breaking news
Telugu festivals
-
కనుమ పండగ .. “అన్నదాతల పండుగ".. పోలో పొలి అని చల్లే ఆ పొలి ఏంటంటే?
కనుమను పశువుల పండుగగా వ్యవహరిస్తారు. పంటలు చేతికి అందడంలో తమకు సహాయపడిన పశుపక్షాదులను పూజిస్తారు. సంవత్సరంలో మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పని చేసిన ఆవులను , ఎద్దులను పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఇదే. పక్షులు కూడా రైతన్ననేస్తాలే. అందుకే వాటి కోసమే అన్నట్టు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వ్రేలాడ దీస్తారు. పశువుల పండుగ ముఖ్యంగా చిత్తూరుజిల్లా , అందులో పాకాల మండలంలోని వల్లివేడు గ్రామ పరిసర అన్ని పల్లెల్లో ఈ పండగ జరుపుకోవటంలో ఒక ప్రత్యేకత వున్నది. ఆ ప్రత్యేకత ఏమిటంటే ? ఆ రోజు ఇంటికి ఒకరు చొప్పున తెల్లవారక ముందే ఒక కత్తి , ఒక సంచి తీసుకొని సమీపంలో ఉన్న అడవికి బయలు దేరుతారు. అక్కడ దొరికే వన మూలికలు , ఔషద మొక్కలు సేకరిస్తారు. కొన్ని చెట్లఆకులు , కొన్ని చెట్ల బెరుడులు , కొన్ని చెట్ల పూలు , వేర్లు , కాండాలు , గడ్డలు , ఇలా చాల సేకరిస్తారు. కొన్ని నిర్దిష్టమైన చెట్ల భాగాలను మాత్రమే సెకరించాలి. అంటే ... మద్ది మాను , నేరేడు మానుచెక్క , మోదుగ పూలు , నల్లేరు , మారేడు కాయ ఇలా అనేక మూలికలను సేకరించి ఇంటికి తీసుకొచ్చి వాటిని కత్తితో చిన్న ముక్కలుగా చేసి , ఆ తర్వాత దానికి పెద్ద మొత్తంలో ఉప్పు చేర్చి రోట్లో వేసి బాగా దంచుతారు. అదంతా మెత్తటి పొడిలాగ అవుతుంది. దీన్ని "ఉప్పు చెక్క'' అంటారు. ఇది అత్యంత ఘాటైన మధురమైన వాసనతో వుంటుంది. దీన్ని పశువులకు తిని పించాలి. ఇదొక పెద్ద ప్రహసనం. అవి దీన్ని తినవు. అంచేత ఒక్కొక్క దాన్ని పట్టుకొని దాని నోరు తెరిచి అందులో ఈ ఉప్పు చెక్కను చారెడు పోసి దాని నోరు మూస్తారు. అప్పుడు ఆ పశువు దాన్ని మీంగుతుంది.. ఇలా ఒక్కదానికి సుమారు రెండు మూడు దోసిళ్ళ ఉప్పు చెక్కను తినిపిస్తారు. గొర్రెలు మేకలు ఐతే కొన్ని వాటంతట అవే తింటాయి. లేకుంటే వాటిక్కూడ తినిపిస్తారు. ఏడాదికి ఒకసారి ఈ ఉప్పుచెక్కను తినిపిస్తే అది పశువులకు సర్వరోగ నివారణి అని వీరి నమ్మకం. ఎందుకంటే అందులో వున్నవన్నీ ఔషధాలు , వన మూలికలే గదా. ఆ తర్వాత పశువులన్నింటిని పొలాల్లోని బావుల వద్దకు గాని , చెరువుల వద్దకు గాని తోలుకెళ్ళి స్నానం చేయించి , లేదా ఈత కొట్టించి , ఇంటికి తోలుకొస్తారు. ఆ తర్వాత వాటి కొమ్ములను , పదునయిన కత్తితో బాగా చెలిగి వాటికి రంగులు పూస్తారు. మంచి కోడెలున్న వారు వాటి కొమ్ములకు ఇత్తడి కుప్పెలు తొడిగి , మెడలో మువ్వల పట్టీలు , మూతికి మూజంబరాలు అలంకరిస్తారు. అన్నింటికీ కొత్త పగ్గాలు వేస్తారు. ఈ సమయంలో చేలన్నీ పరిగిలి పోయి వున్నందున పశువులన్నింటిని వదిలేస్తారు. సాయంకాలం ఊరు ముందున్న కాటమరాజును పునఃప్రతిష్టించి ఊరిలో ప్రతి ఇంటి నుండి ఆడవారు కాటమరాజు ముందు పొంగలి పెడ్తారు. పొంగలి అంటే కొత్త కుండలో , కొత్త బియ్యం , కొత్త బెల్లం వేసి అన్నం వండడం. ఒక నెల ముందు నుండే కాటమరాజు ముందు ఆ దారిన వచ్చిపోయే ఊరివారు రోజుకొక కంపో , కర్రో తెచ్చి అక్కడ కుప్పగా వేస్తారు. కనుమ రోజుకు అది ఒకపెద్ద కుప్పగా తయారయ ఉంటుంది. దాన్ని "చిట్లా కుప్ప" అంటారు. చీకటి పడే సమయానికి పొంగళ్లు తయారయి ఉంటాయి. ఊరి చాకలి కాటమరాజు పూజ కార్యక్రమం ప్రారంబించి దేవుని ముందు పెద్ద తళిగ వేస్తారు. అంటే ప్రతి పొంగలి నుండి కొంత తీసి అక్కడ ఆకులో కుప్పగా పెడతారు , పూజానంతరం మొక్కున్న వారు , చాకిలి చేత కోళ్ళను కోయించుకుంటారు. అప్పటికి బాగా చీకటి పడి వుంటుంది. అప్పటికి పశుకాపరులు అందరూ ఊరి పశువులన్నింటిని అక్కడికి తోలుకొని వస్తారు. పూజారి అయిన చాకలి తళిగలోని పొంగలిని తీసి ఒక పెద్దముద్దగా చేసి అందులో సగం పోలిగాని కిచ్చి (పశువుల కాపరి) తినమని చెప్పి , తర్వాత అక్కడున్న చిట్లాకుప్పకు నిప్పు పెడతారు. పెద్ద మంట పైకి లేవగా పోలిగాడు పశువులన్నింటిని బెదరగొట్టి , చెదరకొడతాడు. అవి బెదిరి పొలాల వెంబడి పరుగులు తీస్తాయి. ఆ సమయంలో పశువులను బెదర గొడుతున్న పోలిగాని వీపున చాకలి తనచేతిలో వున్న మిగిలిన సగం పొంగలి ముద్దను అతని వీపు మీద కొడతాడు. దానిని పిడుగు ముద్ద అంటారు. వాడు పరిగెడుతాడు. ఆ తర్వాత అందరూ అక్కడ మిగిలిన తళిగలోని ప్రసాదాన్ని తిని మొక్కులు తీర్చుకొని చిట్లకుప్ప మంట వెలుగులో తమ కోళ్ళను కోసుకొని పొంగళ్లను తీసుకొని తాపీగా ఇళ్ళకి వెళతారు. పొలి అంటే? ఈ సందర్భంగా పెద్ద మొక్కున్న వారు పొటేళ్ళను కూడ బలి ఇస్తారు. దాని రక్తాన్ని ఆన్నంలో కలిపి ఒక కుప్ప పెడతారు. దాన్ని ''పొలి'' అంటారు. ఆ "పొలి" ని తోటకాపరి గాని, నీరు కట్టేవాడు గాని తీసుకొని వెళ్ళి అందరి పొలాల్లో , చెరువుల్లో , బావుల్లో "పొలో.... పొలి" అని అరుస్తూ చల్లుతాడు. అప్పడే కొత్త మొక్కులు కూడ మొక్కు కుంటారు. అంటే , తమ పశుమందలు అభివృద్ది చెందితే రాబోయే పండక్కి పొట్టేలును , కోడిని ఇస్తామని కాటమ రాజుకు మొక్కు కుంటారు. అప్పటికప్పుడే ఒక పొటెలుపిల్లను ఎంపిక చేస్తారు. ఆ విధంగా పశువుల పండగ పరిసమాప్తి అవుతుంది. ఈ నెలరోజులు వాకిట్లో అందమైన ముగ్గులతో అలంకరిస్తాము. కానీ ఈ కనుమ రోజున మాత్రం రధం ముగ్గువేసి ఆ రథాన్ని వీధిచివర వరకూ లాగినట్టుగా ముగ్గువేస్తారు. దీని అర్థం సూర్యుడు తన దిశను మార్చుకున్న మొదటిరోజు అని తెలుస్తుంది. -
గోరింటా పూసిందీ...
మతాలకు అతీతమైనది. వయసు తేడా లేనిది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ మగువ మనసుకు ముచ్చట కలిగించేది... గోరింట. ఈ మాసం ఆషాఢం. ఓ వైపు రంజాన్, మరో వైపు తెలుగు పండగలు వరసగా వస్తున్నాయి. అతివ చేతుల్లో గోరింట మందారంలా పూసి, మెరిసి, మురిసిపోయే రోజులే ఇక ముందన్నీ... అందుకే ఎర్రన్ని గోరింట ముస్తాబు... ఈ వారం... గోరింట చెట్టు వర్షాకాలంలో కొత్త చిగుళ్లు తొడుక్కుంటుంది. ఈ చెట్టు లేత ఆకులను ముద్దగా నూరి, కావలసిన ఆకారంలో చేతులకు పెట్టి, రెండు నుంచి ఆరు గంటల సేపు ఉంచితే చేతులు ఎరుపు రంగులోకి మారతాయి. ఔషధ గుణాలు మెండుగా ఉండే గోరింటాకును చేతులు, పాదాలకు అలంకరించుకోవడం వల్ల వర్షాకాలంలో వచ్చే చర్మ సమస్యలు దరిచేరవని చెబుతుంటారు పెద్దలు. ప్రాచీన కాలం నుంచి సౌందర్య సాధనాలలో గోరింటాకు ప్రధాన భూమిక పోషిస్తూ వస్తోంది. చర్మసంరక్షణలో మరొకటి సాటిలేదనిపించే ఈ ఆకు నుంచి అందమైన డిజెన్లైన్నో సృష్టించారు సృజనకారులు. వీటిని మగువలతో పాటు మగవారూ తమ భుజాలు, వీపు, ఛాతీ భాగాలలో టాటూగా వేయించుకోవడానికి ఇష్టపడుతున్నారు. తెలుగింటి పల్లెపడుచు చేతుల్లో నిండుగా... క్రిస్టియన్ పెళ్లి వేడుకలలో కాంతిమంతంగా... ముస్లిమ్ మగువ ముంజేతులలో ఆకర్షణీయంగా.. గోరింట రూపురేఖలు మార్చుకొని మెహెందీ డిజైన్లుగా ఆకట్టుకుంటోంది. హిందూ, ముస్లిమ్, క్రిస్టియన్,.. ఏ మతమైనా మెహెందీ విషయంలో భేద భావం లేదు. మనసుకు నచ్చిన డిజైన్ అయితే చాలు. ప్రపంచం మొత్తమ్మీద గోరింటతో శారీరక అలంకరణలో రకరకాల ప్రయోగాలు చేసేది ఇండియా, అరబ్ దేశాలు మాత్రమే. అదృష్టానికి, ఆరోగ్యానికి ప్రతీకగా అరబ్దేశాలలో ఐదు వేల ఏళ్ల క్రితమే గోరింటను వాడినట్టు, హెన్నా పదం అక్కడి నుంచే వచ్చినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. గోరింట చెట్టు ఇంట్లో ఉంటే దుష్టశక్తులు దరిచేరవని, మంచి ఆలోచనలు వస్తాయని నమ్మేవారు. కొన్ని తరాల తర్వాత గోరింట ఆకులను ఎండబెట్టి, పొడి చేసి చేతులు, పాదాలపై రేఖాగణిత నమూనాలలో డిజైన్లు వేసుకునేవారు. వీటివల్ల సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని, అండాశయాల పనితీరు మెరుగవుతుందని భావించేవారు. ఇప్పటికీ మన దేశ గ్రామీణ ప్రాంతాలలో ఈ నమ్మకం ఉంది. ఈజిప్ట్ ‘మమ్మీ’ల జుట్టు, గోళ్లు ముదురు గోధుమ రంగులోకి రావడానికి గోరింటాకును వాడేవారని ఒక వివాదాస్పద వార్త కూడా ఉంది. క్రీ.పూ 700 కాలంలో గోరింట మొక్క ఈజిప్ట్ నుంచి భారతదేశంలో అడుగుపెట్టిందని, అప్పటి నుంచి అతివల చేతులు, పాదాలపై గోరింట ఎర్రగా పూయడం మొదలుపెట్టిందని వృక్షశాస్త్రజ్ఞులు చెబుతున్నారు. చారిత్రకపరంగా చూస్తే మనుషులకు గోరింటాకు ఔషధంగా... వస్త్రం, లెదర్, కేశాలు రంగు మారడానికి ‘డై’గా వాడేవారని తెలుస్తోంది. ఉత్తరాదిన కడ్వాచౌత్, దీపావళి, దక్షిణాదిన అట్లతద్ది వంటి పండగలలో గోరింట ప్రధాన భూమిక పోషిస్తోంది. ఉత్తరభారత వివాహ సంప్రదాయం ఇటీవల దక్షిణాదినీ ఆకట్టుకుంటోంది. అందులో భాగంగానే వివాహానికి ముందు మెహిందీ కోసం ప్రత్యేకంగా వేడుకలు జరుపుతున్నారు. బాలీవుడ్ సినిమాలలో ‘మెహెందీ వేడుక’ ఒక ప్రధానాంశం. ఈ సినిమాల వల్ల నేపాల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, మాల్దీవులలో వివాహవేడుకల సమయాలలో అలంకరణలో భాగంగా మెహెందీ ప్రథమస్థానంలో నిలిచింది. ఆ విధంగా 1990 నుంచి మెహెందీ అలంకరణలలో నూతన పోకడలు వచ్చి చేరాయి. నాటి నుంచి ఈ డిజైన్లను ‘హెన్నా టాటూస్’గా పిలవడం ప్రారంభించారు. ప్రస్తుత కాలంలో పాకిస్థాన్, గల్ఫ్ దేశాలు హెన్నా డిజైన్స్‌లో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఈ డిజైన్లని ముస్లిమ్ మహిళలు అలవోకగా వేయడం అక్కడి నుంచే మొదలైంది. వేదాలలో గోరింటరంగును సూర్యునికి ప్రతీకగా చె ప్పారు. అందుకే అరచేతుల్లో సూర్యుని ఆకారాన్ని పోలి ఉండే గుండ్రటి డిజైన్ వేసేవారు. మనిషి లోపల ఉన్న జ్ఞాన కాంతిని గోరింట ద్వారా మేలుకొలపడంగా భావించేవారు. డిజైన్లలో వైవిధ్యం ఇటీవల కాలంలో బ్రైడల్, ఇండియన్, అరబిక్... మెహెందీ డిజైన్లు పోటీ పడుతున్నాయి. వీటిలోనే షేడెడ్, ఫ్లోరల్, మోటిఫ్స్... ఇలా తీర్చిన డిజైన్లలో రంగురంగుల రాళ్లు, పూసలు, గ్లిట్టర్ (మెరుపుతో ఉండే పచ్చని రంగు)ను కూడా ఉపయోగిస్తున్నారు. మరికొందరు నేరుగా అచ్చులతో రంగు డిజైన్లను నిమిషాలలో ఒంటి మీద ముద్రించుకుంటున్నారు. ఇంకొందరు ప్లాస్టిక్ డిజైన్ల్లో వచ్చిన స్టిక్కర్స్నీ అతికించుకుంటున్నారు. జీవనశైలి వేగవంతంగా మారుతుండటంతో ఈ డిజైన్లలోనూ ఆధునిక పోకడలు వేగం పుంజుకుంటున్నాయి. మెహెందీ.. ఇలా మేలు.. మెహెందీ కోన్లు మార్కెట్లో విస్తృతంగా లభిస్తున్నాయి. వీటితో డిజైన్ వేసుకోవడానికి ముందు ఆ మెహెందీ మన చర్మానికి సరి పడుతుందా లేదా అనేది పరీక్షించుకోవడం తప్పనిసరి. చెవి వెనుక భాగంలో (చెవి వెనుక భాగం చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అందుకని ఏ రియాక్షన్ అయినా త్వరగా తెలిసిపోతుంది) లేదా మోచేతి దగ్గర మెహెందీ రాసుకొని, 3-4 రోజుల తర్వాత కూడా ఎలాంటి రియాక్షన్ లేదంటే అప్పుడు డిజైన్ వేయించుకోవడం ఉత్తమం. మరీ ముఖ్యంగా బ్లాక్ మెహెందీలో ఎక్కువ అలెర్జీ కారకాలు ఉంటున్నాయి. డిజైన్ నల్లగా రావడానికి వీటిలో హానికారక రసాయనాలు కలుపుతున్నారు. మెరుపులు వచ్చే గ్లిట్టర్ తరహా మెహెందీలు సైతం చర్మానికి పడక చాలా మంది ప్రమాదకరమైన స్థితిలో ఆసుపత్రికి వస్తుంటారు. ముఖంతో పాటు గాలి పీల్చుకునే శ్వాసవాహిక కూడా ఉబ్బి పోతుంది. చేతులు, పాదాలపై మెహెందీ డిజైన్ ఉన్న చోట చర్మం ఎర్రగా కందిపోయి, పొక్కులు, చీము కనిపిస్తుంటుంది. కాబట్టి ప్రకృతి సిద్ధంగా లభించే గోరింటాకును ఉపయోగించడాన్నే ప్రోత్సహించాలి. - శైలజ సూరపనేని, కాస్మటిక్ డెర్మటాలజిస్ట్ - నిర్మలారెడ్డి