియమిస్తే ప్రభుత్వ ధనానికి లోటు ఏర్పడుతుంది. ప్రజలకు ప్రభుత్వంపై విముఖత ఏర్పడుతుంది.

దేశాల మధ్య యుద్ధాలు జరిగినప్పుడు ఎంతో మంది సైనికులు ప్రాణాలు కోల్పోతారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుల కుటుంబాలను రాజు శాశ్వ తంగా ఆదుకోవాలి. ప్రభుత్వం ఎప్పుడూ వ్యవసా యాన్ని, వాణిజ్యాన్ని ప్రోత్సహించాలి. సమాజాభ్యుదయానికి ఇవి చాలా అవసరం. మహాభారత కాలం లోనే అధికాహారోత్పత్తికి విత్తనాలు, తక్కువ వడ్డీతో రుణాలు వ్యవసాయదారులకు ప్రభుత్వం ఇచ్చినట్లు నారదుని మాటల వల్ల తెలుస్తోంది.

రాజు దృష్టిలో ప్రజలందరూ సమానమే. అయితే లోపమున్న పిల్లలను తల్లి ఇంకా ఎంత బాగా ప్రేమి స్తుందో అలా కుంటివారు, గుడ్డివారు, వికలాంగు లకు రాజు ప్రత్యేక సదుపాయాలు కలుగజేయాలి.
ఎప్పుడో మహాభారత కాలం నాడు చెప్పిన ఈ రాజధర్మాలు ఇప్పటికీ ఎప్పటికీ శిరోధార్యాలు!
వాసంతి

Advertisement
Advertisement