మై మదర్‌ టి.కృష్ణకుమారి

Krishnakumari Adopted An Orphan Girl - Sakshi

సినీ పరివారం

చక్కటి ఒడ్డూ పొడుగు, పెద్ద పెద్ద కళ్లు, పొందికైన శరీరంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గ్లామర్‌ క్వీన్‌గా మెరిశారామె. జానపదాలలో ఎక్కువ నటించారు. వాటిలో కత్తుల కాంతారావుతో కలసికట్టుగా చేసినవే అధికం. ఒక కంట కన్నీటిని, మరోకంట పన్నీటిని  కూడా అలవోకగా అభినయించిన ఆ అభినేత్రి కృష్ణకుమారి. కెరీర్‌లో బాగా బిజీగా ఉన్న కృష్ణకుమారి, ఒక అనాథ బాలికను దత్తత తీసుకున్నారు. ఆమెను సినిమాలకు దూరంగా అల్లారు ముద్దుగా పెంచారు. ‘తనను కన్న తల్లి కంటె గారంగా పెంచారు’ అని తల్లి గురించి సాక్షికి వివరించారు దీపిక. ఆమె తెలిపిన వివరాలే ఈ వారం మన సినీ పరివారం.

అమ్మీకి దత్తుకుమార్తె అని ఇప్పుడు అంటున్నారు కానీ నాకసలు 19 సంవత్సరాల వయసు వచ్చేవరకు ఆమె నన్ను దత్తు తీసుకుందనే విషయమే తెలియదు. విషయం తెలిశాక నాకు అమ్మ మీద గౌరవం పెరిగింది. మా పెద్దమ్మ షావుకారు జానకి. ఆవిడ తన పిల్లలతో సమానంగా చూస్తుంది నన్ను కూడా. ఇంకా చెప్పాలంటే, నాతో మరింత ఎక్కువ ప్రేమగా ఉంటుంది. అమ్మ కెరీర్‌ సుదీర్ఘ కాలం నడిచింది. అందువల్ల వివాహం కూడా ఆలస్యంగా అయ్యింది. 1978లో నేను మూడు నెలల పసిపిల్లగా ఉన్నప్పుడు, వన్‌శంకరిలో ఉన్న అనాథాశ్రమం నుంచి నన్ను దత్తత తీసుకుంది అమ్మ. నేను అమ్మను అమ్మీ అని పిలిచేదాన్ని. నేను మదనపల్లిలో జిడ్డు కృష్ణమూర్తి స్కూల్‌లో పదో తరగతి వరకు చదువుకున్నాను. స్కూల్‌ నుంచి ఇంటికి వచ్చాక అమ్మమ్మ వాళ్లతో పచ్చీస్, చింతగింజలు, క్యారమ్‌ బోర్డులాంటివి ఆడేదాన్ని. అమరచిత్ర కథలు, పిల్లల మహాభారతం చదివించేది. నా హిందీ టెక్ట్స్‌ చదివి, అమ్మీ  హిందీ నేర్చుకుంది. అమ్మీకి గార్డెనింగ్‌ అంటే చాలా ఇష్టం.

అమ్మతో గడిపిన రోజులు నేను మరచిపోలేను
అమ్మీ షూటింగ్‌ నుంచి ఇంటికి వచ్చాక ఆ రోజు జరిగిన షూటింగ్‌ వివరాలతోపాటు, నటీనటులంతా ఒకే కుటుంబంలా ఎంత సరదాగా ఉండేవారో చెప్పేది. చిన్నతనంలో అమ్మీ నాకు అన్నం తినిపిస్తూ, తను నటించిన సినిమాలు చూపించేది. నాకు మైథాలజీ, మాయలు మంత్రాల చిత్రాలంటే చాలా ఇష్టం. నేను ఒక సెలబ్రిటీలాగే ఎదిగాను. ఇంట్లో మాత్రం మామూలుగానే ఉండేవాళ్లం. కుటుంబం కోసం అమ్మీ చదువు ఆపేయవలసి వచ్చింది. అందుకు అమ్మీ అప్పుడప్పుడు బాధపడుతుండేది. నాకు స్నేహితులు చాలామంది ఉన్నారు. వాళ్లని ఇంటికి తీసుకువస్తే  అమ్మీనే స్వయంగా వండి పెట్టేది. అమ్మీ వంటలు చాలా బాగా చేసేది. ఇడ్లీలు చేయడంలో ఎక్స్‌పర్ట్‌. వంట అమ్మీనే స్వయంగా చేసేది. నాన్నకి అమ్మీ అంటే చాలా ఇష్టం. అమ్మ సినిమాలు కాదు, అమ్మీ చేతి వంట అంటే ప్రీతి. అమ్మ ప్రతి వంటకం తయారీ గురించీ ఒక పుస్తకంలో రాసి పెట్టుకుంది. ఆ పుస్తకం ఇప్పటికీ నా దగ్గర ఉంది. మాది పెద్ద ఫామ్‌ హౌస్‌. అన్ని కూరలు అమ్మీ స్వయంగా పండించేది. ఒక్క కూర కూడా బయట నుంచి కొనలేదు మేం.

మా అబ్బాయంటే ప్రాణం
నా పెళ్లి అమ్మ వాళ్లే చేయాలనుకుని, చాలా సంబంధాలే తెచ్చారు, నేను రిజెక్ట్‌ చేశాను. చాలామంది నిర్మాతలు కూడా నన్ను కోడలు చేసుకోవాలని అమ్మని అడిగారట. అందరూ మా డబ్బుకోసం చూసినవారు కావడంతో అమ్మ నిరాకరించింది. నా స్నేహితులే విక్రమ్‌ అనే అబ్బాయిని ఎంపిక చేసి, 2003లో నా వివాహం జరిపించారు. మా వివాహాన్ని అమ్మ వాళ్లు మొదట్లో అంగీకరించలేకపోయారు. కొంత కాలం తరవాత అంగీకరించారు.  2006లో నాకు బాబు పుట్టాడు. పవన్‌ మయ్యా అని పేరు పెట్టుకున్నాం. వాడు పుట్టినప్పుడు ‘ఆపిల్‌ ఆఫ్‌ ద ఐ’ డిజైన్‌లో మాకు ఇల్లు కట్టించారు అమ్మీవాళ్లు. మా అబ్బాయిని చాలా ప్రేమగా చూసేది. అమ్మీ చాలా లవింగ్‌ అండ్‌ ఓపెన్‌ హార్టెడ్‌ పర్సన్‌. ఇంటికి ఎవరు వచ్చినా మర్యాదగా చూసేది. షాపింగ్‌ బాగా చేసేది. ఒకే ఒక్క హిందీ సినిమాలో నటించింది. నాన్న వద్దనడంతో మానుకుంది.

అమ్మ 20 సంవత్సరాల పాటు నాన్నతో లివ్‌ ఇన్‌ టుగెదర్‌గా ఉంది. నాన్నగారు అజయ్‌ మోహన్‌ ఖైతాన్‌ చాలా బాగా చదువుకున్నారు. పెళ్లి అయిపోయిందని తెలిస్తే సినిమా అవకాశాలు రావని ఉద్దేశంతో అమ్మ ఆ విషయాన్ని రహస్యంగా ఉంచింది. పిల్లలు లేని ఇంటికి నేను ఇంటికి దీపంలా వచ్చాననే ఉద్దేశంతో నాకు దీపిక అని పేరు పెట్టారు. నా 21వ ఏట, డ్రీమ్‌ డ్రీమ్‌ పేరున ఒక ఎన్‌జీవో ప్రారంభించాను. ఎయిడ్స్‌తో బాధపడుతున్న వారి పిల్లలకి, క్యాన్సర్‌ బాధితుల పిల్లలకి వృత్తివిద్యలలో శిక్షణ ఇప్పిస్తున్నాం. అది నేటికీ విజయవంతంగా నడుస్తోంది. ప్రస్తుతం అందులో నేను యాక్టివ్‌గా ఉండట్లేదు.

మయ్యా పబ్లిషింగ్‌ హౌస్‌ ప్రారంభించి, అన్ని రకాల పుస్తకాలను ఆన్‌లైన్‌లో పెడుతున్నాం. నాకు కుక్కలంటే ప్రాణం. ప్రాణిక్‌ హీలింగ్‌ నమ్ముతాను. గతంలో మోటరోలా, జీ కంపెనీలలో పనిచేశాను. సొంతగా ఇంటీరియర్‌ కంపెనీ కొంతకాలం నడిపాను. నాన్నగారు గ్లకోమాతో బ్లైండ్‌ అయ్యారు. అప్పుడు నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. 2012లో నాన్న పోయాక చాలా ఇబ్బందులు పడ్డాం. అమ్మ 2018లో మరణించారు. ‘మై మదర్‌ టి. కృష్ణకుమారి’ అని అమ్మ మీద ఇంగ్లీషులో బయోగ్రఫీ రాశాను. ప్రస్తుతం కుటుంబం, గార్డెనింగ్, ప్రాణిక్‌ హీలింగ్‌ పనుల్లో బిజీగా ఉన్నాను. మా వారు మధ్వులు. ఉడిపి నుంచి వచ్చారు. లాల్‌ బాగ్‌ హోటల్‌తో పాటు సుమారు 15 రెస్టారెంట్లు ఉన్నాయి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top