బ్యూటిఫుల్‌ ఫ్యామిలీ

Mother And Daughters Wins Miss India USA 2019 - Sakshi

తల్లీకూతుళ్లు

అందం అంటే తెల్లటి మేను.. కొలతల ఆకృతి కాదు.. అందం అంటే అంతులేని ఆత్మవిశ్వాసమే అని మొన్న విశ్వసుందరిగా నిలిచిన జొజొబిని తుంజీ నిరూపించింది. అసంపూర్ణతలు అవకాశాలను అడ్డుకోలేవు.. వైకల్యాలు పరిధిని నిర్ణయించలేవు అని చాటారు అపర్ణ క్రోవి.. ఆమె  ఇద్దరు కూతుళ్లు షీతల్, శ్రీనిధి! జొజొబిని తుంజి ఘనతకు వీళ్ల విజయానికి సంబంధం ఏంటీ? వీళ్లూ గెలుపొందింది బ్యూటీకాంటెస్ట్‌లోనే!

అపర్ణ క్రోవి స్వస్థలం హైదరాబాద్‌. ప్రస్తుతం అమెరికాలోని బోస్టన్‌లో ఉంటున్నారు. భర్త వ్యాపారవేత్త. ముగ్గురు పిల్లలు షీతల్, శ్రీనిధి, సుహాస్‌. పెద్దమ్మాయి షీతల్‌ ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చదువుతోంది. రెండో అమ్మాయి, అబ్బాయి కవలలు. టెన్త్‌క్లాస్‌లో ఉన్నారు. అపర్ణా, తన ఇద్దరు కూతుళ్లు ఇటీవల అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన ‘‘మిస్‌ భారత్‌ యూఎస్‌ఏ 2019’’ అందాల పోటీల్లో పాల్గొని ముగ్గురూ టైటిల్స్‌ గెలుచుకున్నారు. ‘‘మిస్‌ భారత్‌ యూఎస్‌ఏ 2019’’గా షీతల్, ‘‘మిసెస్‌ భారత్‌ ఫస్ట్‌ రన్నరప్‌’’గా 39 ఏళ్ల అపర్ణ, ఇండియా నెక్ట్స్‌ టాప్‌ మోడల్‌గా శ్రీనిధి విజేతలయ్యారు. ఒక పోటీలో తల్లీకూతుళ్లు గెలుపొందడం అరుదే. ఈ అచీవ్‌మెంట్‌ ఈ ముగ్గురికీ ప్రత్యేకం అనడానికి ఇదొక్కటే కారణం కాదు. దీని వెనక ఈ ముగ్గురికీ ఒకే రకమైన స్ట్రగుల్‌ ఉండడం కూడా!

కన్నుమూసి తెరిచేలోగా తలకిందులు..
అయిదేళ్ల కిందటిదాకా ఆనందంగా ఉంది అపర్ణ కుటుంబం. 2015 కొత్త సంవత్సరం వేడుక వాళ్ల జీవితాన్ని తలకిందులు చేసింది. ఆ యేడు న్యూ ఇయర్‌ను జైపూర్‌లో జరుపుకుందామనుకున్నారు.ఆ సంతోషాన్ని ఆస్వాదిస్తున్న సమయంలో ఒక్కసారిగా బాణాసంచా పేలి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అపర్ణ, షీతల్, శ్రీనిధిలకి గాయాలయ్యాయి. చికిత్స కోసం వాళ్లు తిరగని దేశం లేదు. గాయాలకన్నా కాలిన మచ్చలతో ఉన్న తమను చూసే చూపులే ఎక్కువ బాధించాయి అంటారు అపర్ణ.

‘‘పిల్లలు కుంగిపోకుండా ఉండాలంటే ముందు నేను ధైర్యం కూడగట్టుకోవాలి. దానికి ఆ మచ్చలనే ప్రేరణగా తీసుకున్నా. మేము మేముగా నిలబడాలి. ఆ గుర్తింపు మాకు కావాలి అని తపన మొదలైంది. దానికి అందాల పోటీలను ఎందుకు వేదికగా మలచుకోకూడదు అనిపించింది. అందుకే ధైర్యాన్నే ఆయుధంగా చేసుకున్నా. పిల్లల్నీ ట్రైన్‌ చేశా. మొన్న జరిగిన ‘‘మిస్‌ భారత్‌ యూఎస్‌ఏ 2019’’కి దరఖాస్తు చేశాం. గెలిచాం’’ అని చెప్తారు అపర్ణ మునుపటి ఆనందాన్ని సొంతం చేసుకున్న విశ్వాసంతో.

ఫుడ్‌ బ్లాగర్‌..
అపర్ణకు పందొమ్మిదేళ్లకు పెళ్లయింది. ఇరవై ఏళ్లు గృహిణిగానే సాగింది. ఆమె రచయిత, స్టోరీ టెల్లర్, మారథాన్‌ రన్నర్, ఫుడ్‌ బ్లాగర్‌ కూడా. ఇవన్నీ అగ్నిప్రమాదం అయిన తర్వాత సాధించినవే. ఈ కలలన్నీ ముందునుంచే ఉన్నా పెళ్లి, పిల్లలతో కొంతకాలం, ఫైర్‌ యాక్సిడెంట్‌తో మరి కొంతకాలం వెనకబడ్డాయి. ఇప్పుడు అన్నింటిలో రాణిస్తోంది. ‘‘కలలు అంటూ ఉంటే ఎప్పుడైనా సాధించవచ్చు. టైమ్‌ లిమిట్‌ ఉండదు. కావల్సిందల్లా మన మీద మనకు నమ్మకం, సామర్థ్యం, పట్టుదల అంతే! ఏ వైకల్యమూ మన అవకాశాలను కుదించలేదు’’ అంటుంది అపర్ణ. ఆమె కూతుళ్లూ అంతే ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. పెద్దమ్మాయి షీతల్‌ ఫ్యాషన్‌ డిజైనర్‌గా గ్లామర్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టాలనుకుంటుందట. ఈ విజయం ఆ ప్రయాణాన్ని మరింత సులువు చేసింది అంటుంది షీతల్‌. సానుకూల దృక్పథం ఎంతటి లక్ష్యాన్నయినా ఛేదిస్తుంది.. కొత్త ప్రపంచాన్ని చూపిస్తుంది అనడానికి ఈ కుటుంబమే మంచి ఉదాహరణ.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top