ఈ కాంటాక్ట్‌ లెన్స్‌లతో మెరుగైన చూపు!

Eye E Contact Lence For Better Visual - Sakshi

కంటిచూపును ఎన్నోరెట్లు ఎక్కువ చేయగల అద్భుతమైన సరికొత్త కాంటాక్ట్‌ లెన్స్‌లను తయారు చేసింది ఫ్రాన్స్‌కు చెందిన ఐఎంటీ ఆట్లాంటిక్‌ సంస్థ!! కేవలం దృష్టి సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా.. కంటిముందు ఉన్న దృశ్యాలను దూర ప్రాంతాలకు ప్రసారం చేసేందుకూ దీనిని ఉపయోగించవచ్చు. చిన్నసైజు ఫ్లెక్సిబుల్‌ బ్యాటరీ కూడా ఉన్న ఈ కాంటాక్ట్‌ లెన్స్‌లో సూక్ష్మస్థాయి ఎల్‌ఈడీ బల్బు ఒకటి ఉంటుంది. కొన్ని గంటలపాటు పనిచేయగలదు. ఈ కాంటాక్ట్‌ లెన్స్‌ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే యుద్ధరంగంలోని సైనికులకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని అంచనా. ఈ కారణంగానే అమెరికాకు చెందిన రక్షణ, పరిశోధన సంస్థ డార్పా ఇలాంటి కాంటాక్ట్‌ లెన్స్‌ల కోసం దశాబ్ద కాలంగా ప్రయత్నాలు చేస్తోంది.

ఈ శతాబ్దపు పదార్థంగా భావిస్తున్న గ్రాఫీన్‌ ఆధారంగా ఇందులోని ఎలక్ట్రానిక్‌ పరికరాలను తయారు చేశారని భావిస్తున్నారు. మరిన్ని పరిశోధనల ద్వారా లెన్స్‌ సామర్థ్యాన్ని పెంచవచ్చునని... సైనికులతోపాటు దృష్టి సమస్యలున్న డ్రైవర్లు, శస్త్రచికిత్సలు చేసే సమయంలో డాక్టర్లు కూడా ఈ లెన్స్‌లను వాడవచ్చునని ఐఎంటీ ఆట్లాంటీక్‌ అంటోంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న కారణంగానే ఒకవైపు అమెరికా రక్షణ పరిశోధన సంస్థ ఇంకోవైపు మైక్రోసాఫ్ట్‌ వంటి దిగ్గజ కంపెనీలు ఐఎంటీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. మైక్రోసాఫ్ట్‌ ఇటీవలే తన హాలోలెన్స్‌ టెక్నాలజీని అమెరికా సైన్యానికి అమ్మడం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top