భూసారాన్ని బట్టే చీడపీడల బెడద!

If the ground is good on the pest is low - Sakshi

ఇంటి పంట

ఆవులు/మేకల పేడ ఎరువు

వారానికోసారి ఆవు మూత్రం పిచికారీ

సెంట్రల్‌ వర్సిటీలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఇంటిపంటల సాగు

రసాయనిక అవశేషాల్లేని కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు సాగు చేసుకోవాలన్న ఆసక్తి గాఢంగా ఉండాలే గాని సొంతిల్లే అవసరం లేదు. క్వార్టర్‌లో నివాసం ఉంటున్నప్పటికీ ఎంచక్కా సేంద్రియ ఇంటిపంటలు పండించుకోవచ్చని రుజువు చేస్తున్నారు డా. వి. శ్రీనివాసరావు. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయన తన కుటుంబంతో క్యాంపస్‌ క్వార్టర్‌లో నివాసం ఉంటూ.. పెరటి స్థలంలో ఇంటిపంటలు పండించుకుంటున్నారు.

గతంలో క్వార్టర్‌ పై అంతస్తులో ఉండగా టెర్రస్‌ మీద ఐదేళ్లపాటు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సొంతంగా తయారు చేసుకున్న జీవామృతం, ఘన జీవామృతంతో ఇంటిపంటలు సాగు చేసిన అనుభవం ఉంది. గత ఏడాది నుంచి పెరట్లో సాగు చేస్తున్నారు. ప్రస్తుతం నాటావుల మాగిన పేడ ఎరువు, మేకల ఎరువు సమపాళ్లలో కలిపి మొక్కలకు వేస్తున్నారు. వేసవిలోనే దగ్గర్లోని గ్రామానికి వెళ్లి రైతు నుంచే కొనుగోలు చేసి తెచ్చుకొని వాడుతున్నారు. అరటి గెల ఆయన పెరటి తోటకు దీపస్థంభంలా భాసిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఆయన పెరటి తోటలో దొండ/బీర పాదులతోపాటు బెండ మొక్కలు, వంగ మొక్కలు, పుదీన ఉన్నాయి. వంగ మొక్కలకు వేసవికి ముందు 4–5 అంగుళాల ఎత్తున ప్రూనింగ్‌ చేశారు. కొత్త కొమ్మలకు ఇప్పుడు కాయలు వచ్చాయి. పుదీన, తోటకూర ఉంది.

మృగశిర కార్తెతో పాటే రుతుపవనాలు పలుకరించిన తర్వాత వారం క్రితమే అనేక ఆకుకూరలు విత్తుకున్నారు.కూరగాయ మొక్కల విత్తనాల నారు పోసుకున్నారు. టెర్రస్‌ గార్డెన్‌లో కన్నా పెరటి తోటలో పంటలకు చీడపీడల బెడద తక్కువగా ఉన్నట్లు గమనించానని డా. శ్రీనివాసరావు తెలిపారు. భూమిలో సారం బాగుంటే చీడపీడల బెడద తక్కువగా ఉంటుందన్నారు. కట్టెల బొగ్గు పొడిని అప్పుడప్పుడూ మొక్కలపై చల్లుతుంటానన్నారు. వారానికోసారి లీటరు నీటికి 10–15 ఎం.ఎల్‌. నాటావు మూత్రాన్ని కలిపి పెరటి తోటలో పిచికారీ చేస్తున్నానని తెలిపారు. వచ్చే నెల నుంచి పూర్తిస్థాయిలో తమ పెరటి తోట కూరగాయలు, ఆకుకూరలనే తింటామని డా. శ్రీనివాసరావు(94922 93299) సంతోషంగా చెప్పారు.

                 కొత్తిమీర, ఎరువును చూపుతున్న డా. శ్రీనివాసరావు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top