కాశీయాత్ర చరిత్ర

History Of Kashi Yathra - Sakshi

ప్రతిధ్వనించే పుస్తకం 

‘జగదీశ్వరుండు నాచేత కొంత దేశాటనము జేయింపదలచి నన్ను నేలుచున్న సుప్రీం కోరటు దొరలగుండా సెలవిప్పించినాడు గనుక నేను కాశీయాత్ర బోవలెనని 1830(ఈ అంకెలు తెలుగు పద్ధతిలో రాస్తారాయన) సంవత్సరము మే నెల 18వ తేది కుజవారము రాత్రి 9 ఘంటలకు చెన్నపట్టణము విడిచి మాధవరము జేరినాను’.  తెలుగులో యాత్రా సాహిత్యానికి తొలి అడుగు వేసిన రచన ఏనుగుల వీరాస్వామయ్య ‘కాశీయాత్ర చరిత్ర’. వీరాస్వామయ్య నాడు చెన్నపట్టణం అనబడిన చెన్నైలో నాడు ఉండిన సుప్రీమ్‌ కోర్డులో ఇంటర్‌ప్రిటర్‌గా పనిచేశారు. 1830–31 కాలంలో 15 నెలల పాటు ‘సకుటుంబముగా, సపరివారముగా’ సుమారు నూరుమందితో కాశీయాత్ర చేశారు. రోడ్లు, రైళ్లు లేని కాలంలో పల్లకీలో ఆయన వెళ్లారు. మద్రాసు, తిరుపతి, కడప, కర్నూలు, హైదరాబాద్, నాగపుర్, అలహాబాదు మీదుగా కాశీ చేరుకుని, తిరుగు ప్రయాణంలో గయ, భువనేశ్వర్, విశాఖపట్నం, నెల్లూరు మీదుగా సాగరతీరం వెంట మళ్లీ మద్రాసు వచ్చారు. ‘తాను చూచిన దేశములు, నగరములు, పల్లెలు, అందుండే నానాజాతి మనుష్యులు, వారి వృత్తులు, ఆచారములు మొదలయిన విషయములు సవిస్తరముగా వర్ణిస్తూ దినచర్య రచించినాడు’. అది 1838లో పుస్తకరూపంలో వెలువడింది. అందులోని క్లిష్టతరమైన తెలుగు–ఉరుదూ–తమిళం మిళిత భాషకు తెలుగు సమానార్థకాలను ప్రక్షేపించి దిగవల్లి వేంకట శివరావు 1941లో దాన్ని తిరిగి వెలయించారు. 

‘అణాలు, అర్ధలు, పావులాలు చెన్నపట్టణపు దుడ్లు కడప విడిచిన వెనుక దొరకవు. కూడా తెచ్చియుంటే వెండి నాణ్యములు మాత్రము పనికి వచ్చుచున్నవి. కృష్ణ కవతలి పయిసాలు కృష్ణ కీవల పనికిరావు’ అని రెండవ ప్రకరణములో రాశారు.‘ఈ షహరు గోడకు చేరినట్టుగా ‘ముసి’ అని అక్కడి వారిచేత చెప్పబడుచున్న ముచుకుంద నది పారుచున్నది... పోయిన సంవత్సరం నదీప్రవాహము ఎక్కువగా వచ్చి ఢిల్లీ దరవాజా వద్ద యింగిలీషువారు కట్టిన వారధిని పగలకొట్టి ఆ షహరులో కొన్ని వీధులున్ను, బేగంబజారులో కొన్ని వీధులున్ను ముంచివేసి పోయినది. బేగంబజారుకున్నూ, షహరుకున్నూ నడమ ఆ నది దాటుటకు పూర్వకాలమందు తురకలు మంచి రాళ్ళతో అతి బలముగా నొక్క వారధి యేనుగలు మొదలయినవి గుంపుగా నెక్కి పోవడానికి యోగ్యముగా కట్టినారు’ అని హైదరాబాదు గురించి రాశారు. ‘కాశీ పట్టణములో పదివేల యిండ్లున్ను, లక్షమంది ప్రజలున్ను వుందురని తోచుచున్నది. యిక్కడ దొరకని పదార్థము వకటిన్ని లేదు. అందరు దేశభాష అయిన హిందుస్తాన్‌ మాటలాడుచున్నారు’. సుమారు రెండు వందల యేళ్ల కిందటి సామాజిక పరిస్థితులను అవగాహన చేసుకోవడానికి గొప్ప ఉపకరణం ఈ పుస్తకం.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top