కాలర్‌ ఎగరేయండి

New fashion show to sarees - Sakshi

ఏం అమ్మాయిలు కాలరెగరేయలేరా! అబ్బాయిలకు దీటుగా చెలరేగలేరా! ఎం‘చొక్కా’ అదరగొట్టలేరా! ఇదిగో వచ్చారు  చక్కనమ్మలు... ‘చొక్క’నమ్మలు.

అమ్మ చీరలు చూసి, ఆన్‌లైన్‌ శారీస్‌ చూసి, అమ్మమ్మ పట్టు చీరల రంగులు చూసి ఎన్నిసార్లు మనసు పారేసుకుని ఉంటారు.. ఈ చీర కట్టుకుంటే ఎంత బాగుంటుందో కదా అని. కానీ, ఆ బ్లౌజ్, ఆ స్టైల్‌ అబ్బో.. ‘నా వల్ల కాదు’ అని ఆ చీరలను పక్కన పెట్టేసుంటే మాత్రం మీరు ఓ అద్భుతమైన ఇండోవెస్ట్రన్‌ లుక్‌కి దూరమైనట్టే. నవతరం అమ్మాయిల ఆలోచనకు తగ్గట్టు సంప్రదాయ చీరకట్టులోనూ ఎన్నో మార్పులు వచ్చాయి. వాటిలో షర్ట్‌ స్టైల్‌ బ్లౌజ్‌ శారీ డ్రేపింగ్‌ అదరహో అంటోంది. 

శారీ ఏదైనా ఒకటే షర్ట్‌
ఏ చీర అయినా మీకు నచ్చినది ఎంపిక చేసుకోండి మీ వార్డ్రోబ్‌లో ఉన్న వైట్‌ షర్ట్‌తో జత చేయండి. ఎందుకంటే ఇప్పటి ఆధునిక దుస్తుల్లో అమ్మాయిలు చొక్కాలు వేసుకోవడం సాధారణమైపోయింది. అమ్మ కట్టుకున్న విధంగానే చీరకట్టు సెట్‌ చేయండి. దాని మీదకు వైట్‌ షర్ట్‌ బ్లౌజ్‌గా ధరించండి. కొంగొత్తగా ఉన్న స్టైల్‌ని అద్దంలో ఓ సారి లుక్కేయ్యండి. ఇక పార్టీలో వెలిగిపోండి. ఈ ఇండోవెస్ట్రన్‌ లుక్‌ ఏ వేడుకకైనా బాగా నప్పుతుంది. అదనపు అలంకారాలేవీ అవసరం లేదు. 

స్టోల్‌ ది షో
కుర్తీ మీదకు స్టోల్‌ ధరిస్తారు కదా! అలా పవిటచెంగును స్టోల్‌లా మెడచుట్టూ తిప్పితే.. ఈ కాంబినేషన్‌ లుక్‌ సూపర్బ్‌ అంటారు. 

రాయల్‌ లుక్‌
ఎడమ భుజం మీదుగా పవిటను తీసి, మెడచుట్టూ తిప్పి కుడి భుజం నుంచి ఎడమ భుజానికి కొంగును తిప్పితే ఆ కట్టు రాయల్‌ లుక్‌తో మెరిసిపోతుంది. 

లెహెంగా లుక్‌
చీరకట్టు పూర్తయ్యాక పవిటను వెనుక నుంచి కుడి భుజం మీదుగా ముందుకు తీసి లెహెంగా స్టైల్‌ అవుతుంది. ఈ లుక్‌ చూసి ఒకే చీరను ఎన్ని వెరైటీ లుక్‌తో మెరిపించవచ్చో మీరే ఆశ్చర్యపోతారు. 

ధోతీ స్టైల్‌
చీరకట్టును ధోతీలా కట్టి, పవిటను మాత్రం ఎడమ భుజం మీదుగా వేసుకుంటే వండర్‌ఫుల్‌ స్టైల్‌ అని కితాబులు మీ సొంతం అవుతాయి.

పట్టు చీర– షర్ట్‌
పట్టు చీర రెడీగా ఉంది కానీ, మ్యాచింగ్‌ బ్లౌజ్‌ లేదని దిగులుపడొద్దు. ఎంచక్కా ఓ తెల్లని చొక్కా ధరిస్తే చాలు. ఏ చీర అయినా వేడుకలో స్పెషల్‌ అట్రాక్షన్‌.

కాటన్‌ శారీ.. షర్ట్‌
సింపుల్‌గా కాటన్‌ చీర కట్టుకోమన్నా ‘అబ్బో అమ్మమ్మలా కనిపిస్తాం’ అనే అమ్మాయిలు కూడా ఈ స్టైల్‌కి ‘లవ్లీ లుక్‌’ అని కితాబులిచ్చేస్తారు. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top