అమ్మాయి ఎప్పుడూ  నిరాశతోనే... చికిత్స చెప్పండి 

Family health counselling - Sakshi

హోమియో కౌన్సెలింగ్స్‌

మా అమ్మాయి వయసు 22 ఏళ్లు. ఆమె గత కొంతకాలంగా ఎప్పుడూ పరధ్యానంగానే  ఉంటోంది. ఎవరితో సరిగా మాట్లాడదు.  ఒకవేళ మాట్లాడినా ఆ మాటలెప్పుడూ  నిరాశపూరితంగా ఉంటున్నాయి. ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటోంది. ఆమె సమస్యకు ఏమైనా మందులున్నాయా?  – డి. జయలక్ష్మి, భీమవరం 
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ అమ్మాయి డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. డిప్రెషన్‌కు లోనైనవారు ఎప్పుడూ విచారం, నిస్సహాయత, అపరాధభావం, నిరాశలలో ఉంటారు. భావోద్వేగాలు మారుతుంటాయి. శారీరకంగానూ కొన్నిమార్పులు కనిపిస్తాయి. అకస్మాత్తుగా బరువు కోల్పోవడం లేదా పెరగడం, చికాకు పడుతుండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరు నిర్దిష్టంగా కొన్ని కాలాలలో డిప్రెషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. ఈ వ్యాధితో బాధపడేవారు పూర్తి డిప్రెషన్‌లోకి కూరుకుపోయేలోపే చికిత్స అందించడం మంచిది. హోమియో విధానంలో దీనికి మంచి చికిత్స ఉంది. డిప్రెషన్‌ను రెండు రకాలుగా చెప్పవచ్చు. మొదటిది వంశపారంపర్యంగా వచ్చేది. రెండోది న్యూరోటిక్‌ డిప్రెషన్‌. ఇవి... మన చుట్టూ ఉండే వాతావరణం, సంఘంలో అసమానతలు, ఉద్యోగం కోల్పోవడం, ఎవరైనా దగ్గరివాళ్లు దూరం కావడం లేదా చనిపోవడం, తీవ్రస్థాయి మానసిక వేదన... వంటి ఎన్నో అంశాల వల్ల రావచ్చు. వివిధ పరిశోధనల ద్వారా ఈ ఆధునిక కాలంలో దీన్ని  డిప్రెసివ్‌ డిజార్డర్‌గా

పేర్కొన్నారు. దీనిలో రకాలు : 
మేజర్‌ డిప్రెషన్‌ : ఇందులో డిప్రెషన్‌ లక్షణాలు తీవ్రస్థాయిలో ఉంటాయి. ఆకలి లేకపోవడం, నిద్రలేకపోవడం, పనిలో శ్రద్ధ లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 
డిస్థిమిక్‌ డిజార్డర్‌ : రోగి తక్కువస్థాయి డిప్రెషన్‌లో దీర్ఘకాలం పాటు ఉంటాడు. అయితే కొన్నిసార్లు రోగి నార్మల్‌గా ఉన్నట్లుగా అనిపించి, తిరిగి డిప్రెషన్‌ లక్షణాలు కనిపిస్తాయి. 
∙సైకియాట్రిక్‌ డిప్రెషన్‌ :  డిప్రెషన్‌తో పాటు భ్రాంతులు కూడా కనిపిస్తుంటాయి. 
∙పోస్ట్‌ నేటల్‌ డిప్రెషన్‌ :  మహిళల్లో ప్రసవం తర్వాత దీని లక్షణాలు కనిపిస్తుంటాయి. 
సీజనల్‌ ఎఫెక్టివ్‌ డిప్రెషన్‌ : సూర్యరశ్మి తగ్గడం వల్ల కొంతమందిలో సీజనల్‌గా డిప్రెషన్‌ లక్షణాలు కనిపిస్తుంటుంది. 
బైపోలార్‌ డిజార్డర్‌ : ఈ డిప్రెషన్‌లో కొంతమంది పిచ్చిగా, కోపంగా, విపరీతమైన ప్రవర్తనను కనబరుస్తుంటారు. కొంత ఉద్రేకం తర్వాత నార్మల్‌ అయిపోతారు.  హోమియో వైద్యవిధానంలో నేట్రమ్‌మూర్, ఆరమ్‌మెట్, సెపియా, ఆర్సినిక్‌ ఆల్బ్, సిమిసిఫ్యూగో వంటి మందులు డిప్రెషన్‌ తగ్గించడానికి బాగా పనిచేస్తాయి. 
డాక్టర్‌ కె. శ్రీనివాస్‌ గుప్తా, ఎండీ (హోమియో), 
స్టార్‌ హోమియోపతి, హైదరాబాద్‌ 

మెడనొప్పి  చేతుల వరకూ పాకుతోంది...  పరిష్కారం చెప్పండి

నా వయసు 52 ఏళ్లు. నేను కొంతకాలంగా తీవ్రమైన మెడనొప్పితో బాధపడుతున్నాను. అది చేతుల వరకూ పాకుతోంది. చేతులు... ముఖ్యంగా చేతివేళ్లు బలహీనంగా అనిపిస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే మెడ భాగంలోని ఎముకలు అరుగుదలకు గురయ్యాయని చెప్పారు. హోమియోతో నా సమస్యకు పూర్తి పరిష్కారం లభిస్తుందా?  – ఎల్‌. జగన్నాథరావు, నెమ్మికల్‌ 
మెడ భాగంలోని వెన్నెముక డిస్కులు, ఫేసెట్‌ జాయింట్స్‌లోని మృదులాస్థి క్షీణతకు గురికావడాన్ని సర్వైకల్‌ స్పాండిలోసిస్‌ అంటారు. గతంలో పెద్దవారిలో కనిపించినా,  జీవనశైలిలో మార్పులు రావడం వల్ల ఇప్పుడిది చిన్న వయసు వారిలోనూ ఎక్కువగా కనిపిస్తుంది. 
కారణాలు : 
∙వయసు పెరగడం, వ్యాయామం లేకపోవడం ∙క్షీణతకు గురైన ఎముకలు అదనంగా పెరగడం      డిస్కులు జారిపోవడం లేదా చీలికలకు గురికావడం ∙వృత్తిరీత్యా అధిక బరువులు మోయడం ∙ఎక్కువ సమయం పాటు మెడను అసాధారణ భంగిమలో ఉంచడం ∙ఎక్కువ సేపు కంప్యూటర్‌పై పనిచేయడం, ఎక్కువ సమయం మెడను వంచి ఫోన్‌లలో మాట్లాడటం 
∙ఎల్తైన దిండ్లు వాడటం ∙మెడకు దెబ్బతగలడం 
∙మెడకు శస్త్రచికిత్స జరిగి ఉండటం ∙తీవ్రమైన మానసిక ఒత్తిడి, అధిక బరువు, పొగతాగే అలవాటు, జన్యుపరమైన కారణాలతో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. 
లక్షణాలు :
∙సాధారణం నుంచి తీవ్రస్థాయి మెడనొప్పి 
∙నొప్పి మెడ నుంచి భుజాలకు, చేతులకు, వేళ్లకు పాకడం ∙మెడ బిగుసుకుపోవడం ∙తలనొప్పి, తల వెనక భాగంలో మొదలై నుదురు వరకు వ్యాపించడం ∙నరాలపై ఒత్తిడి పడి, చేతులలో సూదులు గుచ్చినట్లుగా అనిపించడం, చేతులు మొద్దుబారడం, సత్తువ కోల్పోవడం ∙చిన్న బరువునూ ఎత్తలేకపోవడం ∙నడకలో నిలకడ కోల్పోవడం వంటి లక్షణాలు గమనించవచ్చు. 
హోమియో చికిత్స :
 జెనెటిక్‌ కాన్‌స్టిట్యూషన్‌ చికిత్స విధానం ద్వారా రోగి మానసిక, శరీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందించడం వల్ల మెడనొప్పిని పూర్తిగా నయం చేయవచ్చు. వెన్నెముకను దృఢంగా చేయడం ద్వారా సర్వైకల్‌ స్పాండిలోసిస్‌ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు. 
డాక్టర్‌ శ్రీకాంత్‌ మొర్లావర్, సీఎండీ, 
హోమియోకేర్‌ ఇంటర్నేషనల్, హైదరాబాద్‌ 

బాబుకు  ఆటిజమ్‌...  అది  తగ్గుతుందా? 
మా బాబుకు మూడేళ్లు. వయసుకు తగినట్లుగా ఎదుగుదలగానీ, వికాసం గానీ  కనిపించలేదు. డాక్టర్‌ దగ్గరికి వెళ్తే ఆటిజమ్‌ అంటున్నారు. హోమియోలో చికిత్స సాధ్యమేనా?   – ఆర్‌. సీతాలక్ష్మి, అనకాపల్లి 
ఆటిజమ్‌ అనే రుగ్మత ఇటీవల పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తోంది. దీని తీవ్రతలో చాలా తేడాలతో పాటు, ఎన్నో లక్షణాలు, వాటిల్లో తేడాలు కూడా కనిపిస్తుంటాయి. కాబట్టి దీనితో బాధపడేవారందరిలోనూ ఒకేలాంటి లక్షణాలు ఉండకపోవచ్చు. ఆటిస్టిక్‌ డిజార్డర్‌ అనేది ఆటిజంలో ఎక్కువగా కనిపించే సమస్య. మగపిల్లల్లో ఎక్కువ. రెట్స్‌ డిజార్డర్‌ అనే అరుదైన రకం ఆడపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. చైల్డ్‌హుడ్‌ డిసింటిగ్రేటెడ్‌ డిజార్డర్‌ అనేది ఆటిజమ్‌లో ఒక తీవ్రమైన సమస్య. యాస్పర్జస్‌ డిజార్డర్‌లో పిల్లల్లో తెలివితేటలు ఎక్కువగా ఉండి, వారు తదేకంగా చేసే పనులలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ఇలా దీనిలో చాలా రకాలు ఉంటాయి. ఇది మెదడు సరిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల వస్తుంది. ఈ వ్యాధికి నిర్దిష్టమైన ఒకే కారణం గాక అనేక అంశాలు దోహదపడుతుండవచ్చు.  మెదడు ఎదుగుదలకు తోడ్పడే జన్యువులు, అందులో స్రవించే సెరటోనిన్, డోపమిన్‌ వంటి రసాయనాలు ఇలా ఎన్నో అంశాలు దీనికి కారణం కావచ్చు. గర్భిణిగా ఉన్నప్పుడు తల్లి తీవ్రమైన ఉద్వేగాలకు లోనుకావడం, తల్లిదండ్రులు పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడపలేకపోవడం వల్ల కూడా ఇది రావచ్చు. పిల్లల్లో దీన్ని గుర్తించడానికి తోడ్పడే అంశాలు... ’ అకారణంగా ఎప్పుడూ ఏడుస్తూ ఉండటం ’ నలుగురిలో కలవడలేకపోవడం ’ ఆటవస్తువుల్లో ఏదో ఒక భాగంపైనే దృష్టి కేంద్రీకరించడం ’ వయసుకు తగినంత మానసిక పరిపక్వత లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆటిజమ్‌ ఉన్న పిల్లలకు లక్షణాలు బట్టి చికిత్స ప్రారంభించాల్సి ఉంటుంది. మాటలు సరిగా రానివారిని స్పీచ్‌ థెరపీ ఉపయోగకరంగా ఉంటుంది. బిహేవియర్‌ థెరపీ కూడా దీనితో బాధపడే పిల్లల్లో మార్పు తీసుకురావడానికి సహాయపడుతుంది. పిల్లల వ్యక్తిగత లక్షణాలు బట్టి, కుటుంబ, సామాజిక పరిస్థితులను అవగాహనలోకి తీసుకొని, మూలకారణాలను అన్వేషించి చికిత్స చేయాల్సి ఉంటుంది. పిల్లల్లో ఆటిజమ్‌ వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స వ్యవధి ఉంటుంది. సరైన హోమియోపతి మందులను అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో వాడితే పిల్లలు నార్మల్‌ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. 
డాక్టర్‌ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, 
పాజిటివ్‌ హోమియోపతి, హైదరాబాద్‌ 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top