హార్మోన్ల లోపంతో నెలసరి సక్రమంగా లేదు.. ఏం చేయాలి? 

Hormonal deficiency monthly is not improper What should I do? - Sakshi

ఫ్యామిలీ డాక్టర్‌

హోమియో కౌన్సెలింగ్‌
మా అమ్మాయి వయసు 22 ఏళ్లు. హార్మోన్‌ లోపంతో నెలసరి సరిగా రావడం లేదు. బరువు పెరుగుతోంది. హోమియోలో చికిత్స ఉందా? – ఎస్‌. శ్రీవాణి, కాకినాడ 
గర్భాశయంలోని పిండ దశ మొదలుకొని జీవితాంతం హార్మోన్లు తమ ప్రభావం చూపుతుంటాయి. మెదడులోని హైపోథెలామస్, పిట్యూటరీ గ్రంథులు శరీర కణాల క్రమబద్ధీకరణకు తోడ్పడతాయి.ఈ హార్మోన్లు అన్నీ రక్తం ద్వారా ప్రవహిస్తూ, నిర్దిష్ట అవయవాన్ని ప్రభావితం చేస్తాయి. సాధారణ జీవక్రియలైన జీర్ణక్రియ మొదలుకొని, శరీరక, మానసిక ఎదుగుదల, మానసిక సమతౌల్యత వంటి అంశాలన్నింటికీ ఇవి తోడ్పడతాయి. హైపోథైరాయిడ్, పీసీఓడీ, సంతాన లేమి, డయాబెటిస్‌ లాంటి దీర్ఘకాలిక జబ్బులన్నీ హార్మోన్‌ అసమతౌల్యత వల్ల వచ్చేవే. ఈ హార్మోన్ల సమతౌల్యత దెబ్బతిన్నప్పుడు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతారు. 

థైరాయిడ్‌ హార్మోన్లయిన టీ3, టీ4... థైరాయిడ్‌ గ్రంథి నుంచి ఉత్పత్తి అవుతాయి. వీటిలో అసమతౌల్యత ఏర్పడితే హైపోథైరాయిడిజమ్, హైపర్‌థైరాయిడిజమ్, గాయిటర్‌ వంటి దీర్ఘకాలిక జబ్బులు వస్తాయి. అలాగే ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్, ప్రోలాక్టిన్, ఆక్సిటోసిన్‌ వంటి హార్మోన్లు మహిళల్లో నెలసరి, సెకండరీ సెక్సువల్‌ లక్షణాలు, సంతానోత్పత్తి, ప్రసవం వంటి అంశాలకు ఉపకరిస్తాయి. ఈ హార్మోన్ల అసమతౌల్యత వల్ల మహిళల్లో నెలసరి సమస్యలు, అవాంఛిత రోమాలు, సంతానలేమి వంటి సమస్యలు కనిపిస్తాయి. మెనోపాజ్, నెలసరి వచ్చే సమయంలో హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల వేడి ఆవిర్లు, మానసిక అశాంతి, నీరసం, కీళ్లనొప్పులు కూడా వస్తాయి.  నెలసరి సరిగా రాకపోవడంతో పాటు, బరువు పెరుగుతోందని చెబుతున్నారు కాబట్టి మీ అమ్మాయిలో హార్మోన్ల అసౌమతౌల్యత ఏర్పడి ఉండవచ్చు. ముందుగా ఆమెలోని సమస్యను తెలుసుకోవాలి. మీరు చెబుతున్న లక్షణాలను చూస్తే ఆమెకు థైరాయిడ్‌కు సంబంధించిన సమస్య ఉండవచ్చని అనిపిస్తోంది. ఇది నిర్ధారణ అయితే ఆమెకు హోమియోలో కాల్కేరియా కార్బ్, థైరాయిజమ్‌ ఐయోడమ్, బ్రోమియమ్, సల్ఫర్‌ వంటి మందులు బాగా పనిచేస్తాయి. ఒకసారి ఆమెను అనుభవజ్ఞులైన హోమియో వైద్యులకు చూపించండి. ఆమెకు ఉన్న వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు.
డాక్టర్‌ మురళి కె. అంకిరెడ్డి, 
ఎండీ (హోమియో), 
స్టార్‌ హోమియోపతి, హైదరాబాద్‌ 

యానల్‌ ఫిషర్‌ నయమవుతుందా? 
నా వయసు 67 ఏళ్లు. మలవిసర్జన సమయంలో విపరీతమైన నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదించాను. యానల్‌  ఫిషర్‌కు ఆపరేషన్‌ చేయాలన్నారు.  ఆపరేషన్‌ అంటే భయం.  హోమియోలో చికిత్స ఉందా? – వి.వి. సుందరరావు, అమలాపురం 
మలద్వారం దగ్గర ఏర్పడే చీలికను ఫిషర్‌ అంటారు. మనం తీసుకునే ఆహారంలో పీచుపదార్థాల పాళ్లు తగ్గడం వల్ల మలబద్దకం వస్తుంది. దాంతో మలవిసర్జన సాఫీగా జరగదు. అప్పుడు మలవిసర్జన కోసం విపరీతంగా ముక్కడం వల్ల మలద్వారం వద్ద పగుళ్లు ఏర్పడతాయి. ఈ పగుళ్లను ఫిషర్‌ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు మల విసర్జన సమయంలో నొప్పితో పాటు రక్తస్రావం జరుగుతుంది. ఇలా రోగి ముక్కే సమయంలో మలద్వారంతో పాటు దాని చుట్టుపక్కల ఉండే అవయవాలన్నీ తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. క్రమేపీ అక్కడి ప్రాంతంలో కూడా వాపు రావడం, రక్తనాళాలు చిట్లడం మలంతో పాటు రక్తం పడటం జరుగుతుంది. ఫిషర్‌ సంవత్సరాల తరబడి బాధిస్తుంటుంది. ఆపరేషన్‌ చేయించుకున్నా మళ్లీ సమస్య తిరగబెట్టడం మామూలే. ఇది రోగులను మరింత ఆందోళనకు గురి చేస్తుంది. 
కారణాలు: ∙దీర్ఘకాలిక మలబద్దకం ∙ఎక్కువకాలం విరేచనాలు ∙వంశపారంపర్యం ∙అతిగా మద్యం తీసుకోవడం ∙ఫాస్ట్‌ఫుడ్స్, వేపుళ్లు ఎక్కువగా తినడం ∙మాంసాహారం తరచుగా తినడం వల్ల ఫిషర్‌ సమస్య వస్తుంది.
లక్షణాలు: ∙తీవ్రమైన నొప్పి, మంట ∙చురుకుగా ఉండలేరు ∙చిరాకు, కోపం ∙విరేచనంలో రక్తం పడుతుంటుంది ∙కొందరిలో మలవిసర్జన అనంతరం మరో రెండు గంటల పాటు  నొప్పి, మంట. 
చికిత్స: ఫిషర్‌ సమస్యను నయం చేయడానికి హోమిమోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది.  ఆపరేషన్‌ అవసరం లేకుండానే చాలావరకు నయం చేయవచ్చు. రోగి మానసిక, శారీరక తత్వాన్ని, ఆరోగ్య చరిత్ర వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని హోమియో మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే తప్పక మంచి ఫలితం ఉంటుంది.
డాక్టర్‌ టి.కిరణ్‌ కుమార్, డైరెక్టర్, 
పాజిటివ్‌ హోమియోపతి, విజయవాడ, వైజాగ్‌

బాబుకు ఆటిజమ్‌ తగ్గుతుందా?
మా బాబు వయసు మూడేళ్లు. ఇటీవల వాడెప్పుడూ ఒంటరిగా ఉండటం, చెప్పిన మాటలే మళ్లీ మళ్లీ చెబుతుండటంతో డాక్టర్‌కు చూపించాం. డాక్టర్‌ పరీక్షించి ‘ఆటిజమ్‌’ అన్నారు. అంటే ఏమిటి? దీనికి హోమియోలో చికిత్స ఉందా? – డి. సురేశ్‌కుమార్, నల్లగొండ 
ఒకప్పుడు ఆటిజమ్‌ను పాశ్చాత్యదేశాలకు చెందిన రుగ్మతగా భావించేవారు. అయితేఇటీవల ఈ కేసులు మన దగ్గర కూడా ఎక్కువే కనిపిస్తున్నాయి. ఆటిజమ్‌ అంటే... చిన్న పిల్లల్లో మానసిక వికాసం చక్కగా జరగని, నాడీవ్యవస్థకు సంబంధించిన రుగ్మతగా చెప్పవచ్చు. ఇలాంటి పిల్లలు నలుగురితో కలవకుండా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతుంటారు. కొత్త ఆటలు ఆడకుండా ఉండటం, చేసిన పనినే పదే పదే చేయడం, వల్లించిన మాటనే మళ్లీ మళ్లీ మాట్లాడటం వంటివి చేస్తారు. వారు నేర్చుకునే పదసంపద (వకాబులరీ) కూడా తక్కువే. 
కారణాలు: ఆటిజమ్‌కు నిర్దిష్టమైన కారణం తెలియకపోయినా ప్రధానంగా జన్యుపరంగా ఇది వస్తుందని భావిస్తున్నారు. అలాగే తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెకు వైరల్‌ ఇన్ఫెక్షన్‌ సోకడం, ఆమె భారలోహాలకు ఎక్స్‌పోజ్‌ కావడం, యాంటీడిప్రెసెంట్‌ తీసుకోవడం లేదా ఆమెకు పొగతాగే / మద్యం తీసుకునే అలవాటు ఉండటం, చాలా ఆలస్యంగా గర్భందాల్చడం, జీవక్రియల్లో అసమతౌల్యత, ప్రసవం సమయంలో బిడ్డకు తగినంత ఆక్సిజన్‌ అందకపోవడం వంటివి దీనికి కారణం. 

లక్షణాలు: బిడ్డ పుట్టిన ఆర్నెల్ల నుంచే ఆటిజమ్‌ లక్షణాలు కనిపిస్తుంటాయి. అయితే సాధారణంగా రెండేళ్లు లేదా మూడేళ్ల సమయంలోనే తల్లిదండ్రులు వాటిని గమనిస్తారు. చిన్నపిల్లల్లో సహజంగా ఉండాల్సిన కమ్యూనికేటిషన్‌ నైపుణ్యాలు లోపించడం ద్వారా పేరెంట్స్‌ ఆటిజాన్ని గుర్తిస్తారు. పిల్లలు నేరుగా మాట్లాడేవారి కళ్లలోకి చూడకుండా ఉండటం, తమ వయసు పిల్లలో ఆడుకోకపోవడం, వారి వయసుకు తగినన్ని మాటలు నేర్చుకోకపోవడం వంటి లక్షణాలతో దీన్ని గుర్తించవచ్చు. తీవ్రతను బట్టి దీన్ని మైల్డ్, ఒక మోస్తరు (మోడరేట్‌), తీవ్రమైన (సివియర్‌) ఆటిజమ్‌గా వర్గీకరించవచ్చు. 

చికిత్స: హోమియోలో ఆటిజమ్‌కు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. అనుభవజ్ఞులైన హోమియో నిపుణుల పర్యవేక్షణలో ఈ మందులు వాడితే ఆటిజమ్‌ను చాలావరకు నయం చేయవచ్చు. ఇలాంటి పిల్లల్లో చికిత్స ఎంత త్వరగా ప్రారంభిస్తే, ఫలితాలు అంత మెరుగ్గా ఉంటాయి. అయితే ఆరేడు ఏళ్ల వయసులో చికిత్స ప్రారంభించినా మంచి ఫలితాలే కనిపించడం హోమియో చికిత్సలోని విశిష్టత.
డాక్టర్‌ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, 
పాజిటివ్‌ హోమియోపతి, హైదరాబాద్‌

గౌట్‌ సమస్యను తగ్గించవచ్చా? 
నా వయసు 37 ఏళ్లు. కొన్నాళ్లుగా కాలి బొటనవేలు వాచింది. అక్కడ విపరీతమైన సలపరంతో నొప్పి ఉంది. డాక్టర్‌గారు గౌట్‌ అని చెప్పారు.  మందులు వాడినా  సమస్య తగ్గలేదు. నా సమస్యకు హోమియోలో పరిష్కారం ఉందా? – ఎల్‌. రామేశ్వర్‌రావు, నిజామాబాద్‌ 
గౌట్‌ అనేది ఒక రకం కీళ్లవ్యాధి. మన శరీరంలో ‘యూరిక్‌ యాసిడ్‌’ జీవక్రియలు సరిగా లేనందున ఈ వ్యాధి వస్తుంది. సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో ఉండే ప్యూరిన్స్‌ అనే పదార్థాల విచ్ఛిన్నంలో భాగంగా యూరిక్‌ యాసిడ్‌ ఏర్పడుతుంది. అది రక్తంలో ఉండాల్సిన పరిమాణం కంటే ఎక్కువగా ఉంటే కీళ్లలోకి చేరుతుంది. అప్పుడు కీలు వాచిపోయి, కదలికలు కష్టంగా మారతాయి. ఈ పరిస్థితిని ‘గౌట్‌’ అంటారు. 
కారణాలు: ∙సాధారణంగా రక్తంలోని యూరిక్‌ యాసిడ్‌ మూత్రం ద్వారా విసర్జితమవుతుంది. ఒకవేళ శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ ఉత్పత్తి పెరిగినా లేదా దాని విసర్జన సరిగా జరగకపోయినా అది రక్తంలోనే నిలిచిపోయి గౌట్‌కు దారితీస్తుంది ∙ప్యూరిన్స్‌ ఎక్కువగా ఉండే ఆహారం (ఉదా: మాంసం, గుడ్లు, చేపలు) వంటి ఆహారం ఎక్కువగా తీసుకునేవారిలో ఇది అధికం ∙అధిక బరువు, వయసు పెరగడం, వంశపారంపర్యంగా రావడం కూడా కొన్ని కారణాలు. 

లక్షణాలు: ∙తీవ్రతను బట్టి ఈ వ్యాధి లక్షణాలు చాలా ఆకస్మికంగా కనిపిస్తాయి ∙చాలామందిలో ఇది కాలి బొటనవేలితో ప్రారంభమవుతుంది ∙మొదట్లో ఈ వ్యాధి కాలి బొటన వేలికి మాత్రమే పరిమితమైనప్పటికీ క్రమేపీ మోకాళ్లు, మడమలు, మోచేతులు, మణికట్టు, వేళ్లను కూడా ప్రభావితం చేస్తుంది ∙ఈ సమస్యను నిర్లక్ష్యం చేసి సరైన చికిత్స తీసుకోకపోతే మరింత తీవ్రతరమై కీళ్లను పూర్తిగా దెబ్బతీస్తుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం కూడా ఉంది. 

నివారణ / జాగ్రత్తలు: మాంసకృత్తులను బాగా తగ్గించాలి. మాంసాహారంలో ప్యూరిన్స్‌ ఎక్కువగా ఉండే గొర్రె, మేక, బీఫ్‌ వంటివి తీసుకోకూడదు. అలాగే మాంసాహారంలోని లివర్, కిడ్నీ, ఎముక మూలుగా, పేగుల వంటి తినకూడదు. శాకాహారంలో పాలకూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, చిక్కుళ్లు, వివిధ రకాల బీన్స్, పుట్టగొడుగుల వంటివి తీసుకోకూడదు. మద్యపానం పూర్తిగా మానివేయాలి. 
చికిత్స: హోమియో వైద్యవిధానం ద్వారా అందించే అధునాతనమైన కాన్స్‌టిట్యూషన్‌ చికిత్స ద్వారా గౌట్‌ వ్యాధిని శాశ్వతంగా నయం చేయడం సాధ్యమవుతుంది.
డాక్టర్‌ శ్రీకాంత్‌ మొర్లావర్, సీఎండీ, 
హోమియోకేర్‌ ఇంటర్నేషనల్, హైదరాబాద్‌ 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top