నన్నడగొద్దు ప్లీజ్‌

Love doctor Priyadarshini Ram - Sakshi

హాయ్‌ సార్‌..! నేను రెండు సంవత్సరాలుగా హైదరాబాద్‌లో చదువుకుంటున్నాను. అమ్మాయిలతో మాట్లాడాలంటే నాకు చాలా భయం. నా రూమ్‌ పక్కన ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి అప్పుడుప్పుడు నాతో మాట్లాడుతూ ఉండేది. ఆ అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు నాకు లోపల భయంగా ఉండేది. ఆ తర్వాత ఆ అమ్మాయి వాళ్ల ఇంటి ముందు కూర్చొని రోజూ నన్ను చూస్తూ ఉండేది. నేను కూడా చూసేవాడిని. నేను నాకు తెలీకుండానే తన ప్రేమలో పడిపోయాను. తను ఏదో ఒక వంకతో నాతో మాట్లాడుతుండేది. నేను ఎప్పుడైనా ఫోన్‌ ఎక్కువ సేపు మాట్లాడితే ‘ఎవరితో?’ అంటూ కోపంగా అడిగేది. మా ఇద్దరి ప్రేమ గురించి వాళ్ల అక్కకి కూడా తెలుసు. వాళ్ల అక్కే తను నన్ను లవ్‌ చేస్తుందని చెప్పింది. ఫస్ట్‌ నేను ప్రపోజ్‌ చెయ్యాలని వెయిట్‌ చేస్తోందట. ఈ లోపు నేను వేసవి సెలవులకి ఇంటికి వెళ్లి తిరిగి హైదరాబాద్‌ వచ్చాను. ఏమైందో ఏమో తెలీదు కానీ తను నన్ను చూడడం లేదు. నాతో మాట్లాడటంలేదు. నేను తనతో మాట్లాడకుండా, చూడకుండా ఉండలేకపోతున్నాను. జీవితం నరకంగా ఉంది. నా జీవితంలో తనను తప్ప మరొకరిని ఊహించుకోలేను. నేను తనకు ప్రపోజ్‌ చేద్దామనుకుంటున్నాను. ఇప్పుడు నన్ను ఏం చెయ్యమంటారు సార్‌??? – చరణ్‌

పడవ వెళ్లిపోయాక చెయ్యగలిగింది ఏముంది చరణ్‌..? ‘స్విమ్మింగ్‌ చెయ్యొచ్చు కదా సార్‌?’ మరి చరణ్‌కి లవ్‌ స్విమ్మింగ్‌ వచ్చో!? రాదో!? ‘వస్తే లవ్‌ సముద్రాన్ని దాటి ప్రియురాలికి లవ్‌ మ్యాటర్‌ చెబుతాడు. స్విమ్మింగ్‌ రాకపోతే...’ మునుగుతాడు కదా నీలూ!! ‘సార్‌.. మీరెప్పుడూ అబ్బాయిల లవ్‌ గురించి నెగెటివ్‌గానే ఆలోచిస్తారు.

స్మిమ్మింగ్‌ రాకపోతే నేర్చుకుంటాడు సార్‌!’ అంతలోపు అమ్మాయి ఇంకెవరికైనా కమిట్‌ అయిపోతే...? ‘ఏంటి సార్‌? ప్రపంచంలో ఆ ఒక్క అమ్మాయేనా సార్‌..? ఒక్కసారి స్విమ్మింగ్‌ వచ్చాక.. కాన్ఫిడెన్స్‌ వస్తుంది. అప్పుడు ఏ అమ్మాయికైనా లవ్‌ ప్రపోజ్‌ చేసే దమ్ము ఉంటుంది సార్‌!’ ఈ తెలివి ముందే ఏడ్చి ఉంటే చరణ్‌కి ఇంత ప్రాబ్లమ్‌ ఉండేది కాదు.

అయినా ఇప్పటికి పోయింది ఏం లేదు.. లవ్‌ అనే సముద్రాన్ని జయించాలంటే... ముందు భయాన్ని జయించాలి. అమ్మాయికి డీసెంట్‌గా ప్రపోజ్‌ చేసి తాడో పేడో తేల్చుకుంటే... లవ్‌ ఎలా ఉన్నా లైఫ్‌ బాగుంటుంది.

- ప్రియదర్శిని రామ్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top