లూపస్‌ అంటే?

Lupus disease can not be spread from one person to another - Sakshi

నేడు వరల్డ్‌ లూపస్‌ డే

లూపస్‌ అనే ఈ వ్యాధిని సిస్టమిక్‌ లూపస్‌ ఎరిథమెటోసస్‌ (ఎస్‌ఎల్‌ఈ) అని కూడా అంటారు. ఇది ప్రతి వెయ్యిమందిలో ఒకరికి వస్తుంది. ఇది ఆఫ్రికన్‌–అమెరికన్స్‌తో పాటు ఆసియా వాసుల్లో ఎక్కువ. ఈ వ్యాధి మహిళల్లోనే ఎక్కువగా వస్తుంది. అంటే వ్యాధిగ్రస్తుల్లో మహిళలు–పురుషుల నిష్పత్తి 9:1గా ఉంటుంది. ఇది 15 నుంచి 45 ఏళ్ల మధ్యవయసు వారిలోనే ఎక్కువగా కనిపిస్తుంది. చిన్నపిల్లలు, వృద్ధులకు కూడా వ్యాధి వస్తుంది.

లూపస్‌ వ్యాధిగ్రస్తుల్లో వ్యాధినిర్ధారణకూ, చికిత్సకూ సుమారు మూడేళ్లపాటు వేచిచూడాల్సిన పరిస్థితి ఉంది. మన దేశంలో ప్రజలతోపాటు చాలామంది వైద్యుల్లోనూ ఈ వ్యాధిపై సరైన అవగాహన లేకపోవడం, రుమటాలజిస్టుల కొరత వల్ల వ్యాధి ముదిరాక మాత్రమే చాలామంది వైద్యులను ఆశ్రయిస్తున్న పరిస్థితి నెలకొని ఉంది. లూపస్‌ అంటే గ్రీకు భాషలో తోడేలు (వూల్ఫ్‌) అని అర్థం. ఒకప్పుడు వైద్యం అందుబాటులో లేని సమయంలో వ్యాధిగ్రస్తుల ముఖం తోడేలును తలపించేది. కాబట్టి ఈ వ్యాధికి ఆ పేరు వచ్చింది. 

లక్షణాలు:
►జుట్టు ఎక్కువగా రాలడం
►ముఖం మీద సీతాకోకచిలుక ఆకృతితో ముక్కుకు ఇరువైపులా ఎర్రటి మచ్చలు రావడం
►నోట్లో పుండ్లు పడటం ∙కీళ్లనొప్పులు
►కీళ్లవాపులు ∙విపరీతమైన అలసట
►జ్వరం వస్తూ, తగ్గుతూ ఉండటం వంటి లక్షణాలు వ్యాధిగ్రస్తుల్లో ప్రాథమికంగా కనిపిస్తుంటాయి. వ్యాధి నిర్ధారణ కాకుండా చికిత్స అలస్యం అయితే... క్రమేణా ఈ వ్యాధి శరీరంలోని ఇతర ►అవయవాలకు వ్యాపించే అవకాశం ఉంది. లూపస్‌ వ్యాధి వల్ల మన రక్తకణాలు బాగా తగ్గిపోవచ్చు. (ప్లేట్‌లెట్లు, తెల్లరక్తకణాలు, హీమోగ్లోబిన్‌ కౌంట్‌ తగ్గవచ్చు). 

ఇతర కీలక అవయవాలపై వ్యాధి దుష్ప్రభావాలు ఇలా... 
మూత్రపిండాలు ప్రభావితమైతే లూపస్‌ నెఫ్రైటిస్‌ అనే సమస్య, మెదడు ప్రభావితమైతే ఫిట్‌ ఊపిరితిత్తులు ప్రభావితమైతే ఊపిరితిత్తుల చుట్టూ నీరు చేరడం (ప్లూరల్‌ ఎఫ్యూజన్‌), ఊపిరితిత్తుల్లో కొబ్బరిపీచు వంటి పదార్థం వృద్ధి కావడం (లంగ్‌ ఫైబ్రోసిస్‌/ఐఎల్‌డీ), గుండె ప్రభావితమైతే దానిచుట్టూ నీరు చేరడం (పెరికార్డియల్‌ ఎఫ్యూజన్‌), గుండె వేగంగా కొట్టుకోవడం (మయోకారై్డటిస్‌), హార్ట్‌ ఫెయిల్యూర్‌ వంటి సమస్యలకు దారితీయవచ్చు. 

లూపస్‌లో రకాలు
1. సిస్టమిక్‌ లూపస్‌ ఎరిథమెటోసిస్‌: ఇది సాధారణంగా మనం ఎక్కువగా చూసే లూపస్‌. శరీరంలోని ఏ భాగమైనా దీనివల్ల ప్రభావితం కావచ్చు. 

2. డిస్కాయిడ్‌ లూపస్‌: ఇది ముఖం మీద, తలపైన, మెడమీది చర్మాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. చర్మంపై మందమైన పొరల్లాంటి మచ్చలు ఏర్పడతాయి. 

3. సబ్‌ ఎక్యూట్‌ క్యుటేనియస్‌ లూపస్‌: చర్మంపై సూర్మరశ్మి సోకిన ప్రాంతంలో తీవ్రమైన ఎర్రని మచ్చలు వస్తాయి. 

4. నవజాత శిశువుల లూపస్‌ (నియోనేటల్‌ లూపస్‌): లూపస్‌ ఉన్న తల్లులకు పుట్టిన నవజాత శిశువులకు వచ్చే అరుదైన లూపస్‌ ఇది. ఈ శిశువుల్లో చర్మంపై ఎర్రటి మచ్చలు వచ్చి, కొద్దివారాల్లోనే పూర్తిగా నయమవుతాయి. చాలా కొద్దిమందిలో హార్ట్‌ బ్లాక్‌ రావచ్చు. 

5. మందులతో వచ్చే లూపస్‌ (డ్రగ్‌ ఇండ్యూస్‌డ్‌ లూపస్‌): చాలా అరుదుగా కొన్నిరకాలపై మందుల వల్ల లూపస్‌ లక్షణాలు రావచ్చు. కానీ ఆ మందులు ఆపేసిన తర్వాత లక్షణాలూ పూర్తిగా తగ్గిపోతాయి. హైడ్రాలజైన్, ప్రొకైనమైడ్, ఐసోనియాజిడ్‌ వంటి మందుల వల్ల అరుదుగా ఇలా జరగవచ్చు. 

వ్యాధినిర్ధారణ పరీక్షలు 
►సీబీపీ
►క్రియాటినిన్‌
►లివర్‌ ఎంజైమ్‌ల పరీక్షలు
►ఈఎస్‌ఆర్‌
►సీఆర్‌పీ
►మూత్రపరీక్ష
►ఏఎన్‌ఏ టెస్ట్‌
►డీఎస్‌–డీఎన్‌ఏ టెస్ట్‌
►ఏఎన్‌ఏ ప్రొఫైల్‌
►ఛాతీ ఎక్స్‌రే
►స్కానింగ్‌ వంటి పరీక్షలు చేసి డాక్టర్లు లూపస్‌ వ్యాధి నిర్ధారణ చేస్తారు. 

ఇంకొన్ని ముఖ్యమైన పరీక్షలు 
►యాంటీస్మిత్‌ యాంటీబాడీస్‌
►యాంటీఫా
►స్ఫోలిపిడ్‌ యాంటీబాడీస్‌
►యాంటీ రో–యాంటీబాడీ
►యాంటీ లా–యాంటీబాడీ
►సీరమ్‌ కాంప్లిమెంట్స్‌ ∙24 గంటల మూత్రపరీక్ష 

లూపస్‌ ఎందుకు వస్తుంది? 
మన శరీరంలో వ్యాధి నిరోధక వ్యవస్థ (ఇమ్యూన్‌ సిస్టమ్‌)లో సమతౌల్యం లోపించినప్పుడు మనల్ని రక్షించాల్సిన వ్యాధి నిరోధకత మన శరీరంపైనే దాడి చేయడం వల్ల లూపస్‌ వంటి ఆటో ఇమ్యూన్‌ వ్యాధులు వస్తాయి. జన్యువులు, పరిసరాలు, హార్మోన్ల వంటి అంశాలు ఈ వ్యాధికి కారణం అవుతుంటాయి. ఒక్కోసారి సూర్మరశ్మి అధికంగా సోకడం వల్ల, వైరస్‌–బ్యాక్టీరియాల వల్ల కూడా లూపస్‌ వ్యాధి తీవ్రతరం కావచ్చు. 

చికిత్స
ఆధునిక చికిత్సతో లూపస్‌ వ్యాధిగ్రస్తులు సరైన సమయంలో మందులు మొదలుపెడితే, వారు పూర్తిగా కోలుకొని, సాధారణ జీవితం గడిపే అవకాశం ఉంది. ఇక మందులు వాడేవారు ఒక్కసారిగా లూపస్‌ మందులు ఆపితే చాలా ప్రమాదం. రుమటాలజిస్టుల పర్యవేక్షణలో క్రమం తప్పకుండా మందులు వాడాలి. వ్యాధి తగ్గుముఖం పట్టిన తర్వాత మందుల మోతాదు తగ్గించే అవకాశం ఉంటుంది. అది కూడా రుమటాలజిస్టులు మాత్రమే ఈ నిర్ణయం తీసుకోవాలి. 

లూపస్‌ వ్యాధిలో వాడే సాధారణ మందులు 
►హైడ్రాక్సి క్లోరోక్విన్‌
►ఎజథయోప్రిన్‌
►మిథోట్రెక్సేట్‌
►కార్టికోస్టెరాయిడ్స్‌
►సైక్లోఫాస్ఫమైడ్స్‌
►మైకోఫినొలేట్‌
►టాక్రోలిమస్‌లతో పాటు సన్‌స్క్రీన్‌ ఆయింట్‌మెంట్లు వాడాల్సి ఉంటుంది. 

అడ్వాన్స్‌డ్‌ చికిత్సలు:
►ఐఆర్‌ఐజీ థెరపీ
►పాస్మాఫెరిసిస్‌
►రిటాక్సిమాబ్‌
►ఎక్మోథెరపీ

లూపస్‌ వ్యాధి... కొన్ని ముఖ్యమైన విషయాలు : 
►లూపస్‌ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు, సోకదు
►లూపస్‌ వ్యాధిని త్వరగా గుర్తిస్తే మందులతో పూర్తిగా నయం చేయవచ్చు
►లూపస్‌ వ్యాధిగ్రస్తులు మందులు వాడుతూ పూర్తిస్థాయి సాధారణ జీవితం గడపవచ్చు
►క్రమంతప్పకుండా రుమటాలజిస్టులను సంప్రదించి మందులు వాడాలి
►ప్రత్యేకమైన ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం ఏమీ ఉండదు. అయితే సమతుల ఆహారం తీసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా వంటివి చేస్తే మంచిది. శరీరం, ►మనసుపైన ఒత్తిడి తగ్గించి, మనసును ఉల్లాసంగా ఉంచే పనులు చేయాలి. 

లూపస్‌ వ్యాధిని ఎదిరించి పోరాడిన కొందరు ప్రముఖులు 
►సెలీనా గోమేజ్‌
►లేడీ గాగా (సింగర్, నటి)
►టోనీ బ్రాక్స్‌టన్‌ (గ్రామీ అవార్డు విన్నింగ్‌ సింగర్‌)
►నిక్‌ కేనన్‌ (రేపర్, నటుడు)
►సీల్‌ (బ్రిటిష్‌ సింగర్, సాంగ్‌ రైటర్‌)  
►క్రిస్టెన్‌ జాన్‌స్టన్‌ (మోడల్‌)

డాక్టర్‌ వి. శరత్‌ చంద్రమౌళి
క్లినికల్‌ డైరెక్టర్, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ రుమటాలజీ అండ్‌ 
క్లినికల్‌ ఇమ్యునాలజీ, కిమ్స్‌ హాస్పిటల్స్, సికింద్రాబాద్‌ 

లూపస్‌ రోగుల్లో గర్భధారణ అసాధ్యంకాదు

లూపస్‌ వ్యాధిగ్రస్తుల్లో గర్భధారణ జరగడం, ఆ గర్భాన్ని కాపాడటం అటు రోగికీ ఇటు రుమటాలజిస్ట్‌కీ ఒక పెద్ద సవాలు. ఈ వ్యాధి ప్రభావం తల్లి మీదనే కాకుండా శిశువుపైన కూడా ఉంటుంది. 
చాలా మంది అపోహ పడే విధంగా ఈ రోగులు గర్భం దాల్చకూడదనేది కేవలం ఒక అపోహ మాత్రమే. అయితే గర్భం దాల్చడానికి ముందు జబ్బు తీవ్రత, మూత్రపిండాల మీద, గుండెపైన, మెదడుమీద దాని ప్రభావాన్ని అంచనా వేయాలి. జబ్బు తీవ్రత ఎక్కువగా ఉండి, దాని దుష్ప్రభావాలు మూత్రపిండాలు, గుండె, మెదడు వంటి కీలకమై అవయవాల మీద ఉన్నట్లయితే... తాత్కాలికంగా గర్భధారణను (ప్రెగ్నెన్సీని) ప్లాన్‌ చేసుకోకూడదు. అయితే ఇది కేవలం ‘‘తాత్కాలికంగా మాత్రమే’’ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దీనికి కారణం ఉంది. జబ్బు తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నప్పుడు గర్భం నిలబడకపోవచ్చు.

అంతేగాక వారిలో ఉండే యాంటీ ఫాస్ఫోలిపిడ్‌ యాంటీబాడీస్‌ అనే ప్రతికూల కణాల కారణంగా ప్రెగ్నెన్సీ సమయంలో సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వాటివల్ల మాయలో రక్తం గడ్డకట్టి శిశువుకి ప్రాణవాయువు సరఫరాకు అంతరాయం కలుగుతుంది. గర్భధారణ సమయంలో జబ్బు తీవ్రత పెరగడం, అధిక రక్తపోటు, తరచూ గర్భస్రావాలు, ప్రీ–ఎక్లాంప్షియా (గర్భవతిగా ఉన్న సమయంలో రక్తపోటు పెరగడం, మూత్రంలో ప్రోటీన్లు వృథాగా పోవడం), మూర్చ (ఫిట్స్‌), నెలలు నిండకుండానే ప్రసవం కావడం (ప్రీమెచ్యుర్‌ డెలివరీ) లాంటి ప్రసూతి సమస్యలు సంభవించే అవకాశాలు ఎక్కువ. అలాగే బిడ్డ తక్కువ బరువుతో పుట్టడం, గర్భాశయంలోనే మరణించడం, నియోనేటల్‌ లూపస్‌ వంటి సమస్యతో పుట్టుకతోనే బిడ్డ వ్యాధిని కలిగి ఉండటం వంటి సమస్యలూ ఏర్పడే అవకాశాలు ఎక్కువ. 

ఈ రోగుల్లోని 20 నుంచి 40 శాతం గర్భిణుల్లో ప్రెగ్నెన్సీ సమయంలోనూ, కాన్పు తర్వాతా జబ్బు తీవ్రత పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇందుకు  చాలావరకు అవకాశాలు తక్కువ అనే చెనప్పాలి. కొన్నిసార్లు జబ్బు లక్షణాలు సాధారణ గర్భిణుల్లో కనిపించే లక్షణాలనూ అనుకరిస్తాయి. ఈ రెండింటి మధ్య తేడాను జాగ్రత్తగా అర్థం చేసుకోవడం ద్వారా రుమటాలజిస్టులు మందుల మోతాదులను అవసరం మేరకు మారుస్తారు. దీనివల్ల పిండం మీద ప్రతికూల ప్రభావాలు సాధ్యమైనంతవరకు పడకుండా రుమటాలజిస్టులు జాగ్రత్తపడతారు. అలాగే ప్రసవం తర్వాత బిడ్డకు తల్లిపాలు ఇచ్చినంతకాలం కూడా మందుల విషయంలో రుమటాలజిస్టులు చాలా జాగ్రత్తగా ఉంటారు
.
 పుట్టిన శిశువుపైన కూడా లూపస్‌ ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఇలా పుట్టిన బిడ్డకు వచ్చే సమస్యను ‘నియోనేటల్‌ లూపస్‌ అంటారు. తల్లి ద్వారా పిండంలోకి వెళ్లే యాంటీబాడీస్‌ వల్ల తాత్కాలికంగా ఈ సమస్య ఎదురవుతుంది. చర్మం మీద ఎర్రని మచ్చలు రావడం అన్నది అతి సాధారణంగా కనిపించే లక్షణం. కామెర్లు, రక్తహీనత, రక్తకణాలు తగ్గడం లాంటివి కూడా సంభవించే అవకాశాలుంటాయి. గుండె, కాలేయం మీద కూడా దుష్ప్రభావాలు ఎక్కువగానే ఉంటాయి. కానీ ఇవి చాలా అరుదుగా కలిగే సమస్యలు. రుమటాలజిస్టులు, ప్రసూతి వైద్యనిపుణల మేరకు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల విజయవంతమైన ఫలితాలు లభిస్తాయి.

ఎస్‌ఎల్‌ఈ జబ్బు నిర్ధారణ అయ్యాక, ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌ చేసుకోదలచుకుంటే రుమటాలజిస్టులతో తప్పక చర్చించాలి. ఈ విషయంలో సరైన ప్లానింగ్‌ అన్నది అత్యంత ముఖ్యమైన మొదటి అడుగు. జబ్బుతీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు లేదా కీలకమైన అవయవాల మీద జబ్బు దుష్ప్రభావాలు ఉన్నప్పుడు గర్భందాల్చే ప్రయత్నాలు చేయకూడదు. జబ్బు తీవ్రతను పూర్తిగా నియంత్రించిన ఆర్నెల్ల తర్వాతే ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేసుకోవడం వల్ల చాలా సమస్యలను నివారించవచ్చు. తరచూ రక్తపరీక్ష, మూత్రపరీక్ష, రక్తపోటు తనిఖీ చేసుకోవడం వంటి పరీక్షలను నిర్వహించుకుంటూ ఉండాలి. అలాగే శిశువు గుండె మీద ప్రభావం ఉందా, లేదా అన్న విషయాలను ఇప్పుడు కొన్ని ఆధునిక పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు.

ఆధునిక వైద్య చికిత్సా విధానాలు అందుబాటులో ఉండే ఆసుపత్రుల్లో కాన్పు చేయించుకోవడం తప్పనిసరి. దీనివల్ల శిశువు ఏ రకమైన ఇబ్బందితో పుట్టినా సులభంగా వైద్యం అందించడం తేలికవుతుంది, సాధ్యమవుతుంది. లూపస్‌ రోగులకు గర్భధారణ అన్నది ఒక సవాల్‌ మాత్రమే. అంతేతప్ప అది అసాధ్యం కానేకాదు. రుమటాలజిస్టుల సలహా మేరకు, సరైన ప్లానింగ్‌ చేసుకొని, వ్యాధి మీద అవగాహన పెంచుకోవడంతో పాటు ఇప్పుడు అందుబాటులో ఉన్న సాంకేతికత సహాయంతో అందివచ్చిన మెరుగైన ఆధునిక వైద్యం తీసుకుంటే మంచి ఫలితాలు లభించే అవకాశాలే చాలా ఎక్కువగా ఉంటాయి.

డాక్టర్‌ విజయ ప్రసన్న పరిమి
సీనియర్‌ కన్సల్టెంట్‌ రుమటాలజిస్ట్, సిటీ న్యూరో సెంటర్, 
రోడ్‌ నెం. 12, బంజారాహిల్స్, హైదరాబాద్‌. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top