సాయం చేసి మరచిపో!

సాయం చేసి మరచిపో!


జెన్‌పథం



ఓ శిష్యుడు గురువు వద్దకు వచ్చి, నమస్కరించి ‘‘నాకిప్పుడు బోలెడు సంపద లభించింది. దానినేం చేయాలి? మీరు ఏం చెప్తే అది చేస్తాను. ఏం చేస్తే నా మనసుకి ఆత్మకు ప్రశాంతత, ఆనందం కలుగుతుందో చెప్పండి... చేస్తాను’’ అన్నాడు శిష్యుడు. కొన్ని రోజుల తర్వాత రా. చెప్తాను’’ అన్నారు గురువుగారు. శిష్యుడు వారం పది రోజుల తర్వాత గురువు దగ్గరకు తిరిగొచ్చాడు.  అప్పుడు గురువు ఇలా చెప్పారు – ‘‘నీకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. నీ సంపదను నువ్వే ఖర్చు చేస్తే అందువల్ల నీకు ఎలాటి ప్రయోజనమూ ఉండదు. పోనీ బంధువులకూ మిత్రులకూ ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోతుంది.



అలాగని ఆలయాలకో మరి దేనికో ఇస్తే అక్కడి నిర్వాహకుల ధనాశకు మేత పెట్టినట్టు అవుతుంది. అంతా పేదలకు ఇచ్చావనుకో నీకు తృప్తి కలుగుతుందనడంలో సందేహం లేదు. కానీ నీలో పోను పోను ‘నేనేగా చేసాను అంతటి పనిని’ అంటూ అహం పెరిగి దానితోపాటు గర్వం ఎక్కువైతే అది నీ వ్యక్తిత్వానికి, పురోగతికి అడ్డుకట్టు అవుతుంది, నిన్ను దెబ్బ తీస్తుంది. ఆ దెబ్బతో నువ్వు దిగజారిపోతావు...’’ అన్నారు గురువు. అయితే మరేం చెయ్యమంటారు చెప్పండి. మీరు చెప్పినట్టే చేస్తాను’’ అన్నాడు శిష్యుడు. ‘నిరుపేదలకు ఇచ్చేసెయ్‌. దానితో వారికి ఆనందం కలుగుతుంది. కానీ నువ్వు వారికి ఇచ్చాననుకున్న విషయాన్ని మరచిపో. సహాయం చేసిన వారికి గుర్తు పెట్టుకోనక్కర లేదు. సహాయం పొందిన వారు మరచిపోకుండా ఉంటే చాలు’’ అన్నారు గురువు.

– యామిజాల జగదీశ్‌ 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top