చిప్పీగర్ల్‌.. జెసిండా

New Zealand PM  Jacinda Ardern Special Story In Sakshi Family

అక్క సైంటిస్ట్‌. అక్కలా సైంటిస్ట్‌ అయితే! సీరియస్‌ జాబ్‌.   పోనీ, అందర్నీ నవ్విస్తుండే క్లౌన్‌ అయిపోతే? అదింకా సీరియస్‌.  ఈ రెండూ కాకుండా.. వేరే ఏముంది? పాలిటిక్స్‌ అయితే? ఎస్‌.. పాలిటిక్స్‌..! జెసిండా పాలిటిక్స్‌లోకి వచ్చేశారు. పాలిటిక్స్‌ మాత్రం సీరియస్‌ కాదా?! కావచ్చు. జెసిండాకు అది.. ‘చిప్పీ’లో పని! నవ్వుతూ సర్వ్‌ చేసేస్తారు పాలిటిక్స్‌ని కూడా.

ఏరి, ఎంపిక చేసి పెట్టుకున్న మేలురకం చేపల్ని శుభ్రంగా కడిగి, ముక్కలుగా కోసి, ఉప్పూకారం పెట్టి వేయించి విక్రయించే రెస్టారెంట్‌ ‘ఫిష్‌ అండ్‌ చిప్‌ షాప్‌’లో జెసిండా తొలి ఉద్యోగం. తొలి ఉద్యోగం అంటే.. న్యూజిలాండ్‌లోని వైకాటో విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్‌ స్టడీస్‌ (బిసిఎస్‌) ఇన్‌ పాలిటిక్స్‌ అండ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌లో పట్టభద్రురాలు అయి బయటికి వచ్చాక చేసిన ఉద్యోగం కాదు. స్కూల్లో ఉండగానే, పార్ట్‌ టైమ్‌గా చేసిన జాబ్‌. ‘ఫిష్‌ అండ్‌ చిప్‌ షాప్‌’ దుకాణం ఒకటే ఉండదు. డోమినోస్‌లా, కేఎఫ్‌సీలా, మెగ్డీలా.. న్యూజిలాండ్, ఐర్లండ్‌.. ఇంకా ఆ బెల్టు మొత్తంలో గొలుసు రెస్టారెంట్‌లలా ‘ఫిష్‌ అండ్‌ చిప్‌ షాపులు’ విస్తరించి ఉంటాయి. లోకల్‌గా వాటిని ‘చిప్పీ’లనీ, ‘చిప్పర్‌’ లనీ అంటారు. (గుక్కతిప్పుకోని ప్రధాని)

తను ఉన్న ప్రాంతంలోనే ఇంటికి, స్కూలుకు మధ్య ఒక చిప్పీని ఎంపిక చేసుకుని అందులో చేరిపోయారు జెసిండా. పాకెట్‌ మనీ వచ్చేది. ఆమె ముఖం వెలిగిపోయేది. పాకెట్‌ మనీకి కాకుండా ఇంక దేనికైనా ఆమె ముఖం వెలిగిందంటే ఎవరో ఒక పొలిటికల్‌ లీడర్‌ని ఆవేళ దగ్గరగా చూసిందనే! ఆ వయసుకే పాలిటిక్స్‌ ఇష్టమైపోయాయి జెసిండాకు. ‘ఫిష్‌ అండ్‌ చిప్‌ షాప్‌’లో పని ఇష్టం అవడానికి మాత్రం బహుశా వాళ్ల అమ్మగారు కారణం కావచ్చు. ఒక స్కూల్‌లో కేటరింగ్‌ అసిస్టెంట్‌ ఆమె. పెట్టే చెయి, పెట్టే బుద్దీ రెండూ వచ్చాయి కూతురికి తల్లి నుంచి. జెసిండా తండ్రి పోలీస్‌ ఆఫీసర్‌. ఆయన్నుంచి ఏమీ తీసుకోలేదు జెసిండా. ముఖ్యంగా డ్యూటీ అయ్యాక ఇంటికొస్తూ ఆయన మోసుకొచ్చే కోపాన్ని అస్సలు తన లోపలికి తీసుకోలేదు జెసిండా. 
∙∙∙
చిన్నప్పుడంతా ఆపిల్‌తోటలోని ఫామ్‌ హౌస్‌లోనే గడిపింది జెసిండా. ట్రాక్టర్‌ నేర్చుకుంది. ఆ తర్వాత కారు. స్కూల్లో ఆమె తీసుకున్న ప్రాజెక్టు ‘పాలిటిక్స్‌’! ‘ఏం చేస్తావ్‌ అందులో ప్రాజెక్టు?’ అన్నారు టీచర్స్‌. మారిలిన్‌ వారింగ్‌ని ఇంటర్వ్యూ చేస్తానంది. ఢమాల్‌మన్నారు. మారిలిన్‌.. పార్లమెంటు సభ్యురాలు. ఆమె ఇంటర్వ్యూ దొరకదని కాదు. ఈ పిల్ల పిచ్చుక ఏం ప్రశ్నలు అడుగుతుందోనని. మారిలిన్‌ వట్టి ఎంపీ అయినా సరిపోయేది. పెద్ద ప్రొఫైల్‌ ఆవిడది. ఫెమినిస్టు, విద్యావేత్త, రచయిత్రి, హక్కుల కార్యకర్త, పర్యావరణ ఉద్యమకారిణి.. ఇలా చాలా ఉన్నాయి. ఎన్నుంటే ఏమిటి? ఇంటర్వ్యూ చేసింది జెసిండా. మారిలిన్‌ ముగ్ధురాలు అయ్యారు. ‘ఊ.. నువ్వు పాలిటిక్స్‌లోకి రావచ్చు’ అన్నారు నవ్వుతూ. జెసిండా చిప్పీలో పని చేస్తున్న కాలం కూడా అది. ‘వస్తే, సర్వ్‌ చేయడం తప్ప ఏమీ చేయలేను’ అని సాహసించి ఒక మాట అంది జెసిండా. ‘సర్వ్‌ చేయడానికే రమ్మంటున్నాను’ అన్నారు మారిలిన్‌. ఏళ్లు గడిచాయి. 40 ఏళ్ల జెసిండా ఇప్పుడు న్యూజి లాండ్‌కు 40వ ప్రధాని. ‘లేబర్‌ పార్టీ’ లీడర్‌. 
∙∙∙
ప్రజలే ఈ ప్రధాని పర్సనల్‌ లైఫ్‌! మరీ పర్సనల్‌గా ఒక వ్యక్తి ఉన్నారు. క్లార్క్‌ గేఫోర్డ్‌. గత ఏడాది ఎంగేజ్‌మెంట్‌ అయింది. ఆ ముందు ఏడాది జూన్‌లో వీళ్లకో పాప పుట్టింది. బేనజీర్‌ భుట్టో తర్వాత.. ప్రజా ప్రతినిధిగా ఎంపికై, పదవిలో ఉండగా తల్లి అయిన రెండో మహిళ జెసిండా. ప్రజలకు ఏం కావాలో అది ఇచ్చేయరు జెసిండా. ఏం కావాలో అడిగి అదిస్తారు. ప్రభుత్వోద్యోగుల పని గంటల కుదింపు గానీ, సంక్షేమ పథకాలను గానీ, సంక్షోభాలను గట్టెక్కించే సంస్కరణలను గానీ కాలయాపన జరగకుండా సర్వేలు చేయించి అమలు చేసేస్తుంటారు.

జెసిండాపై డేవిడ్‌ హిల్‌ రాసిన బొమ్మల పుస్తకం ‘టేకింగ్‌ ద లీడ్‌’ ముఖచిత్రం కవర్‌ పేజీ.  పుస్తకం ఈ ఏడాది మార్చిలో విడుదలైంది

కరోనాను కూడా చక్కగా కట్టడి చేశారు. ప్రజలలో తనూ ఒకరు అన్నట్లుగానే ఉంటారు తప్ప ప్రధానిగా కనిపించరు. ఈమధ్య గేఫోర్డ్‌తో కలసి రెస్టారెంట్‌కి వెళితే టేబుల్స్‌ ఖాళీ లేక బయటే కాసేపు నిలబడ్డారు. వేరే రెస్టారెంట్‌కి వెళ్లబోతుంటే అప్పుడు టేబుల్‌ ఒకటి ఖాళీ అయిందని చెబితే లోపలికి వెళ్లారు. జెసిండా ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. భూకంపం వచ్చినా! ఆ సంగతి నిన్న మీరు చదివే ఉంటారు. సోమవారం టీవీ ఇంటర్వ్యూ లైవ్‌లో ఉండగా న్యూజిలాండ్‌లో ప్రకంపనాలు వచ్చాయి. జెసిండా నిలబడి ఉన్న గది గోడలు కూడా షేక్‌ అయ్యాయి. ‘షేక్‌ అవుతున్నాయి చూస్తున్నారా?’ అని టీవీ యాంకర్‌తో నవ్వుతూ అంటూ.. ఇంటర్వ్యూని కొనసాగించారు జెసిండా.
∙∙∙
జెసిండాకు సర్వ్‌ చేయడం ఇష్టం. డిగ్రీ అయ్యాక టూర్‌లకు వెళ్లినప్పుడు న్యూయార్క్‌లోని ‘సూప్‌ కిచెన్‌’లలో కొన్నాళ్లు పని చేశారు. నిరుపేదలకు, నిరుద్యోగులకు, ఇల్లు లేని వారికి ఉచితంగా ఆహారాన్ని అందించే యుద్ధకాలాల నాటి కొనసాగింపు కేంద్రాలు అవి. వాటిల్లో వాలంటీర్‌గా ఉన్నారు జెసిండా. సంగీతం అంటే ఇష్టం. ముఖ్యంగా బీటిల్స్‌. ఒక విషయమైతే జెసిండా గురించి తప్పక చెప్పుకోవాలి. తన విశ్వాసానికి విరుద్ధంగా ఉన్నాడని దేవుణ్ణే కాదనుకున్నారు ఆవిడ! చాలా ధైర్యం కావాలి కదా. ‘గే హక్కులను నిరాకరించే ప్రవచనాలేవో కనిపించాయట. చర్చిని వదిలి బైటికి వచ్చేశారు. ఇప్పుడామె ‘యాగ్నాటిస్ట్‌’. దేవుడు ఉన్నాడో లేడో తెలియని, తెలుసుకోవాలనే ప్రయత్నం చేయని మనిషి. అది నిజం కాకపోవచ్చు. అభాగ్యుల సేవలో ఆమె ఎప్పుడూ దేవుణ్ణి దర్శించుకుంటూ ఉన్నట్లే కనిపిస్తారు మరి!!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top