దేవుని ఉద్యమ సారథులు వీళ్ళు...

God chooses someone for his movement - Sakshi

సువార్త

దేవుడు ఉద్యమిస్తే ఎలాంటి దెయ్యమైనా జడిసి తోకముడవాల్సిందే!! మరి దేవుడు ఎప్పుడు ఉద్యమిస్తాడు? ఆ అవసరం ఎందుకొస్తుంది? పాలకుల చేతుల్లో తన ప్రజలు దుర్భరమైన అణిచివేతననుభవిస్తూ, క్రుంగి కృశించి, దిక్కుతోచని నిస్సహాయ స్థితిలో ఉన్నపుడు దేవుడు వారి పక్షంగా ఉద్యమిస్తాడు. ఐగుప్తులో 430 ఏళ్ళ పాటు దుర్భర బానిసత్వంలో మగ్గిన ఇశ్రాయేలీయుల మొర విని దేవుడు మోషే ద్వారా ఉద్యమించి వారి కష్టాలు తీర్చాడు. మిద్యానీయులనే అతిక్రూరమైన శత్రువుల చేతిలో విలవిలలాడుతున్న తన ప్రజల హాహాకారాలు, ప్రార్థనలు విని దేవుడు గిద్యోను అనే మరో విశ్వాసిని ప్రేరేపించి తన ఉద్యమాన్ని సాగించి శత్రువులను మట్టి కరిపించి తన ప్రజలనాదుకున్నాడు.

ఒకటి మాత్రం సత్యం. అత్యంత బలవంతుడైన దేవుడు, తన ప్రజల నిస్సహాయ స్థితిని భరించలేడు, వారినలా చూస్తూ ఉరుకోలేడు. కాకపోతే దేవుని సంకల్పానికి తలవంచే ఒక మోషే, ఒక గిద్యోను వంటి అసమాన విశ్వాసులు ఆయనకు కావాలి. గిద్యోను ఎంతో రోషమున్న వాడు, దేవుడంటే గొప్ప విశ్వాసమున్నవాడు. దేవుని మహిమను, ప్రభావాన్ని ప్రత్యక్షంగా చవి చూసిన గిద్యోను తన పదివేలమంది సైన్యంతో  యుద్ధానికి పోబోతే, ‘నేను నీతో ఉన్నానని తెలిసింది కదా? పదివేలమందితో కాదు, కేవలం మూడువందల మందితో అంత అసంఖ్యాకమైన శత్రువులనెదుర్కో’మన్నాడు.

కావాలంటే శత్రు శిబిరంలోకి రాత్రివేళ మారువేషంలో వెళ్లి శత్రువులు నీ గురించి వాళ్ళేం మాట్లాడుకొంటున్నారో వినమని దేవుడు చెబితే గిద్యోను ఆదే చేశాడు. గిద్యోను దేవుడు చాలా బలవంతుడు, అందువల్ల గిద్యోను ఖడ్గానికి ఎదురు లేదు, అతన్ని ఎదుర్కొనేవారు ఇన్ని లక్షలమందిలో ఒక్కరూ లేరని వాళ్ళు నిస్పృహతో మాట్లాడుకోవడం విన్న గిద్యోను విశ్వాసంలో మరింత బలపడి కేవలం మూడువందలమందితోనే ఎంతో వ్యూహాత్మకంగా యుద్ధం చేసి శత్రువులను మట్టి కరిపించి ఘన విజయం సాధించాడు. శత్రువులు తమ ధనబలం, జనబలం, కండబలాన్ని చూసి అతిశయిస్తే, దేవుడెన్నుకున్న విశ్వాసులు తమ దేవుని బట్టి మాత్రమే అతిశయిస్తారు. ఆ యుద్ధంలో గిద్యోను సాధించిన ఘన విజయంతో ఇశ్రాయేలీయులు ఎన్నో ఏళ్ళు శాంతి సౌఖ్యాలు, ఆనందంతో జీవించారు.

దేవుని ఉద్యమాల పర్యవసానమెప్పుడూ సర్వజన కల్యాణం, అసహాయులు, నిరుపేదల ఆనందమే!! బలహీనులు, అసహాయులైన తన ప్రజలనాదుకోవడానికి దేవుడెప్పుడూ సంసిద్ధుడే. అందుకాయన తన కోసం కొందరిని ప్రత్యేకించుకొని వారికి శ్రమల ద్వారా శిక్షణనిచ్చి తన ప్రజల సంరక్షణార్థం, వారి సంక్షేమం కోసం వాడుకొంటాడు. దేవుని పక్షంగా దీనప్రజల సంక్షేమం కోసం దేన్నైనా  చెయ్యడానికి సదా సంసిద్ధులైన నిస్వార్థపరులను దేవుడు పురికొల్పి ఉద్యమ నాయకత్వాన్ని వారికిచ్చి నడిపిస్తాడు. దేవుడు అలాంటి వ్యక్తుల ద్వారానే తన గొప్ప కార్యాలు చేసి ప్రజలకు ఉరటనిస్తాడు. ‘స్పందించే సున్నిత హృదయం, ఆశ్రితులను ఆదుకునే బలమైన చేతులు’ దేవుడు తానెన్నుకున్న వాళ్ళకిచ్చే బహుమానాలు.

దేవుడు ఉద్యమిస్తే ఆశీర్వాదాల ప్రవాహమే!!..కోట్లాదిమందిలో దేవుడు తన ఉద్యమం కోసం ఎవరో ఒకరినే ఎన్నుకుంటాడు, తన పనిని అతని ద్వారా సంపూర్ణంగా నెరవేరుస్తాడు.  అప్పటి మోషే, గిద్యోను, దావీదు.. నిన్నటి ఒక మార్టిన్‌ లూథర్, డి.ఎల్‌. మూడీ, లివింగ్‌స్టన్, జార్జి ముల్లర్‌... వీళ్లంతా ప్రజల కష్టాలు, కన్నీళ్లకు దేవుడు కనుగొన్న పరిష్కార ద్వారాలు, దేవుని అభిషేక సాధనాలు, గుండెల్లో ప్రజల పట్ల ప్రేమ ఊటలున్న అత్యంత సాత్వికులు... ప్రజల సంకటాలను, దేవుని కళ్ళతో చూసి, దేవుని మనసుతో అర్ధం చేసుకొని, దైవాదేశాలతో, దైవిక శక్తితో ఎన్నో కష్టాలకోర్చి ప్రజలనాదుకున్న దైవాశీర్వాదాల ప్రవాహం వాళ్ళు... ప్రజలంతా వారికోసం ఎంతగా ప్రార్ధిస్తే వారి ప్రయత్నాలు అంతగా ఫలిస్తాయి. దేవుడు వాడుకునే ఆ సేవకులకు,సేవకుల కుటుంబాలకు కూడా భద్రతకు, ఆరోగ్యానికి, ఆశీర్వాదాలకు కొరత ఉండదు. యుగ యుగాలూ దేవునికే మహిమా, ఘనత, ప్రభావాలు...
– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్‌
Email: prabhukirant@gmail.com

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top