మంచికి పోతే... | If you do not know ... | Sakshi
Sakshi News home page

మంచికి పోతే...

May 28 2014 9:56 PM | Updated on Aug 21 2018 5:46 PM

మంచికి పోతే... - Sakshi

మంచికి పోతే...

మంచికి పోతే చెడు ఎదురైంది... అనే మాటను చాలాసార్లు విన్నాను. అయితే అది నాకు కూడా అనుభవంలోకి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు.

కనువిప్పు
 
మంచికి పోతే చెడు ఎదురైంది... అనే మాటను చాలాసార్లు విన్నాను. అయితే అది నాకు కూడా అనుభవంలోకి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. ఫ్రెండ్స్ ఎవరైనా కష్టాల్లో ఉంటే నా వంతుగా సహాయపడడం నాకు అలవాటు. అయితే, ఒక్కోసారి హద్దు దాటేవాడిని.
 
‘‘కష్టాల్లో ఉన్నాను’’ అని ఎవరైనా అంటే చాలు వివరాలేమీ తెలుసుకోకుండా సహాయపడేవాడిని.
 నేను డిగ్రీలో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ నా దగ్గరకు వచ్చి-
 ‘‘నువ్వు చాలామందిని ఆదుకున్నావని అందరూ అంటుంటారు. నేను చాలా కష్టాల్లో ఉన్నాను. డబ్బు కావాలి. అప్పు కోసం వెళితే స్యూరిటీ కావాలి అంటున్నారు. ఎవరూ షూరిటీ ఇవ్వడం లేదు. నువ్వు షూరిటీ ఇస్తే నా కష్టాలను తీర్చినవాడివి అవుతావు. ప్లీజ్...’’ అని బతిమిలాడుకున్నాడు.
 ఆ మాటలకు నేను నిలువెల్లా కరిగిపోయాను.
 ‘‘దానిదేముంది. పద!’’ అని తొందర చేశాను కూడా.
 అప్పు తీసుకున్న రెండు వారాల తరువాత అతను కనిపించకుండా పోయాడు. నాకు భయం పట్టుకుంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా   ఎత్తడం లేదు.
 ఒకరోజు అప్పు ఇచ్చిన వ్యక్తి... కాలేజీకి వచ్చి పెద్ద గొడవ చేశాడు.
 ‘‘వాడు పారిపోయాడు. నువ్వు స్యూరిటీ ఇచ్చావు కాబట్టి ఆ డబ్బు నువ్వు ఇవ్వాల్సిందే’’ అని డిమాండ్ చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించాడు.
 కాలేజీలో నాకు ‘రాముడు మంచి బాలుడు’ లాంటి ఇమేజి ఉంది. అలాంటి నన్ను ‘అప్పు’ దెబ్బతో కొందరు అపార్థం చేసుకున్నారు.
 ‘‘రెండు వారాల్లో నీ అప్పు వడ్డీతో సహా చెల్లిస్తాను’’ అని చెప్పాను. ఎప్పుడూ ఎవరినీ అప్పు అడగని నేను తెలిసిన వారి దగ్గరల్లా అప్పు చేసి ఆ అప్పు తీర్చాను.
 వెనకా ముందు చూడకుండా ఇంకెప్పుడూ... తొందరపడకూడదని ఈ సంఘటన నాకు పాఠం నేర్పింది!
 
- ఆర్.శశికాంత్, భువనగిరి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement