అపురూపంగా చూసుకోవాలి

 Make extraordinary look - Sakshi

చెట్టు నీడ

కొత్తగా పెళ్లయిన జంట భోజనానికి కూర్చుంది.   ‘‘మీ అమ్మగారిని కూడా పిలవండి’’ అని చెప్పింది భార్య. ‘‘మా అమ్మ సంగతి వదిలేయి.’’ అని విసుక్కున్నాడు భర్త. అందుకు  ఆమె ఒప్పుకోలేదు. మీ అమ్మగారు తినకుండా మనం తినడం భావ్యం కాదని చెప్పింది. పెళ్లికొడుక్కి చిర్రెత్తుకొచ్చింది. ఇద్దరి మధ్య వాదన జరిగింది. ఇద్దరూ పెళ్లైన  రోజే విడిపోయారు. ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. ఎవరికి తోచిన సంబంధం వాళ్లు చూసుకుని వేరే పెళ్లి చే సుకున్నారు. ఇలా ముప్ఫై ఏళ్లు గడిచిపోయాయి. ఆ మహిళకు మగ సంతానం కలిగింది. పిల్లలు ప్రయోజకులయ్యారు. పిల్లల్ని ధార్మికంగా తీర్చిదిద్దడంతో పిల్లలు కూడా తల్లిని రాణిలా చూసుకోసాగారు. కాళ్లకు మట్టి కూడా అంటనివ్వకుండా ఎంతో అపురూపంగా చూసుకోసాగారు. దగ్గరుండి హజ్‌ యాత్ర చేయించారు. హజ్‌ యాత్ర తిరుగు ప్రయాణంలో ఒక చోట ఒక వ్యక్తి చింపిరి జుట్టుతో రోడ్డుపక్కన దుర్భరస్థితిలో పడి ఉన్నాడు. ఆ వ్యక్తిని చూసి చలించిపోయిన ఆ మహిళ ఆ అభాగ్యుడిని లేపి ఏదైనా తినిపించి మంచినీళ్లు తాగించాలని తన పిల్లలను కోరింది. పిల్లలు ఆ వ్యక్తిని లేపి కూర్చోబెడుతుండగా ఆ వ్యక్తిపై ఆమె దృష్టి పడింది. ఒక్కసారిగా ఆశ్చర్యపోయిందా మహిళ. ఆ వ్యక్తి ఎవరో కాదు, తన మొదటి భర్త అని గుర్తుచేసుకొంది. ఈ దుస్థితికి కారణమేమిటని అడిగింది. 

దానికా వ్యక్తి ‘‘మా పిల్లలు నా ఆస్తినంతా కాజేసి నన్ను బయటకు గెంటేశారు’’ అని తన దీనస్థితిని చెప్పుకొచ్చాడు. అప్పుడామె కలగజేసుకొని ‘‘నీ ఈ దుస్థితిని మన పెళ్లయిన మొదటి రాత్రే అంచనా వేశాను. నువ్వు మీ అమ్మానాన్నల హక్కులు నెరవేర్చడంలో నిర్లక్ష్యం చేశావు. వాళ్లను చులకనగా చూశావు. రేపటి రోజు నాకూ ఇదే గతి పడుతుందనే ఆ రోజు నీ నుంచి విడిపోయాను’’ అని చెప్పింది. మన వృద్ధాప్యం ఎలా గడపాలని కోరుకుంటున్నామో మన తల్లిదండ్రులకూ అలాంటి  వృద్ధాప్యాన్ని అందించాలి. ముసలితనంలో వాళ్లను ఆదరించాలి. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే బతికుండగానే ఆ పాపం మన మెడకు చుట్టుకుంటుందని ముహమ్మద్‌ ప్రవక్త (స) హెచ్చరించారు.
–  ముహమ్మద్‌ హమ్మాద్‌ 
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top