గాల్‌బ్లాడర్‌లో రాళ్లు... ఆపరేషన్‌ తప్పదా?

health counciling - Sakshi

గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్‌

నేను నెల రోజుల కిందట జనరల్‌ హెల్త్‌ చెకప్‌ చేయించుకున్నాను. అందులో కడుపు స్కానింగ్‌ చేశారు. ఆ పరీక్షలో నాకు గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఉన్నాయని చెప్పారు. కానీ నాకు కడుపునొప్పి ఎప్పుడూ రాలేదు. కొందరు ఆపరేషన్‌ చేయించుకోవాలని అంటున్నారు. సలహా ఇవ్వండి.
– సందీప్తి, వరంగల్లు

గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఉన్నవారందరికీ ఆపరేషన్‌ చేయాల్సిన అవసరం లేదనేది వాస్తవం. కానీ మీ స్థితిగతులను బట్టి, మీ అవగాహన బట్టి, మీరు ఉండే ప్రాంతంలోని ఆరోగ్య వ్యవస్థ... అంటే స్కిల్డ్‌ సర్జన్, హాస్పిటల్‌ ఉందా లేదా అనే అనేక విషయాలను పరిగణనలోకి తీసుకొని ఈ విషయంలో రోగికి సలహా లేదా సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది. సాధారణంగా దూరప్రయాణాలు చేయాలనుకునేవారికి, హైరిస్క్‌ పేషెంట్స్‌కీ, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండేవారికి... నొప్పి వంటి ఇతరత్రా ఇబ్బందులు లేకపోయినా ఆపరేషన్‌ చేయాల్సి రావచ్చు.

పేగుల్లో టీబీ... తగ్గుతుందా?
నా వయసు 28 ఏళ్లు. కడుపునొప్పి వస్తోంది. బరువు కూడా తగ్గుతున్నాను. దాంతో వైద్యపరీక్షలు చేయించుకున్నాను. చిన్నపేగుల్లో టీబీ ఉందని డాక్టర్‌ అన్నారు. ఆరు నెలలుగా మందులు వాడుతున్నాను. ఇది పూర్తిగా నయమవుతుందా? తెలియజేయండి. – నితీష్, నరసరావుపేట
చిన్నపేగులో టీబీ వచ్చినా మందుల ద్వారా తగ్గించవచ్చు. దానికి ఆరునెలల పాటు మందులు తీసుకోవాల్సి ఉంటుంది. దాదాపుగా అందరికీ తగ్గిపోతుంది. కొంతమందిలో టీబీకి సంబంధించి బ్యాక్టీరియా రెసిస్టెన్స్‌ పెరగడం వల్ల తగ్గకపోవచ్చు. ఇటువంటివారికి ఇప్పటివరకూ ఇస్తున్న మందులు మార్చి, మరో స్థాయి మందులు (సెకండ్‌ లైన్‌ ఆఫ్‌ డ్రగ్స్‌) చాలాకాలం పాటు కొనసాగిస్తారు. ఈ మందులు వేసుకున్నవారిలో కొంతమందికి చిన్నపేగులో ఉన్న పూత దెబ్బతినడం వల్ల కడుపునొప్పి పెరిగే అవకాశం ఉంది. వీరికి సర్జరీ ద్వారా చిన్నపేగులోని కొంతభాగాన్ని తీసివేసి మళ్లీ పేగును సరిదిద్దాల్సి వస్తుంది. ఈ ఆపరేషన్‌ను ల్యాపరోస్కోపీ పద్ధతి ద్వారా చేయవచ్చు. 

డాక్టర్‌ పవన్‌ కుమార్‌ అడ్డాల
కన్సల్టెంట్‌ సర్జికల్‌ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌
సంజీవని పెబెల్స్‌ అడ్వాన్స్‌డ్‌ గ్యాస్ట్రో సెంటర్, గుంటూరు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top