విద్యార్థుల కోసం ప్రపంచ కథాసాహిత్యం

విద్యార్థుల కోసం  ప్రపంచ కథాసాహిత్యం


విద్యార్థుల చేతుల్లోంచి సెల్‌ఫోన్ లాగి పక్కన పెట్టాలి. ఇంటర్నెట్ కేఫుల్లో గంటల తరబడి చూసే అక్కరలేని సైట్ల చెర నుంచి విడిపించాలి. ఏది మంచి ఏది చెడు విడమర్చి చెప్పే స్నేహితుణ్ణి పరిచయం చేయాలి. బావి నుంచి బయట పడేసి విశాలమైన సముద్రంలో ముంచి తీయాలి. వ్యక్తిత్వం అలవర్చాలి. సంస్కారం నూరిపోయాలి. విలువల కోసం నిలబడేలా చేయగలగాలి.



ఇందుకు మార్గం? సాహిత్యమే.



గతంలో పాఠకుల కోసం, స్కూలు విద్యార్థుల కోసం అనేక పుస్తకాలు వెలువరించిన సాకం నాగరాజ తాజాగా కాలేజీ విద్యార్థుల కోసం ప్రపంచ కథా సాహిత్యాన్ని ఒక చోట చేర్చి పుస్తకంగా వెలువరించారు. అమ్మడానికి కాదు. పంచి పెట్టడానికి. పది మంది చదివి ఇద్దరు అందుకున్నా చూసి సంతోష పడటానికి. జీవితంలో పైకొచ్చినవారంతా ఏదో ఒక దశలో పుస్తకాలను ఆలంబనగా చేసుకున్నవారే. మన పిల్లలకు ఇప్పటి నుంచే ఎందుకు వాటిని అలవాటు చేయకూడదు? ఇది సాకం ఆలోచన.



 నోబెల్ ప్రైజ్ అందుకున్న ఆలిస్ మన్రో, బెర్నార్డ్ షా, పెర్ల్ ఎస్.బక్, హెమింగ్వే, కామూ, సార్త్,్ర మార్క్వెజ్, ఆక్టేవియో పాజ్ తదితరుల కథలతో పాటు నోబెల్ ప్రైజ్ రాకపోయినా అంతకు ఏ మాత్రం తక్కువ కాని మార్క్ టై్వన్, ఎడ్గార్ అలెన్ పో, దోస్త్‌విస్కీ, టాల్‌స్టాయ్, ఓ.హెన్రీ, మాక్జిం గోర్కి, జాక్ లండన్... వీళ్లందరి కథలూ ఉన్నాయి.

 లెక్చరర్లు, ప్రిన్సిపాళ్లు దీనిని పరిశీలించి విద్యార్థులకు చేరవేయదగ్గ పుస్తకం ఇది.

 

 ప్రపంచ కథా సాహిత్యం; సంకలనం: సాకం నాగరాజ,

 వాకా ప్రసాద్; వెల: ఉచితం; ప్రతులకు: 94403 31016

 (జనవరి 11 ఆదివారం ఉదయం తిరుపతిలో ఈ పుస్తకం ఆవిష్కరణ జరగనుంది. వేదిక:  సబ్‌రిజిస్ట్రార్స్ అతిథిగృహం)

 

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top