ఒకప్పుడు సినిమాకి వెళ్లాలన్నా... లైబ్రరీకి వెళ్లాలన్నా.. మంచి బిర్యానీ తినాలన్నా బయటకి వెళ్లాల్సి వచ్చేది. ఆ కష్టం లేకుండా మొబైల్ లైబ్రరీ, మొబైల్ కోర్టు, మొబైల్ ఫుడ్ కోర్టులు అందుబాటులోకి వచ్చాయి. మన వీధి చివరనో.. మన కాలనీ పార్కు వద్దనో మనకు కనిపిస్తూనే ఉంటాయి. వీటికి ఆదరణ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. అన్నీ వచ్చాయి కాని సినిమా థియేటర్ కూడా వీటి లాగే వచ్చి ఉంటే బాగుండు అని అనుకునే వారికి ఇది శుభవార్తే. సినిమా ప్రేమికుల కోసం మన గల్లీకి దగ్గరలో వినోదాన్ని పంచేందుకు పిక్చర్‌టైమ్ వచ్చేసింది. అదేనండీ, మొబైల్ థియేటర్. పిక్చర్ టైమ్ మనదేశంలో ఓ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది.
మారుమూల ప్రాంతాల వారికి కూడా మల్టీప్లెక్స్ అనుభూతి!
దేశంలోని మారుమూల ప్రాంతాలలోని ప్రజలకు వినోదం పంచాలనే ఉద్దేశంతో వ్యాపారవేత్త సుశీల్ చౌదరి ‘పిక్చర్‌టైమ్’ను స్థాపించారు. మన దేశంలో సినిమా, క్రికెట్‌పై ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అది మాటల్లో చెప్పలేనిది. సినిమాలపై ఉన్న మక్కువను గ్రహించిన ఆయన సినిమాకు దూరంగా ఉన్న ప్రజలకు కూడా వినోదం అందివ్వాలనే తన ఆలోచనలను ఆచరణలో పెట్టారు. అంతే... తక్కువ ఖర్చుతో థియేటర్, మల్టీప్లెక్స్ అనుభూతికి తీసిపోని విధంగా పిక్చర్‌టైమ్ రూపంలో మన ముందుకొచ్చారు.
మొట్ట మొదటి షో మన తెలుగు సినిమాదే...
పిక్చర్ టైమ్ కార్యకలాపాలను ఢిల్లీ నుంచి మానిటరింగ్ చేస్తున్నారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ మొబైల్ థియేటర్‌ను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ ప్రారంభించారు. దీనిలో మొదటి షోను బాహుబలి చిత్రాన్ని ప్రదర్శించడం విశేషం. 2021 సంవత్సరం కల్లా 3 వేల మొబైల్ థియేటర్లను ఏర్పాటు చేస్తామని పిక్చర్ టైమ్ వ్యవస్థాపకులు సుశీల్ చౌదరి తెలిపారు. దీనికి భారత ప్రభుత్వం గుర్తింపు కూడా ఉండటం విశేషం. సినిమా బ్రేక్ టైమ్‌లో కేంద్ర ప్రభుత్వం పథకాల అడ్వర్‌టైజ్‌మెంట్‌లను ప్రదర్శించి చైతన్యం కల్పిస్తోంది.
వందకోట్లకు పైగా జనాభా...2200 మల్టీప్లెక్స్‌లు...
వందకోట్లకు పైగా జనాభా ఉన్న మన దేశంలో కేవలం 2200 మల్టీప్లెక్స్‌లు మాత్రమే ఉన్నాయి. అవి కూడా ప్రధాన నగరాలలోనే ఎక్కువ ఉండటం గమనార్హం. వరల్డ్ క్లాస్ సినిమా ఎక్స్‌పీరియన్స్‌ను మారుమూల గ్రామాల ప్రజలకు అందించేందుకు పిక్చర్‌టైమ్ ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందుకే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మొబైల్ థియేటర్స్‌ను ఏర్పాటు చేసి తక్కువ ధరకే కొత్త సినిమాలను ప్రదర్శిస్తోంది. డిజిటల్ ప్రొజెక్షన్, డాల్బీ సరౌండ్ సౌండ్, ఎయిర్ కండిషనింగ్, కంఫర్టబుల్ సీటింగ్ ప్రత్యేకతలతో మల్టీప్లెక్స్‌కు తీసిపోని సౌకర్యాలను అందిస్తున్నామని సుశీల్ చౌదరి తెలిపారు.
100 నుంచి 120 మంది చూసే వీలుగా...
ఒక చిన్న సైజు ట్రక్కులో ఈ డిజిప్లెక్స్‌ను ఎక్కడికైనా తీసుకెళ్లి సినిమాను చూపించవచ్చు. ఫ్యాబ్రిక్ మెటీరియల్‌తో తయారైన ఒక బెలూన్ లాంటి పెద్ద టెంట్ సహాయంతో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. దీనికి వర్షాలు, అగ్నిప్రమాదాలను తట్టుకుని నిలిచే మెటీరియల్‌ను వాడటం విశేషం. 70/30 వైశాల్యంలో ఉండే ఈ తాత్కాలిక థియేటర్‌లో సుమారు 100 నుంచి 120 మంది సినిమాను వీక్షించవచ్చు. డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో దీనిని అప్పటికప్పుడు ఏర్పాటు చేసుకోవచ్చు. సినిమాలకు దూరంగా ఉండే మారుమూల ప్రాంత ప్రజ ల వద్దకు సినిమాను తీసుకెళ్లేందుకు ఉపయోగపడుతుంది.
ఒక థియేటర్‌కుఆరు మంది సిబ్బంది
ఢిల్లీలోని ప్రధాన కార్యాలయం నుంచి ఆదేశాలు రాగానే ఆరుమందితో ఉన్న బృందం థియేటర్ సామగ్రి ఉన్న ట్రక్కుతో బయల్దేరుతారు. ఇందులో ప్రధానంగా ఒక సైట్ ఇన్‌చార్జ్, ప్రొజెక్షనిస్ట్, ఎలక్టీష్రియన్‌తో పాటు ముగ్గురు సిబ్బంది ఉంటారు. థియేటర్ ఏర్పాటు నుంచి దానిని తీసేసే వరకు అన్ని వారే చూసుకుంటారు. మొబైల్ థియేటర్లు విజయవంతంగా నడుస్తున్నాయని సిబ్బంది పేర్కొంటున్నారు. పేరున్న సంస్థలు కాన్ఫరెన్స్‌లు నిర్వహించుకోవడానికి అద్దెకి ఇస్తామని తెలిపారు. సినిమా చూసిన ప్రేక్షకుల అభిప్రాయాలను తీసుకుని మార్చులు చేర్పులు చేస్తున్నామని పేర్కొన్నారు.
– సచిందర్ విశ్వకర్మ, సాక్షి సిటీడెస్క్
14 రాష్ట్రాలలో చిత్ర ప్రదర్శనలు
పిక్చర్ టైమ్ దేశంలోని 14 రాష్ట్రాలలో మొబైల్ థియేటర్స్ ద్వారా చిత్రాలను ప్రదర్శిస్తోంది. ఇప్పటి వరకు తమ మొబైల్ థియేటర్లలో 18వేల గంటలపైనే చిత్ర ప్రదర్శనలు జరిగాయని నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని ప్రజలకు వినోదాన్ని అందిస్తోంది. ప్రస్తుతం కాచిగూడ, కామారెడ్డి, నిజామబాద్, మహబూబ్‌నగర్, కర్నూల్‌లలో చిత్రాలు ప్రదర్శితమవుతున్నాయి. త్వరలో బొల్లారంలోనూ మొబైల్ థియేటర్‌ను ఏర్పాటు చేయనున్నారు.
రోజూ ఐదు ఆటలు...
రిలీజైన కొత్త సినిమాలను అతి తక్కువ టికెట్ ధర (రూ.30–80)కు వినోదాన్ని ఇస్తుండటంతో పిక్చర్ టైమ్‌కి ఆదరణ పెరుగుతోంది. ప్రతిరోజు ఐదు షోలను ప్రదర్శిస్తూ వినోదాన్ని పంచుతోంది. థియేటర్‌తో కంపేర్ చేసుకుంటే దీని రేటు తక్కువగా ఉండటంతో అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ సినిమా చూడటానికి వచ్చే ప్రేక్షకుల వాహనాలను నిలపడానికి ఉచిత పార్కింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. అదేవిధంగా ఇంటర్వెల్ టైమ్‌లో స్నాక్స్, తదితర వాటిని విక్రయించేందుకు క్యాంటీన్‌ను సైతం ఏర్పాటు చేశారు. వాటిని సాధారణ ధరలకే విక్రయించడం విశేషం.



