పెద్దపల్లి పెద్దవ్వ

Madhuramma Had Three Sons Two Of Whom Had Joined The Maoist Movement - Sakshi

స్త్రీ శక్తి

జిల్లా కేంద్రం పెద్దపల్లి కమాన్‌ చౌరస్తా నుంచి కిలోమీటరు దూరం వెళ్తే బ్రాహ్మణ వీధి వస్తుంది. ఆవీధిలోని ఒక ఇంట్లో.. రెండు మూడేళ్లు తక్కువగా నూరేళ్ల వయసున్న మాతృమూర్తి కనిపిస్తుంది. పేరు మల్లోజుల మధురమ్మ. ఆమె పేరు చెవిన పడని తెలంగాణ ప్రాంతం లేదు. ఉత్తర తెలంగాణలోనైతే ఇంటింటా ‘‘అవును.. మల్లోజుల మధురమ్మ నాకు తెలుసు.. నేను చూశా.. నేను విన్నా’’ అని చెప్పుకునేవారే. కారణం.. ఆ తల్లి జీవితంలో ప్రతి పేజీ ఓ చరిత్రకు ముడిపడి ఉంది.

నాడు తెలంగాణ విమోచన పోరాటం నుండి సమసమాజ స్థాపన కోసం నేటికీ జరుగుతున్న ప్రతి పోరాట ఘట్టంలో మల్లోజుల మధురమ్మ పాత్ర పరోక్షంగా ఉంది. ఆమె భర్త మల్లోజుల వెంకటయ్య తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని రాష్ట్ర విమోచన ఉద్యమంలో ఒకరయ్యారు. మధురమ్మ ముగ్గురు కొడుకుల్లో ఇద్దరు.. అసమానతలు లేని నవసమాజ నిర్మాణం కోసం అడవులు పట్టి వెళ్లారు. ఆ అన్నదమ్ముల్లో ఒక్కరు కిషన్‌జీ అమరుడయ్యారు. మరొకరు మల్లోజుల వేణు ఇప్పుడు మోస్ట్‌ వాంటెడ్‌ నక్సలైట్‌ నాయకుడు. సెప్టెంబర్‌ 17 తెలంగాణ విమోచన దినం సందర్భంగా.. తల్లిగా, తెలంగాణ సాయుధ వీరుడు వెంకటయ్య భార్యగా మధురమ్మ జీవిత విశేషాలు కొన్ని.

సమరయోధుని భార్యగా గుర్తింపు
మల్లోజుల మధురమ్మ పండు ముసలితనంలోనూ కళ్లద్దాలు లేకుండానే స్పష్టంగా చూస్తుంది. చెవులు వినబడుతాయి. అంతే స్పష్టంగా మాట్లాడుతుంది. కారణం.. ఈ సమాజాన్ని రెండు వైపులా చూసింది. రజాకార్లు, పోలీసులు పెట్టిన వేధింపులు అనుభవించింది. ప్రభుత్వాధికారుల నుండి సన్మానాలు అందుకుంది. సమరయోధుడి భార్యగా ఏటా జరిగే స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలలో సన్మానాలు అందుకుంటూనే ఉంది. ఇటీవల సాక్షాత్తూ పెద్దపల్లి కలెక్టర్‌ శ్రీదేవసేన మధురమ్మకు పాదాభివందనం చేశారు. తెలంగాణ ఉద్యమ నాయకులంతా మధురమ్మ నుంచి ఆశీర్వాదం అందుకున్నవారే. ఇందుకు భిన్నమైన కోణం కూడా ఉంది. స్వాతంత్య్ర సమరయోధుల కోటాలో రామగుండం మండలం ముర్మూరు వద్ద ప్రభుత్వం వెంకటయ్యకు కేటాయించిన ఏడు ఎకరాల భూమి ఎల్లంపల్లి ప్రాజెక్టులో మునిగిపోయింది. భూమికి బదులు భూమిని ఇస్తామన్న అధికారులు ఇప్పుడు చేతులెత్తేయడంతో.. మధురమ్మకు అభినందనలు మాత్రమే మిగిలాయి.

భర్త ఆచూకీ కోసం చిత్రహింసలు
పెద్దపల్లి ప్రాంతానికి చెందిన ఐదారుగురు యువకులు నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. అందులో మల్లోజుల మధురమ్మ భర్త వెంకటయ్య ఒకరు. నాగపూర్‌ క్యాంపులో కమ్యూనిస్టు కార్యకర్తగా శిక్షణ పొందిన వెంకటయ్యను రజాకార్లు అరెస్టు చేసి సుల్తానాబాద్‌ కోర్టులో హాజరుపరిచి వరంగల్‌ జైలుకు తరలించారు. అంతకు ముందు భర్త ఆచూకీ కోసం మధురమ్మను వారు పెట్టిన చిత్ర హింసలు అన్నీ ఇన్నీ కావు.

అడవిబాట పట్టిన కన్నబిడ్డలు
తెలంగాణ ప్రాంతం విముక్తి తర్వాత పదేళ్లకు పుట్టిన మధురమ్మ ముగ్గురు కొడుకుల్లో పెద్ద వారైన ఆంజనేయశర్మ ప్రస్తుతం పెద్దపల్లిలోనే పౌరోహిత్యం చేస్తున్నారు. ‘‘చివరిసారి 25 ఏళ్ల క్రితం పోలీసులు నా కొడుకుల జాడ చెప్పా లంటూ ఇల్లు నేలమట్టం చేయడంతో నిరాశ్రయురాలినై తుంగ గుడిసెలోనే నాలుగేళ్లు కాలం గడిపాను’’ అని చెమర్చిన కళ్లతో మధురమ్మ నాటి ఘటనను గుర్తు చేసుకున్నారు.
– కట్ట నరేంద్రాచారి, సాక్షి, పెద్దపల్లి
ఫొటోలు : సతీష్‌ రెడ్డి

అగ్రనేత కిషన్‌జీ
ఎనిమిదేళ్ల క్రితం ఎన్‌కౌంటర్‌లో మరణించిన మధురమ్మ రెండో కొడుకు కిషన్‌జీ (మల్లోజుల కోటేశ్వరరావు) మావోయిస్టు పార్టీ నిర్మాణ కర్తల్లో ఒకరు. 1976లో ఎమర్జెన్సీ సమయంలో అరెస్టు అయిన విప్లవ సానుభూతిపరుడు. జగిత్యాల జైత్రయాత్ర నుండి మొదలైన కిషన్‌జీ ప్రస్థానం పీపుల్స్‌వార్‌ పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శిగా సుదీర్ఘ కాలం సాగింది. ఆ తర్వాత కేంద్ర కమిటీలో బాధ్యతలు నిర్వర్తిస్తూ పశ్చిమబెంగాల్, జార్ఖండ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు ఇన్‌చార్జిగా ఉన్నారు. భారత విప్లవోద్యమ పితామహుడైన చారుమజుందార్‌ సొంత గడ్డ పశ్చిమబెంగాల్‌లో మావోయిస్టు ఉద్యమాన్ని కిషన్‌జీ పునరుజ్జీవింపజేశారు. పెద్దపల్లిలో ఆయన అంత్యక్రియలకు ముంబై, ఢిల్లీ, కలకత్తాలకు చెందిన జాతీయ మీడియా ప్రతినిధులు సైతం రావడం విశేషం.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top