కూర్చున్నా, నిల్చున్నా నడుము నొప్పి... తగ్గేదెలా? | how to decrease the Lumbar pain | Sakshi
Sakshi News home page

కూర్చున్నా, నిల్చున్నా నడుము నొప్పి... తగ్గేదెలా?

Apr 28 2016 10:53 PM | Updated on Sep 3 2017 10:58 PM

కూర్చున్నా, నిల్చున్నా నడుము నొప్పి... తగ్గేదెలా?

కూర్చున్నా, నిల్చున్నా నడుము నొప్పి... తగ్గేదెలా?

మీరు తెలిపన వివరాలను బట్టి చూస్తే మీరు స్పాండిలోసిస్ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంవది.

ఆర్థో కౌన్సెలింగ్
నా వయసు 64 ఏళ్లు. కొద్ది నెలలుగా నాకు నడుము నొప్పి వస్తోంది. కూర్చున్నా, నిల్చున్నా నొప్పులు వస్తున్నాయి. దాంతోపాటు కాళ్లలో నొప్పులు, తిమ్మిర్లు, అవి మొద్దుబారడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. నాకు తగిన సలహా ఇవ్వండి.
 - నిరంజన్‌రావు, కోదాడ

 
మీరు తెలిపన వివరాలను బట్టి చూస్తే మీరు స్పాండిలోసిస్ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంవది. స్పాండిలోసిస్ ఉన్నవారిలో వెన్నుపూసల వల్ల నరాలు నొక్కుకుపోయి, వాటిపై ఒత్తిడి పడుతుంది. దాంతో నడుమునొప్పితో పాటు కాళ్లలో నొప్పులు, తిమ్మిర్లు ప్రారంభమవుతాయి. ఈ సమస్యతో బాధపడుతున్నవారు నడిస్తే చాలు కాళ్లలో నొప్పి రావడం మొదలవుతుంది. కాళ్లు బరువెక్కుతాయి. ఇంకొంచెం దూరం నడిస్తే ఇక నడవలేని పరిస్థితి కలుగుతుంది. ఆగిపోతే నొప్పి తగ్గుతుంది. తిరిగి నడక ప్రారంభిస్తే నొప్పి కలుగుతుంది. దీన్నే వైద్య పరిభాషలో క్లాడికేషన్ అంటారు.

ఈ దశలోనే ఆ ప్రాంతంలో నడుము సమతౌల్యం తప్పుతుంది. ఆ తర్వాత నడుము మొత్తంగా ఒక పక్కకు గానీ ముందుకు గానీ ఒంగిపోతుంది. కొంచెం నడిచినా, కొంచెంసేపు నిల్చున్నా పిదుదుల భాగంలో, తొడ ఎముక భాగాల్లో నొప్పి వస్తుంది. నొప్పి క్రమంగా తీవ్రమై మంచం నుంచి బాత్‌రూమ్ వరకు నడవలేని పరిస్థితి వస్తుంది. అప్పటికీ చికిత్స చేయించుకోకపోతే మంచానికే పరిమితమైపోయే పరిస్థితి రావచ్చు. ఇతర ఇబ్బందులు కూడా వచ్చి ప్రాణాపాయం కలగవచ్చు. కాబట్టి మీలాంటి సమస్య ఉన్న సందర్భాల్లో వెంటనే డాక్టర్‌ను కలిసి తగిన చికిత్స తీసుకోవాలి.
 
- డా. ప్రవీణ్ మేరెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement