రామాలయంలో శివారాధన

Lord Shiva is very rare in the temple of Vaishnava - Sakshi

రామతీర్థం / శివరాత్రి స్పెషల్‌

వైష్ణవ దేవాలయంలో శివారాధన అత్యంత అరుదు. అలాంటి అద్భుతం  ఏటా  ‘రామతీర్ధం’ ఆలయంలో ఆవిష్కృతమవుతుంది! ఉత్తరాంధ్రలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని రామతీర్థం గ్రామంలో కొలువైన రామాలయంలో ఏటా శివరాత్రి జాతర అంగరంగ వైభవంగా జరగడం విశేషం. శివరాత్రికి రెండు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల నుంచే కాకుండా ఒడిశా రాష్ట్రం నుంచి వేలాదిగా భక్తులు ఈ క్షేత్రానికి తరలివస్తుంటారు. రామతీర్థం ఉత్తర రాజగోపురానికి ఎదురుగా నిలువుటద్దంలా కనిపించే బోడికొండ దశాబ్దాల అద్భుతంగా అలరారుతోంది. మరో వైపు బౌద్ధులు నడయాడిన గురుభక్తుల కొండ.. ఎదురుగా పచ్చని నీటితో కనిపించే రామకోనేరు.. ఇలా ఆ ప్రాంతమంతా అత్యంత సుందర నిలయమై భక్తులకు, పర్యాటకులకు కనువిందు చేస్తుంటాయి.

రామతీర్థ మహత్మ్యం
ద్వాపర యుగంలో పాండవులు అరణ్యవాసానికి వెళుతూ శ్రీకృష్ణపరమాత్మను కూడా తోడు రమ్మని అడిగారు. అందుకు  కృష్ణ పరమాత్మ వారితో.. తాను రామావతార సమయంలో దండకారణ్య ప్రాంతంలో సీతాలక్ష్మణ సమేతుడనై సంచరించానని, కనుక ఆనాటి రామావతారాన్ని  భక్తి శ్రద్ధలతో  పూజిస్తే వనవాస కాలంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని పాండవులకు చెప్పారు. చెప్పడమేగాక సీతారామలక్ష్మణ స్వామి విగ్రహాలను సృష్టించి పాండవులకు అందించారు. శ్రీకృష్ణుడు ఉపదేశించిన విధంగా పాండవులు రామతీర్ధం ప్రాంతంలో రాముడి దేవాలయాన్ని నిర్మించి స్వామివారిని సేవించి వనవాసాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేశారు.

తర్వాత పాండవులు అజ్ఞాత వాసానికి వెళ్తూ వెళ్తూ నిర్మించిన దేవాలయాన్ని పరమ నిష్టాగరిష్టుడైన వేదగర్భుడు అనే వైష్ణవుడికి అప్పగించి వెళ్లిపోయారు. ఆ వేదగర్భుడు, వారి పుత్ర పౌత్రాదులు స్వామివారిని సేవిస్తూ ఉండేవారు. కొంతకాలం తరువాత క్రీ.పూ 6వ శతాబ్ధంలో బౌద్ధ భిక్షువులు ఆ ప్రాంతాన్నే కేంద్రంగా చేసుకొని వారి మత ప్రచారాన్ని చేసుకుంటూ కాల క్రమేపి రామతీర్థం ప్రాంతాన్ని ఆక్రమించారు. వాళ్ల మత సిద్ధాంతాలకు భయపడిన వేదగర్భుని వంశీయులు సీతారామలక్ష్మణ విగ్రహాలను భూగర్భంలో దాచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్లి పోయారు.

నీటి మడుగులో విగ్రహాలు
విజయనగరం పూసపాటి వంశీయులు 1650వ సంవత్సరంలో కుంభిళాపురం (నేడు కుమిలి గ్రామం)ను రాజధానిగా చేసుకొని పాలిస్తుండేవారు. ఆ గ్రామానికి చెందిన ఏకుల వంశానికి చెందిన ఓ ముసలావిడ కట్టెల కోసం వెళ్లి అరణ్యంలో చిక్కుకుంది. ఆమె నిస్సహాయ స్థితిని చూసి స్వామివారు ప్రకాశవంతమైన తేజస్సుతో దర్శనమిచ్చి కాపాడారు. మేము ఇక్కడ కొలువై ఉన్నామని మాకు దేవాలయం నిర్మించమని రాజుతో చెప్పమని సాక్షాత్తూ స్వామివారే ఆమెకు చెప్పారట. మరుసటి రోజు తెల్లవారు జామున రాజు కలలో కూడా సాక్షాత్కరించి ముదుసలి చెప్పినట్లు చేయమని ఆజ్ఞాపించారు. ఉదయం ముదుసలి చెప్పినట్లుగా పుణ్యస్థలానికి చేరుకొని వెతికితే నీటిమడుగులో సీతారామ లక్ష్మణుల ప్రతిమలు కనిపించాయి. దేవాలయ నిర్మాణానికి ఆ రాజు 1200 ఎకరాల పంట భూమిని రాసిచ్చి భీష్మ ఏకాదశి రోజున స్వామివారి విగ్రహాలను ప్రతిష్టించారు. అప్పటి నుంచి నేటికీ శ్రీరామ చంద్రమూర్తి భక్తుల నుంచి విశేష పూజలందుకుంటున్నారు.

విశిష్టతల సమాహారం
రామతీర్థ క్షేత్రానికి ఉత్తర దిక్కున నీలాచలం పేరుతో రెండు కిలోమీటర్ల పొడవు గల ఏకశిలా పర్వతం బోడికొండగా వ్యవహారంలో ఉంది. ఈ పర్వతంపై సీతారాములు, పాండవులు సంచరించినట్లుగా చిహ్నాలున్నాయి. అలాగే పర్వత శిఖరాన కోదండరాముని ఆలయం కూడా ఉంది. ఆలయం పక్కనే ఎప్పటికీ ఎండిపోని పాతాళగంగ అనే పేరు గల నీటికొలను ఉంది. ఈ నీటి మడుగు నుంచి పడమర దిశగా ఇరుకురాయి, దాని మధ్య నుంచి వెళితే భీముని బుర్ర చిహ్నం ఉంటుంది. అక్కడే భీముడు వంట చేయడానికి ఉపయోగించిన గాడిపొయ్యి కూడా ఉంది. దీనికి సమీపంలో ఉన్న గుహలో బుద్ధ విగ్రహం, పలుకురాయి ఉన్నాయి.

ఇక్కడ నుంచి ఒకసారి పిలిస్తే ఆ పిలుపు మూడు సార్లు ప్రతిధ్వనిస్తుంది. అలాగే పాండవుల ఐదు పంచలు, సీతమ్మవారి పురిటి మంచం తదితర చిహ్నాలు నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఈ కొండ పక్కనే దుర్గాభైరవ కొండ, బౌద్ధుల నివాస గుహలు ఉన్నాయి. చారిత్రక గుర్తులను చూసేందుకు భక్తులు, సందర్శకులు అధిక సంఖ్యలో పర్వతంపైకి వెళుతుంటారు. రామతీర్థం రామాలయంలో వైకుంఠనాథస్వామి, వేణుగోపాలస్వామి, లక్షీ్మదేవి, మాధవ స్వామి, భూభుజంగ వరహాలక్షీ్మ స్వామి, ఆళ్వారుల సన్నిధి, శ్రీరామక్రతువు స్తంభం, సదాశివస్వామి వార్ల ఉపాలయాలు ఉన్నాయి. నిర్విరామంగా ప్రతినిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి

శివరాత్రి జాగరణ
ఏటా శ్రీ స్వామివారి కల్యాణోత్సవములు, రథయాత్ర, మహాశివరాత్రి, శ్రీరామనవమి ఉత్సవాలు, జ్యేష్టాభిషేకాలు, విఖసన జయంతి, పవిత్రోత్సవాలు, శ్రీవారి బ్రహ్మోత్సవాలు, తెప్పోత్సవం, గోపురోత్సవం, అధ్యయనోత్సవాలు, వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతుంటాయి. అలాగే ప్రతి ఏటా ముక్కోటి ఏకాదశి పర్వదినాన అశేష జనావళి నడుమ గిరిప్రదక్షణం కూడా జరుగుతుంది. వైష్ణవాలయంలో శివరాత్రి ఉత్సవాలు జరపడమనేది ఇక్కడి ప్రత్యేకత. ఆ ఉత్సవాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు ముందురోజే క్షేత్రానికి చేరుకుని కోనేటిలో స్నానమాచరించి నిష్టాగరిష్టులై శివరాత్రి జాగరణ చేసి తరిస్తుంటారు.

బోణం గణేష్, సాక్షి ప్రతినిధి, విజయనగరం.
ఫొటోలు: డి.సత్యనారాయణ, 
పక్కి సురేష్‌ పట్నాయక్‌

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top