గోరింటా పూసిందీ...

గోరింటా పూసిందీ... - Sakshi


మతాలకు అతీతమైనది. వయసు తేడా లేనిది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ మగువ మనసుకు ముచ్చట కలిగించేది... గోరింట. ఈ మాసం ఆషాఢం. ఓ వైపు రంజాన్, మరో వైపు తెలుగు పండగలు వరసగా వస్తున్నాయి. అతివ చేతుల్లో గోరింట మందారంలా పూసి, మెరిసి, మురిసిపోయే రోజులే ఇక ముందన్నీ... అందుకే ఎర్రన్ని గోరింట ముస్తాబు... ఈ వారం...

 

గోరింట చెట్టు వర్షాకాలంలో కొత్త చిగుళ్లు తొడుక్కుంటుంది. ఈ చెట్టు లేత ఆకులను ముద్దగా నూరి, కావలసిన ఆకారంలో చేతులకు పెట్టి, రెండు నుంచి ఆరు గంటల సేపు ఉంచితే చేతులు ఎరుపు రంగులోకి మారతాయి. ఔషధ గుణాలు మెండుగా ఉండే గోరింటాకును చేతులు, పాదాలకు అలంకరించుకోవడం వల్ల వర్షాకాలంలో వచ్చే చర్మ సమస్యలు దరిచేరవని చెబుతుంటారు పెద్దలు. ప్రాచీన కాలం నుంచి సౌందర్య సాధనాలలో గోరింటాకు ప్రధాన భూమిక పోషిస్తూ వస్తోంది. చర్మసంరక్షణలో మరొకటి సాటిలేదనిపించే ఈ ఆకు నుంచి అందమైన డిజెన్లైన్నో సృష్టించారు సృజనకారులు.  వీటిని మగువలతో పాటు మగవారూ తమ భుజాలు, వీపు, ఛాతీ భాగాలలో టాటూగా వేయించుకోవడానికి ఇష్టపడుతున్నారు.

 

తెలుగింటి పల్లెపడుచు చేతుల్లో నిండుగా... క్రిస్టియన్ పెళ్లి వేడుకలలో కాంతిమంతంగా... ముస్లిమ్ మగువ ముంజేతులలో ఆకర్షణీయంగా.. గోరింట రూపురేఖలు మార్చుకొని మెహెందీ డిజైన్లుగా ఆకట్టుకుంటోంది. హిందూ, ముస్లిమ్, క్రిస్టియన్,.. ఏ మతమైనా మెహెందీ విషయంలో భేద భావం లేదు. మనసుకు నచ్చిన డిజైన్ అయితే చాలు.

    

ప్రపంచం మొత్తమ్మీద గోరింటతో శారీరక అలంకరణలో రకరకాల ప్రయోగాలు చేసేది ఇండియా, అరబ్ దేశాలు మాత్రమే. అదృష్టానికి, ఆరోగ్యానికి ప్రతీకగా అరబ్‌దేశాలలో ఐదు వేల ఏళ్ల క్రితమే గోరింటను వాడినట్టు, హెన్నా పదం అక్కడి నుంచే వచ్చినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. గోరింట చెట్టు ఇంట్లో ఉంటే దుష్టశక్తులు దరిచేరవని, మంచి ఆలోచనలు వస్తాయని నమ్మేవారు. కొన్ని తరాల తర్వాత గోరింట ఆకులను ఎండబెట్టి, పొడి చేసి చేతులు, పాదాలపై రేఖాగణిత నమూనాలలో డిజైన్లు వేసుకునేవారు. వీటివల్ల సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని, అండాశయాల పనితీరు మెరుగవుతుందని భావించేవారు. ఇప్పటికీ మన దేశ గ్రామీణ ప్రాంతాలలో ఈ నమ్మకం ఉంది. ఈజిప్ట్ ‘మమ్మీ’ల జుట్టు, గోళ్లు ముదురు గోధుమ రంగులోకి రావడానికి గోరింటాకును వాడేవారని ఒక వివాదాస్పద వార్త కూడా ఉంది. క్రీ.పూ 700 కాలంలో గోరింట మొక్క ఈజిప్ట్ నుంచి భారతదేశంలో అడుగుపెట్టిందని, అప్పటి నుంచి అతివల చేతులు, పాదాలపై గోరింట ఎర్రగా పూయడం మొదలుపెట్టిందని వృక్షశాస్త్రజ్ఞులు చెబుతున్నారు. చారిత్రకపరంగా చూస్తే మనుషులకు గోరింటాకు ఔషధంగా... వస్త్రం, లెదర్, కేశాలు రంగు మారడానికి ‘డై’గా వాడేవారని తెలుస్తోంది.

   

ఉత్తరాదిన కడ్వాచౌత్, దీపావళి, దక్షిణాదిన అట్లతద్ది వంటి పండగలలో గోరింట ప్రధాన భూమిక పోషిస్తోంది. ఉత్తరభారత వివాహ సంప్రదాయం ఇటీవల దక్షిణాదినీ ఆకట్టుకుంటోంది. అందులో భాగంగానే వివాహానికి ముందు మెహిందీ కోసం ప్రత్యేకంగా వేడుకలు జరుపుతున్నారు.

           

బాలీవుడ్ సినిమాలలో ‘మెహెందీ వేడుక’ ఒక ప్రధానాంశం. ఈ సినిమాల వల్ల నేపాల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, మాల్దీవులలో వివాహవేడుకల సమయాలలో అలంకరణలో భాగంగా మెహెందీ ప్రథమస్థానంలో నిలిచింది. ఆ విధంగా 1990 నుంచి మెహెందీ అలంకరణలలో నూతన పోకడలు వచ్చి చేరాయి. నాటి నుంచి ఈ డిజైన్లను ‘హెన్నా టాటూస్’గా పిలవడం ప్రారంభించారు. ప్రస్తుత కాలంలో పాకిస్థాన్, గల్ఫ్ దేశాలు హెన్నా డిజైన్స్‌లో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఈ డిజైన్లని ముస్లిమ్ మహిళలు అలవోకగా వేయడం అక్కడి నుంచే మొదలైంది.        

 

వేదాలలో గోరింటరంగును సూర్యునికి ప్రతీకగా చె ప్పారు. అందుకే  అరచేతుల్లో సూర్యుని ఆకారాన్ని పోలి ఉండే గుండ్రటి డిజైన్ వేసేవారు.  మనిషి లోపల ఉన్న జ్ఞాన కాంతిని గోరింట ద్వారా మేలుకొలపడంగా భావించేవారు.

 

డిజైన్లలో వైవిధ్యంఇటీవల కాలంలో బ్రైడల్, ఇండియన్, అరబిక్... మెహెందీ డిజైన్లు పోటీ పడుతున్నాయి.  వీటిలోనే షేడెడ్, ఫ్లోరల్, మోటిఫ్స్... ఇలా తీర్చిన డిజైన్లలో రంగురంగుల రాళ్లు, పూసలు, గ్లిట్టర్ (మెరుపుతో ఉండే పచ్చని రంగు)ను కూడా ఉపయోగిస్తున్నారు. మరికొందరు నేరుగా అచ్చులతో రంగు డిజైన్లను నిమిషాలలో ఒంటి మీద ముద్రించుకుంటున్నారు. ఇంకొందరు ప్లాస్టిక్ డిజైన్ల్‌లో వచ్చిన స్టిక్కర్స్‌నీ అతికించుకుంటున్నారు. జీవనశైలి వేగవంతంగా మారుతుండటంతో ఈ డిజైన్లలోనూ ఆధునిక పోకడలు వేగం పుంజుకుంటున్నాయి.మెహెందీ.. ఇలా మేలు..మెహెందీ కోన్‌లు మార్కెట్లో విస్తృతంగా లభిస్తున్నాయి. వీటితో డిజైన్  వేసుకోవడానికి ముందు ఆ మెహెందీ మన చర్మానికి సరి పడుతుందా లేదా అనేది పరీక్షించుకోవడం  తప్పనిసరి. చెవి వెనుక భాగంలో (చెవి వెనుక భాగం చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అందుకని ఏ రియాక్షన్ అయినా త్వరగా తెలిసిపోతుంది) లేదా మోచేతి దగ్గర మెహెందీ రాసుకొని, 3-4 రోజుల తర్వాత కూడా ఎలాంటి రియాక్షన్ లేదంటే అప్పుడు డిజైన్ వేయించుకోవడం ఉత్తమం. మరీ ముఖ్యంగా బ్లాక్ మెహెందీలో ఎక్కువ అలెర్జీ కారకాలు ఉంటున్నాయి. డిజైన్ నల్లగా రావడానికి వీటిలో హానికారక రసాయనాలు కలుపుతున్నారు. మెరుపులు వచ్చే గ్లిట్టర్ తరహా మెహెందీలు సైతం చర్మానికి పడక చాలా మంది ప్రమాదకరమైన స్థితిలో ఆసుపత్రికి వస్తుంటారు. ముఖంతో పాటు గాలి పీల్చుకునే శ్వాసవాహిక కూడా ఉబ్బి పోతుంది. చేతులు, పాదాలపై మెహెందీ డిజైన్ ఉన్న చోట చర్మం ఎర్రగా కందిపోయి, పొక్కులు, చీము కనిపిస్తుంటుంది. కాబట్టి ప్రకృతి సిద్ధంగా లభించే గోరింటాకును ఉపయోగించడాన్నే ప్రోత్సహించాలి.

 - శైలజ సూరపనేని, కాస్మటిక్ డెర్మటాలజిస్ట్


- నిర్మలారెడ్డి 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top