హవ్వ! అవ్వేది?

Krovvidi Laxmana Story Of Palleturi Kurradi Badi Minutely - Sakshi

కథాసారం

ఎనిమిది తొమ్మిదేళ్లు వచ్చేసరికి, పల్లెటూరి కుర్రాడు, పెద్దవాళ్లు చేసే పనుల్లో సగానికి పైగా సాయపడుతూ ఉంటాడు– కలుపు తియ్యడం, చేలకి నీరు పెట్టడం, కోసిన పంట కట్టలు కట్టడం, ఇల్లు కట్టుకున్నప్పుడు యిటికలూ తాటి కమ్మలూ అందివ్వడం యిలాంటివి.
 
వాడిమీద యింకే ఆశా పెట్టుకోకుండా, అలాంటి కుర్రవాణ్ని పగలంతా బడికి పంపించాలంటే ఏ తండ్రి ఒప్పుకుంటాడు? 
కాని యీ పెద్దవాళ్ల యిష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా, ప్రభుత్వం ఓ హుకుం ప్రకటించింది – ఆరేళ్లు పైబడ్డ కుర్రాడ్ని బడికి పంపకపోతే ఆ కుటుంబం పెద్దవాళ్లలో ఎవరో ఒకరు జైలుకి వెళ్లవలసి వస్తుందని. అదుగో ఆ కారణంగా మన పల్లెటూరి కుర్రాణ్ణి బడికి పంపించాల్సి వచ్చింది.

బడికి వెళ్లిన తొలినాడు వాడు యెనిమిది పుస్తకాలు పట్టుకుని యింటికి వచ్చేడు. వాడి తాతయ్యా, నాయనమ్మా, తండ్రీ, తల్లీ అంతా వాడి చుట్టూ మూగి, ఆ పుస్తకాల్లో బొమ్మలూ అవీ యెంతో ఆశ్చర్యంగా చూడ్డం మొదలెట్టేరు.
‘‘మన దేశం నాలుగు ప్రాచీన గ్రంథాల్లోనూ యిలాంటి బొమ్మల్లేవు’’ అన్నాడు తాతయ్య.

అంతవరకూ పరకాయించి చూస్తూన్న తండ్రి హఠాత్తుగా ఓ కేక పెట్టేడు– ‘‘ఆ బొమ్మల్లో ఉన్నవాళ్లు చైనావాళ్లు కాదు. జాగర్తగా చూడండి– ఒక్కడికయినా మనదేశం బట్టలున్నాయా? మన వీధి చివరి ముసలి ఫాదరీ గుర్తు వస్తున్నాడు’’
ఆలోగా కుర్రాడు, లోపల భయపడుతున్నా, ధైర్యం చిక్కబట్టుకొని గబుక్కున అనేశాడు. ‘‘ఈ పుస్తకాలు రూపాయిన్నరట’’.

ఆ మాట విని, పిడుగు పడ్డట్టు, అందరూ కొయ్యబారి పోయారు. కాస్సేపటికి తేరుకుని, నాయనమ్మ విసుక్కుంది. ‘‘పనికి వచ్చే కుర్రాణ్ని పట్టుకుపోవడమే కాకుండా, ఇంకా పుస్తకాలకి డబ్బు కావాలా? దిక్కుమాలిన చదువులూ వీళ్లూనూ! ఈ లెక్కని ఏడాదికి సగం రోజులు పస్తుండాలి’’.
‘‘కాకపోయినా, ఒక్కసారిగా అన్ని పుస్తకాలెందుకో. ఒక్కటి అయ్యాక మరొకటి మొదలుపెడితే బావుణ్ను’’ అన్నాడు తాతయ్య.

కుర్రాడి తల్లి తన చెవుల పోగులు అమ్మి డబ్బు యివ్వడానికి సిద్ధపడింది. తండ్రి కుర్రాడికి గట్టిగా బోధపర్చాడు. ‘‘నీకు తొమ్మిదేళ్లు వొచ్చేయి. మన యింటి సంగతులు తెలుసు కదా. ఇది మనవల్ల అయే పనికాదు. అయినా నిన్ను చదువులకి పంపుతున్నాం. నువ్వు బుద్ధిగా చదువుకుని జాగర్తగా పాఠాలు నేర్చుకోకపోతే, బతికి ఉన్నన్నాళ్లూ మేం యేడవ్వలసి వస్తుంది’’.

మర్నాడు యింకా తూర్పు తెల్లవారకముందే లేచి, పరిగెత్తుకుని బడికి వెళ్లేడు కుర్రాడు. తీరా అక్కడికి చేరుకునేసరికి స్కూలు బంట్రోతు తప్ప యింకెవ్వరూ కంటపళ్లేదు. ఆ బంట్రోతు చెప్పేడు. ‘‘తొమ్మిదింటికిగాని బడి తెరవరు. ఇప్పుడింకా ఆరయినా కాలేదు. మేస్టరుగారు యింకా నిద్ర లేవలేదు. ఇంటికి పోయి మళ్లీ రా.’’

చేసేది లేక యింటి మొహం పట్టేడు. వీడు యింటికి చేరుకునే వేళకి, పాలు తియ్యడానికి కాబోలు, తాత ముంత పట్టుకు వస్తున్నాడు. ‘‘ఇవాళకి రెండోరోజు. అప్పుడే క్లాసులు యెగ్గొట్టేస్తున్నాడు వెధవ.’’
కుర్రవాడు యీ కోపానికి బిక్క చచ్చి పోయేడు. తల్లి వొచ్చి ఆ చెంపా యీ చెంపా వాయించింది. ‘‘పెరట్లో తగలబడి పశువులకి కుడితి పెట్టు’’ అని అరిచింది.
కుర్రాడు చల్ది తిని స్కూలుకు వెళ్లేసరికి మేస్టరుగారు అప్పుడే కుర్చీలో కూచున్నారు. బడికి ఆలస్యంగా రాకూడదని పిల్లలకి ఉద్బోధన చేస్తున్నారు, అందరికన్నా ఎవరు ముందుగా వస్తే వాళ్లకి విద్యా దేవత ధనాలు రాసియిస్తుందని.

సాయంకాలం నాలుగున్నరకి తండ్రి పొలం పనికి వెళ్లబోతూ ఉంటే, యింటికి వస్తూన్న కుర్రాడు కంటపడ్డాడు. అదృష్టవశాత్తూ తతిమ్మా కుర్రాళ్లు కూడా రావడమూ, మేస్టరుగారు విలాసంగా బెత్తం ఊపుకుంటూ షికారు వెళ్లడమూ కూడా కంటబడి, తన కొడుకు క్లాసులు యెగ్గొట్టలేదని స్థిమిత పడ్డాడు.
మొదటి వారం రోజులూ మొట్టమొదటి పాఠంతోనే గడిచేయి. ఆ పాఠం ‘ఇది అమ్మ’,

కుర్రాడు చదువులో అశ్రద్ధగా ఉన్నాడనడానికి యెంత మాత్రం వీల్లేదు. స్కూలు నుంచి వచ్చింది మొదలు చీకటి పడేదాకా ‘ఇది అమ్మ, ఇది అమ్మ’ అని అలా చదువుతూనే ఉండేవాడు. ఎడం చేత్తో పుస్తకం పట్టుకుని, కుడి చేతి చూపుడు వేలుతో ఒక్కొక్క అక్షరమే చూపించుకుంటూ, వేలు తీసేస్తే అక్షరాలు ఎక్కడ యెగిరిపోతాయో అన్నట్టు అతి శ్రద్ధగా చదివేవాడు.

కాని వాడు ‘ఇది అమ్మ’ అని చదివినప్పుడల్లా వాడి తల్లి కంగారు పడిపోయేది. అయిదు రోజులు అలా ఓపిగ్గా వింది. ఆరోనాడు ‘ఏదీ మీ అమ్మ, చూడనీ’ అంటూ కొడుకు చేతులోంచి పుస్తకం లాక్కుంది. తల్లి కుతూహలంతోనే అడుగుతోందనుకుని, కుర్రాడు పుస్తకంలో బొమ్మ చూపించి, ‘‘తోలు జోళ్లూ, కత్తిరింపు జుట్టూ, గౌనూ తొడుక్కున్నది. ఇది అమ్మ’’ అని అందులో వాక్యం చదివేడు.
తల్లి దయ్యం పట్టినదానిలా గుండెలు బాదుకుంటూ గోలుమని యేడ్చింది. ఆ గోలకి తండ్రీ, తాతా, నాయనమ్మా పరిగెత్తుకుంటూ వచ్చారు. ‘‘నేనిక్కడ ఉండగానే, వీడికి దయ్యం అమ్మ ఎక్కడ్నుంచి వచ్చింది?’’

తండ్రి కాస్త నిదానించి, అన్నాడు: ‘‘వీడిని ఆ మేష్టార్నే అడగమందాం. అదెవరి అమ్మో– బహుశా మేష్టారు గారి అమ్మో యేమిటో.’’
ఆ రాత్రి తల్లి నిద్ర పోలేదు. మర్నాడు పొద్దున్నే కొడుకుని లేపి, బడికి వెళ్లినప్పుడు, అ అమ్మ యెవరో మరిచిపోకుండా కనుక్కురమ్మని హెచ్చరించింది.
కుర్రాడు బుద్ధిగా బడికి వెళ్లేసరికి అక్కడ యెవ్వరూ లేరు. ఆ వేళ ఆదివారం– బడికి సెలవు!

‘‘అమావాస్యకీ పున్నానికీ అంటే బావుంది కాని, ఆదివారాలు సెలవులెందుకో’’ విసుక్కుంది తల్లి.
సోమవారం క్లాసులో మనవాడు లేచి నుంచున్నాడు. ‘‘ఇది అమ్మ అని వుంది కదా– ఆమె అసలు యెవరమ్మ అండి?’’
టీచరు శాంతంగా బోధపరిచాడు– ‘‘ఎవరి అమ్మ యేమిటి నాయనా? పుస్తకం ఎవరు చదివితే వాళ్ల అమ్మ అన్నమాట. బోధపడిందా?’’

కుర్రాడు తల అడ్డంగా ఊపేడు. 
‘‘ఇందులో బోధపడక  పోడానికేముందిరా?’’
‘‘మరీ, మరీ– బాల్డీ కూడా యిది చదువుకున్నాడు కదా. వాళ్లమ్మ యిలా ఉండదే మరి?’’

అంతలో, హ్సియోలిన్‌ లేచి ‘‘బాల్డీ అమ్మకి ఓ చెయ్యి సొట్టా, ఓ కన్ను గుడ్డిన్నీ’’ అన్నాడు.
బాల్డీకి ఉడుకుమోత్తనం వచ్చింది. ‘‘నీకు అమ్మే లేదుగా.’’

మేస్టరు గారు బెత్తంతో టేబిలు మీద కొట్టి –  ‘‘ఇప్పుడు రెండో పాఠం మొదలెడుతున్నాం. ‘ఇది నాన్న’. అందరూ చూడండి’’ అన్నాడు.
కుర్రాడి తల్లికి ఆ అమ్మ ఎవరా అన్న సందేహం తీరనే లేదు. ‘ఇది నాన్న’ అంటూ వల్లెవెయ్యడం చెవిని పడింది. అది కాస్తా భర్త చెవిని కూడా పడిందంటే, ‘‘నీ కొడుక్కి రెండో తండ్రి యెక్కణ్నుంచి వచ్చేడే’’ అని విరుచుకు పడతాడని భయం వేసి నోరు నొక్కేసుకుంది.

పార్కు, పిక్నిక్కు, డాన్సు యిలాంటివి యెన్నో తను యెన్నడూ కనీ వినీ యెరుగనివి పుస్తకంలో చదివి అవి ఏమిటా అని ఆశ్చర్యపోతూ ఉండేవాడు కుర్రాడు. తరువాత పుస్తకంలో ‘టీ పార్టీ’ అన్న పాఠం చదివి, టీ పార్టీ చేసుకుందాం అని నలుగురు పిల్లలు అనుకున్నారు. కానీ అడిగితే ఇంట్లో డబ్బులిస్తారా? దస్తా కాగితాలు కావాలంటేనే నాయనమ్మ ఈ చదువులతో యిల్లు గుల్లయిపోతోందని కోప్పడేది. దగ్గుతున్న తాతయ్య కోసం అని చెప్పి ఏపిల్‌ పళ్లు తింటే బలం వస్తుందన్న సంగతిని పుస్తకంలో చూపించి అమ్మను డబ్బు అడిగాడు కుర్రాడు. తీరా విషయం బయటపడి తండ్రి రుద్రావతారం దాల్చాడు. బడి మానిపించేస్తే సరి అనుకున్నారు.

పైగా నాయనమ్మకు, తన కొడుకు తన నుంచి దూరం అవుతున్నాడేమో అని భయం పట్టుకుంది. కోడలు రాకముందు ఉన్న స్థానం మాయం అయిపోతున్నట్టనిపించింది. ఈ భయానికి తోడు, కుర్రవాడు కొత్త పాఠం చదువుతూ ఉండగా వింది. ‘‘మా కుటుంబంలో నాకు తల్లీ తండ్రీ ఓ తమ్ముడూ చెల్లెలూ ఉన్నారు’’. దాంతో ముసలావిడ భయం రూఢి అయిపోయింది. ఎంతసేపు తల్లీ తండ్రీ అంటాడేగానీ, తాతయ్యా నాయనమ్మా అనడే గుంట వెధవ? 

‘‘ఆహా! ఈ ఇల్లు నీది. నీకు తల్లీ తండ్రీ వున్నారు. నాయనమ్మ చచ్చిపోయింది. ఈ యింట్లో యింక నాకు చోటెక్కడుంది?’’ అని అరుస్తూ పులుసు గిన్నె కాస్తా దభాల్న పడేసిందామె.
తండ్రి ప్రాణం చివుక్కుమంది. ‘‘కోపం తెచ్చుకోకమ్మా. ఇక ఇలాంటి పుస్తకాలు వీడ్ని చదవనివ్వను. అంతగా యిదయితే నేను జైలుకి వెళ్తాను, మరేం ఫరవాలేదు’’.
ఆ మర్నాడు తండ్రి, ఓ పాలికాపుని మానిపించేసేడు. మేష్టారు కుర్రాడికి ‘ఆబ్సెంటు’ మార్కు చేసేరు!

‘లావో షి’ కలంపేరుతో రాసిన షు కింగ్‌చున్‌ (1899–1966) ఇరవయ్యో శతాబ్దపు చైనా సాహిత్యంలో చెప్పుకోవాల్సిన రచయిత. ‘రిక్షా బాయ్‌’ ఆయన ప్రసిద్ధ నవల. పైది, ఆయన కథ ‘పల్లె కుర్రాడి బడి చదువు’ సంక్షిప్త రూపం. తగిన పాఠ్యగ్రంథాలు లేక, ‘విద్యా వ్యాప్తికి పూనుకున్న అనేక దేశాలకి, ఇంగ్లీషులోనూ యితర విదేశీయ భాషల్లోనూ ఉన్న పాఠ్యగ్రంథాలని తమ భాషలోకి అనువదించి ఉపయోగించుకోవడం తప్ప వేరే గత్యంతరం’ లేని పరిస్థితిని ఈ కథ హాస్యంగా చర్చించింది. 1930 ప్రాంతంలో రాసిన దీన్ని క్రొవ్విడి లక్ష్మన్న తెలుగులోకి అనువదించగా, ప్రగతి వారపత్రిక లో 1974లో అచ్చయింది. 

సౌజన్యం: kathaaprapancham.in

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top