గగన మేఘన

Introduction of Meghana Sanbagh - Sakshi

మేఘన ఆలోచనలు భూమ్మీద లేవెప్పుడూ! ఇప్పుడైతే పూర్తిగా గగనంలోనే ఆమె డ్యూటీ. పట్టుపట్టి ఫైటర్‌ జెట్‌ పైలెట్‌ అయిన మేఘన.. కొత్త జనరేషన్‌కి.. ఓ కొత్త ఇన్‌స్పిరేషన్‌!

అమ్మా నాన్న తమ్ముడు... ఓ కన్నడ అమ్మాయి. ‘అందంగా అల్లుకున్న హరివిల్లు మాది’ అని పాడుకోదగినంత చక్కని కుటుంబం. ‘నాన్నా! ఇంత చిన్న స్కూల్లో కాదు పెద్ద స్కూల్లో చదువుకుంటాను’ అన్నది మేఘన నాలుగో తరగతిలో. అంత పెద్ద స్కూలు మనూర్లో లేదంటే ‘పెద్ద స్కూలుకి హాస్టల్‌ కూడా ఉంటుంది కదా నాన్నా’.. ఇదీ పదేళ్ల వయసులో మేఘన అన్న మాట. తన కూతురు మామూలు అమ్మాయిగా మిగలదు, అడ్వెంచరస్‌ పర్సనాలిటీ అవుతుందని తండ్రికి ఎక్కడో ఓ నమ్మకం. కూతురి మీద తండ్రి పెంచుకున్న ఆ నమ్మకమే... కన్నడ రాష్ట్రానికి ఓ రికార్డును సాధించి పెట్టింది, ఉత్తర భారతం ముందు తలెత్తుకోవడానికి దక్షిణ భారతానికి ఓ భరోసానిచ్చింది.

మేఘనా శాన్‌బాగ్‌ ఆలోచనలు ఎప్పుడూ వినువీధిలోనే విహరిస్తూ, మేఘాలను తాకుతుండేవి. చదువుకే పరిమితమయ్యేది కాదు. ఆటపాటల్లో కూడా చురుగ్గా ఉండేది. ఒక విషయం చర్చకు వస్తే తన వాదనతో ఎదుటి వారిని సమాధాన పరిచి తాను అనుకున్నట్లే చేసేది. అమ్మానాన్నలిద్దరూ చట్టాన్ని ఔపోశన పట్టారు, వాళ్ల కూతురు వారితో గెలవడంలో మెళకువలు నేర్చుకుంది. తండ్రి న్యాయవాది, తల్లి జడ్జి. ఇంటి కోర్టులో తన వాదనను తానే వినిపించుకుంది మేఘన, ‘‘చిన్నపిల్ల ఏదో చెబుతుంటే అన్నింటికీ ఒప్పుకోవడమేనా’’ అంటూ తల్లి డిఫెన్స్‌ వాదనను లేవనెత్తింది.

ఈ ఫ్యామిలీ కోర్టులో తండ్రి న్యాయమూర్తి పాత్ర పోషించాల్సి వచ్చింది. వాది ప్రతివాది ఇద్దరూ సమర్థంగానే ఉన్నారు. ఎటొచ్చీ న్యాయమూర్తిలో దాగిన తండ్రి మనసు కూతురి వైపే మొగ్గింది. ఆ తీర్పుతో మేఘన చిక్‌మగుళూరు (కర్ణాటక రాష్ట్రం) దగ్గర మార్లె నుంచి ఉడిపిలోని లిటిల్‌ రాక్‌ ఇండియన్‌ స్కూల్‌లో చేరింది. ఐదవ తరగతి నుంచి ట్వల్త్‌ క్లాస్‌ వరకు అదే స్కూల్‌. ఇంజనీరింగ్‌ మైసూర్‌లోని శ్రీ జయచామరాజేంద్ర కాలేజ్‌లో చేసింది.

ఎప్పుడూ సాహసాలే
మేఘన ఇంజనీరింగ్‌లో ఉన్నప్పుడు కాలేజ్‌ అడ్వెంచర్‌ క్లబ్‌ కార్యకలాపాల్లో చురుగ్గా ఉండేది. సెమిస్టర్‌ బ్రేక్‌లో ట్రెకింగ్, రివర్‌ రాఫ్టింగ్, మౌంటనియరింగ్‌ వంటి సాహసయాత్రలను మేఘన స్వయంగా నిర్వహించేది. ఆమె మనాలిలో మౌంటనియరింగ్‌ కోర్సు చేసింది. పారాగ్లైడింగ్‌లో పూర్తిస్థాయి శిక్షణ కూడా తీసుకుంది. గోవా, క్వారీ బీచ్‌లో సోలో పారాగ్లైడింగ్‌ ఈవెంట్‌లో జంప్‌ని విజయవంతంగా పూర్తి చేసింది. ఈ మధ్యలో కర్ణాటక సంగీతం నేర్చుకుంది. ఇలా ఆడుతూ పాడుతూ ఇంజనీరింగ్‌ పూర్తి చేసింది. ఫైనలియర్‌లో ఉన్నప్పుడు మొదలైంది ‘వాట్‌ నెక్ట్స్‌’ అనే ఆలోచన.

అందరిలా ఏదో ఒక ఉద్యోగంలో చేరిపోవడానికి మనస్సంగీకరించలేదు. అందరికంటే భిన్నంగా ఏదైనా చేయాలనే ఉత్సుకత చిన్నప్పటి నుంచి ఉంది. ఆ ఉత్సుకతే ఆమె చేత అన్నేసి సాహసాలను చేయించింది. వాటన్నింటికీ ఫుల్‌స్టాప్‌ పెట్టడం కాదు జీవితమంటే అనే సంఘర్షణ కూడా మొదలైంది. పారాగ్లైడింగ్‌లో శిక్షణనిచ్చిన సీనియర్‌లు చెప్పిన మాటలు మళ్లీ మళ్లీ గుర్తుకు వచ్చాయి. వాళ్లు ఎయిర్‌ఫోర్స్‌లో పని చేసి రిటైర్‌ అయిన అధికారులు. పారా గ్లైడింగ్‌ ట్రైనింగ్‌తోపాటు వాళ్ల ఉద్యోగ అనుభవాలను కూడా పంచుకునేవారు. సాహసానికి పరాకాష్ట అయిన ఉద్యోగం అంటే అదేనేమో అనిపించేది మేఘనకు. తన కెరీర్‌ కూడా అంతటి సాహసోపేతంగానే ఉండాలని ముచ్చటపడింది. ఎయిర్‌ఫోర్స్‌లో చేరాలని మనసు పడింది.

(తమ్ముడు నిర్ణయ్, తల్లి శోభ, తండ్రి రమేశ్‌తో మేఘన)

దేశంలో ఆరో అమ్మాయి
మేఘనాశాన్‌బాగ్‌ ఫైటర్‌ పైలట్‌ కావడం దక్షిణ భారతదేశానికి రికార్డు. మనదేశంలో యుద్ధవిమానాలు నడపడానికి అర్హత సాధించిన ఆరో అమ్మాయి మేఘన. మొదటి ఐదు స్థానాల్లో మధ్య ప్రదేశ్, రాజస్థాన్, బిహార్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల వారున్నారు. మేఘన విజయం కర్ణాటక రాష్ట్రానికి మాత్రమే కాదు, దక్షిణాది రాష్ట్రాలకు కూడా రికార్డే. దక్షిణాది రాష్ట్రాలన్నింటికీ తొలి ఫైటర్‌ పైలట్‌ మేఘననే. రఫెల్‌ యుద్ధ విమానాన్ని నడపడం తన కల అంటోంది మేఘన.

చక్కటి కాఫీలా ఉండాలి
మేఘనది కన్నడ కాఫీ తోటల్లో పుట్టిన కుటుంబం. ఆమె తల్లి శోభ ఆడపిల్లకు మరీ గిరిగీసే చాదస్తపు తల్లి కాదు. న్యాయమూర్తిగా జీవితాలను ప్రభావితం చేస్తున్న మహిళ. జీవితాన్ని చక్కగా అమర్చుకోవాలనే సంప్రదాయవాది మాత్రమే. కూతురు జీవితం... ఉదయాన్నే ఘుమఘుమలాడే కాఫీలాగ ఆస్వాదభరితంగా ఉంటే బావుణ్ననుకునే తల్లి. సాహసాల జోలికి పోకుండా ఒళ్లు హూనం చేసుకోకుండా కూతురు లక్షణంగా ఉండాలని కోరుకునే తల్లి మనసు ఆమెది. మేఘన యుద్ధవిమానాలను నడిపే అధికారి అయినప్పుడు సంతోషంతోపాటు ఎక్కడో మనసులో భయపడుతూనే ఉన్నారామె. ‘ఇంత గొప్ప స్థాయికి చేరడం ఆనందమే కానీ...’ అంటూ అర్ధోక్తిలో ఆగిపోతుంటారిప్పటికీ.

ఆమె ఇలా అంటుంటే మేఘన మాత్రం ‘‘అది నా జీవితంలో గొప్ప పర్వదినం అనే చెప్పాలి. కాక్‌పిట్‌లో నేనొక్కదాన్నే. ఒక్కదాన్నే విమానాన్ని టేకాఫ్‌ చేయాలి. ఎయిర్‌ క్రాఫ్ట్‌ కంట్రోల్‌ కి నా పేరు చెప్పుకుని విమానాన్ని గాల్లోకి తీసుకెళ్లడంలో ఉన్న ఆనందాన్ని చెప్పడానికి మాటలుండవు. అనుభవంలో తెలియాల్సిందే. ఆ ఫ్లయింగ్‌లో నేను విమానాన్ని నడిపింది కేవలం ఇరవై నిమిషాల సేపే. కానీ అవి నాకు అమూల్యమైన క్షణాలు. జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను’’ అని తన తొలి ఫ్లయింగ్‌ అనుభవాన్ని పంచుకుంది.

‘‘నేను ఫైటింగ్‌ విభాగాన్ని ఎన్నుకున్నాను. శిక్షణలో రోమాలు నిక్కబొడుచుకునే విన్యాసాలను ఎన్నో చేస్తుంటాం. ఫైటర్‌ పైలట్‌ శిక్షణలో బాంబులతో దాడి చేయడం, కాల్పులు, పోరాట నైపుణ్యాలను నేర్పిస్తారు. తర్వాత అవన్నీ తీపి జ్ఞాపకాలుగా మిగులుతాయి. ఒక్కో విన్యాసాన్నీ పూసగుచ్చినట్లు చెబుతుంటే అమ్మానాన్న, తమ్ముడు భయంగా చూశారు నన్ను. అప్పుడు నాకేదయినా అయి ఉంటే... అనేదే వాళ్ల భయం. తమ్ముడు నిర్ణయ్‌ పుణేలోని సింబయాసిస్‌లో లా కోర్సు చేస్తున్నాడు అచ్చం అమ్మ కోరుకున్నట్లే’’ అని నవ్వింది మేఘన.

కలిసొచ్చిన నిర్ణయం
మేఘన 2015లో ఇంజనీరింగ్‌ పూర్తి చేసింది. ఆమెకి ఇండియన్‌ ఎయిర్‌ఫోర్సులో చేరాలనే లక్ష్యం ఏర్పడింది కూడా అప్పుడే. సరిగ్గా అదే సమయానికి మనదేశ విమానయాన రంగం... యుద్ధవిమానాల కాక్‌పిట్‌లోకి మహిళలకు ప్రవేశం కల్పిస్తూ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఎయిర్‌ఫోర్స్‌ నిర్ణయంతో 2016 జూన్‌లో మోహనా సింగ్, భావనా కాంత్, అవనీ చతుర్వేదిలు దేశంలో యుద్ధవిమానాలు నడపడానికి ఎంపికైన తొలి మహిళలుగా రికార్డు్డ సృష్టించారు. అప్పటి వరకు పైలట్‌గా విమానాలను నడపాలనేదే మేఘన ఆశయం.

ఎయిర్‌ఫోర్స్‌ నిర్ణయంతో మేఘన లక్ష్యం యుద్ధవిమానాలయ్యాయి. ఆ ముగ్గురు మహిళల రికార్డు మేఘనలో పట్టుదలను మరింతగా పెంచింది. ఏకకాలంలో ఎయిర్‌ఫోర్స్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్, సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు రెండు పరీక్షలను రాసింది. రెండింటిలోనూ తొలి ప్రయత్నంలోనే సెలెక్ట్‌ అయింది. కానీ తన కల విమానాల్లోనే విహరిస్తుండడంతో ఎయిర్‌ఫోర్స్‌లోకి వచ్చింది. 2017 జనవరిలో హైదరాబాద్, దుండిగల్‌ ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీలో శిక్షణ తీసుకుంది. యుద్ధవిమానాలు నడపడంలో నైపుణ్యం సాధించింది. ఏఎఫ్‌ఏలో జాయిన్‌ అయ్యి, డిసెంబర్‌లో కోర్సు పూర్తి చేసింది. ఈ ఏడాది ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ సర్టిఫికేట్‌ అందుకుంది.

ప్రయత్నమూ గొప్పే
మనదేశంలో యుద్ధవిమానాలను నడిపించిన తొలి మహిళలుగా మోహనా సింగ్, భావనాకాంత్, అవనీచతుర్వేదిల విజయగాథ చదవడం నా జీవితంలో టర్నింగ్‌ పాయింట్‌. ఆ కథనం నన్ను ప్రభావితం చేసింది. నాలాగే మరెందరో స్ఫూర్తి పొంది ఉండవచ్చు. నన్ను చూసి స్ఫూర్తి పొందేవాళ్లు కూడా ఉండాలి. అదే నాకు సంతోషం. ఫైటర్‌ పైలట్‌ కావడం గొప్ప అవకాశం. ప్రతి ఒక్క అమ్మాయికి, అబ్బాయికి ఫైటర్‌ పైలట్‌ కావాలనేదే కల కావాలి. ఆ కలను సాధించుకోవడంలో విజయం  మాత్రమే కాదు ప్రయత్నించడం కూడా గొప్ప అనుభూతిగానే మిగులుతుంది. – మేఘనా శాన్‌బాగ్, ఫైటర్‌ పైలట్‌

– వాకా మంజులారెడ్డి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top