breaking news
Lumbar pain
-
తీవ్రమైన మెడ, నడుం నొప్పి.. తగ్గుతుందా?
పల్మనాలజీ కౌన్సెలింగ్ నా వయసు 30 ఏళ్లు. గత ఏడాది కాలం నుంచి తీవ్రమైన మెడనొప్పి, నడుమునొప్పితో బాధపడుతున్నాను. దగ్గరలో ఉన్న డాక్టర్‌ను సంప్రదిస్తే స్పాండిలోసిస్ అంటున్నారు. దీనికి మందులు వాడుతున్నాను. నొప్పి తగ్గినట్టే తగ్గి మళ్లీ వస్తోంది. దీనికి హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా? - జనార్దన్‌రావు, కత్తిపూడి స్పాండిలోసిస్ అనేది వెన్నెముకకు సంబంధించిన సమస్య. స్పాండిలోసిస్ అనేది ఒక రకమైన ఆర్థరైటిస్. ఇది మెడ భాగంలో వస్తే సర్వైకల్ స్పాండిలోసిస్ అని, నడుము భాగంలో వస్తే లంబార్ స్పాండిలోసిస్ అంటారు. కారణాలు: కాళ్లు, చేతులతో ఉన్నట్లు వెన్నులో కూడా జాయింట్స్ ఉంటాయి. ఈ జాయింట్స్ అరుగుదల వల్ల నొప్పి రావచ్చు జాయింట్స్‌లో వాటర్ తగ్గడం వల్ల కూడా నొప్పి రావచ్చు స్పైన్ దెబ్బతిని కూడా నొప్పి రావచ్చు వెన్నుపూసల మధ్య నుంచి నరాలు శరీరంలో వ్యాపించడానికి దారి ఉంటుంది. ఆ దారి సన్నబడితే నరాలపై ఒత్తిడి పడి నొప్పి వస్తుంది. లక్షణాలు: సర్వైకల్ స్పాండిలోసిస్: - మెడనొప్పి, తలనొప్పి తల అటు-ఇటు తిప్పడం కష్టమవుతుంది. మెడ బిగుసుకుపోయినట్టుగా ఉంటుంది. నొప్పి మెడ నుంచి భుజాలు, చేతుల వరకు ఉంటుంది. లంబార్ స్పాండిలోసిస్ : నడుమునొప్పి, కొన్నిసార్లు నడుము నొప్పితో పాటు మెడ నొప్పి కూడా ఉంటుంది. నొప్పి నడుము నుంచి ఒకవైపు కాలు, పాదం వరకు వ్యాపిస్తుంది. దీనినే సయాటికా నొప్పి అంటారు. నరాలు ఒత్తిడికి గురైనప్పుడు అవి సప్లై అయ్యే చోటు మొద్దుబారడం, దాంతో నడవడానికి కూడా ఇబ్బందిపడటం వంటి సమస్యలు వస్తాయి. నిర్ధారణ : వ్యాధి లక్షణాలను బట్టి ఎక్స్-రే ఎమ్మారై, సీటీ స్కాన్ నివారణ: వెన్నెముకకు సంబంధించిన వ్యాయామాలు చేయడం, మంచి పోషకాహారం తీసుకోవడం, క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం, ఒక్కసారిగా కూర్చోవడం లేదా నిల్చోవడం వంటివి చేయకపోవడం, దూరప్రాంతాలకు వాహనం నడపడం వంటివి చేయకపోవడం. హోమియో చికిత్స: హోమియో ప్రక్రియలో ఎలాంటి ఆరోగ్య సమస్యలకైనా పరిష్కారం ఉంది. రోగి వ్యక్తిగత లక్షణాలను బట్టి వారి శారీరక, మానసిక సమస్యలను పరిగణనలోకి తీసుకొని చికిత్స ఇస్తారు. ఇలా కాన్స్టిట్యూషనల్ చికిత్స అందిస్తే క్రమంగా రోగనిరోధక శక్తి పెరిగి, వ్యాధి తీవ్రత క్రమంగా తగ్గుతుంది. దాంతో క్రమక్రమంగా పూర్తిగా వ్యాధి నివారణ జరుగుతుంది. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి సీనియర్ డాక్టర్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్ -
కూర్చున్నా, నిల్చున్నా నడుము నొప్పి... తగ్గేదెలా?
ఆర్థో కౌన్సెలింగ్ నా వయసు 64 ఏళ్లు. కొద్ది నెలలుగా నాకు నడుము నొప్పి వస్తోంది. కూర్చున్నా, నిల్చున్నా నొప్పులు వస్తున్నాయి. దాంతోపాటు కాళ్లలో నొప్పులు, తిమ్మిర్లు, అవి మొద్దుబారడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. నాకు తగిన సలహా ఇవ్వండి. - నిరంజన్‌రావు, కోదాడ మీరు తెలిపన వివరాలను బట్టి చూస్తే మీరు స్పాండిలోసిస్ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంవది. స్పాండిలోసిస్ ఉన్నవారిలో వెన్నుపూసల వల్ల నరాలు నొక్కుకుపోయి, వాటిపై ఒత్తిడి పడుతుంది. దాంతో నడుమునొప్పితో పాటు కాళ్లలో నొప్పులు, తిమ్మిర్లు ప్రారంభమవుతాయి. ఈ సమస్యతో బాధపడుతున్నవారు నడిస్తే చాలు కాళ్లలో నొప్పి రావడం మొదలవుతుంది. కాళ్లు బరువెక్కుతాయి. ఇంకొంచెం దూరం నడిస్తే ఇక నడవలేని పరిస్థితి కలుగుతుంది. ఆగిపోతే నొప్పి తగ్గుతుంది. తిరిగి నడక ప్రారంభిస్తే నొప్పి కలుగుతుంది. దీన్నే వైద్య పరిభాషలో క్లాడికేషన్ అంటారు. ఈ దశలోనే ఆ ప్రాంతంలో నడుము సమతౌల్యం తప్పుతుంది. ఆ తర్వాత నడుము మొత్తంగా ఒక పక్కకు గానీ ముందుకు గానీ ఒంగిపోతుంది. కొంచెం నడిచినా, కొంచెంసేపు నిల్చున్నా పిదుదుల భాగంలో, తొడ ఎముక భాగాల్లో నొప్పి వస్తుంది. నొప్పి క్రమంగా తీవ్రమై మంచం నుంచి బాత్రూమ్ వరకు నడవలేని పరిస్థితి వస్తుంది. అప్పటికీ చికిత్స చేయించుకోకపోతే మంచానికే పరిమితమైపోయే పరిస్థితి రావచ్చు. ఇతర ఇబ్బందులు కూడా వచ్చి ప్రాణాపాయం కలగవచ్చు. కాబట్టి మీలాంటి సమస్య ఉన్న సందర్భాల్లో వెంటనే డాక్టర్‌ను కలిసి తగిన చికిత్స తీసుకోవాలి. - డా. ప్రవీణ్ మేరెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్