మొగసాల | Encapsulate the history of the world | Sakshi
Sakshi News home page

మొగసాల

Published Mon, Jan 19 2015 10:57 PM | Last Updated on Sat, Sep 2 2017 7:55 PM

మొగసాల

టూకీగా ప్రపంచ చరిత్ర

 
మొత్తంగా చూస్తే అప్పటి ప్రపంచం - పువ్వులు లేని చెట్లూ, పక్షులు లేని అడవులూ, గొంతులు లేని  కీటకాలతో అతి నిశ్శబ్దమైన తరగతి గది వంటిది.
 
అత్యంత పురాతనమైన శిలల్లో జీవపదార్థం గోచరించకపోవడానికి కారణం ఆ కాలానికి జీవపదార్థం ఏర్పడకపోవడమైనా కావచ్చు, లేదా అప్పటి జీవపదార్థం అతి సూక్ష్మమైందీ, అవశేషాలు మిగల్చలేనంత సున్నితమైనదీ అయ్యుండొచ్చు. ఈ పొర వయస్సు దాదాపు 500 కోట్ల సంవత్సరాలు. జీవపదార్థం దొరకని కారణంగా వీటిని ‘ఎజోయిక్’ శిలలు అన్నారు. జీవచర్య వల్ల ఏర్పడే గ్రాఫైటు, ఐరన్ ఆక్సైడు వంటి పదార్థాలు వాటిల్లో ఉన్న కారణంగా ఆ పేరును కొందరు శాస్త్రజ్ఞులు ఆమోదించలేదు. వాళ్ళు దాన్ని ‘ఆర్కిజోయిక్’ శిలలు - అంటే, అత్యంత ప్రాథమిక జీవశిలలు- అన్నారు.

జీవుల ఉనికికి తిరుగులేని ఆనవాళ్ళు దొరికిన రెండవ పొరను ‘ప్రొటోజోయిక్’ శిలలు అన్నారు. ఈ యుగం సుమారు 200 కోట్ల సంవత్సరాలకు ముందు మొదలై 150 కోట్ల సంవత్సరాలదాకా కొనసాగింది. జంతుజాతికి సంబంధించిన ‘రేడియోలేరియా’, వృక్షజాతికి మూలమైన ‘ఆల్గే’ వంటి ఏకకణజీవుల ఆనవాళ్ళు ఈ శిలల్లో దొరకడమేగాక, పూడు మీద ప్రాకే సూక్ష్మజంతువుల జాడలు కూడా కనిపించాయి. తరువాతి కాలంలోని జీవులతో పోలిస్తే, ఈ దశలో జీవుల విస్తృతిగానీ, వైవిధ్యం (వెరైటీ)గానీ మందకొడిగా కనిపిస్తుంది. బహుశా, భూగోళం మీద నిలదొక్కుకునేందుకు జీవపదార్థం చేసిన 150 కోట్ల సంవత్సరాల సుదీర్ఘ సంఘర్షణ చరిత్ర అందులో దాగుందోయేమో!

50 కోట్ల సంవత్సరాల నాడు మొదలై సుమారు 28 కోట్ల సంవత్సరాలు కొనసాగిన మూడవయుగం పొరలను ‘ప్యాలియోజోయిక్’ పొర- అంటే, ‘పురాతన జీవం’ పొర- అంటారు. భూమి వాతావరణం జీవరాశుల మనుగడకు మరింత అనుకూలంగా మారడం మూలంగానో ఏమో, జీవుల విస్తరణ ఈ యుగంలో ఒకమోస్తరుగా పెరిగింది. వివరణ కోసం ఈ యుగాన్ని ఏడు శకాలుగా విభజించారు కానీ, అంత విస్తారమైన వివరణతో మనకు పనిలేదు గనక, దీన్ని రెండు ఘట్టాలుగా చర్చించుకుందాం. శిలలు అడుగుపొర తొలిఘట్టానిది. ఈ దశలో పూడుమీద పాకే ‘ట్రైలోబేట్’ తదితర రెక్కలు లేని పురుగులూ, గవ్వచేపలూ, పీతలూ పుట్టుకొచ్చాయి. అవయవ నిర్మాణంలో బాగా ముందంజ వేసిన ‘సముద్రపు తేలు’ వాటిల్లో ఉంది. ఆ తేలుజాతిలో కొన్నిరకాలు తొమ్మిది అడుగుల పొడవుదాకా పెరిగాయి. జంతుసామ్రాజ్యం నుండి స్పష్టంగా విడిపోయి, నీటిమీద తేలాడే ‘పాచి’ వంటి వృక్షజాతులు ఆవిర్భవించాయి. పోగుకు పోగు ముడివేసుకుని సముద్రం మీద గడ్డిపోచల్లా తేలే జంతువులు తయారయ్యాయి. అయితే, ఈ జంతువుల్లో ఏవొక్కదానికి వెన్నెముక ఏర్పడలేదు. వృక్షజాతిలో కూడా కాండానికి గట్టిదనం సమకూర్చే ‘నార’ (ఫైబర్) ఏర్పడలేదు. ఆ కాలంలో నివసించిన జంతువులైనా మొక్కలైనా నిరంతరం నీటిని ఎడబాయకుండా బతకవలసిందే తప్ప, ఒడ్డున నిలిచే సామర్థ్యం సంపాదించుకోలేదు. కొత్తరకాలు పుట్టుకురావడం, మయం (సైజు) పెరగడం మినహాయిస్తే, ముందటి యుగంతో పోలిస్తే చురుకుదనంలో చెప్పుకోదగ్గ మార్పు ఈ జీవుల్లో కనిపించదు. వేగంగా పారాడగలిగిన పురుగూ లేదు, చలాకీగా ఈదగలిగిన చేపా లేదు. జీవులన్నీ నీటిని వదలని కారణంగా, ఆనాటి నేల ఒక నిప్పచ్చర ప్రదేశం. అప్పటి సముద్రాల్లో ఉన్నవి ఇప్పటి సముద్రాల్లోలాగా ఉప్పునీళ్ళు కాదనే సంగతి మరికొంతకాలం గడిచేదాకా మనం గుర్తుంచుకోవాలి.

రెండవ ఘట్టంలో కొల్లలు కొల్లలుగా వెన్నెముక గల చేపరకాలూ, నీటిలోపలా బయటా మనగలిగే కప్పవంటి ఉభయచరాలూ, తండోప తండాలుగా నేలమీద తిరిగే పలురకాల రెక్కల పురుగులూ రూపం తీసుకున్నాయి. వృక్షజాతులు చిత్తడినేలలకు పాకి అరణ్యాలుగా విస్తరించడం మొదలెట్టాయి. వాటి కాండంలో నారపోగులు ఏర్పడి, అవి నిటారుగా, దృఢంగా నిలబడేందుకు వీలు కలిగించాయి. అయితే, ఆ చెట్లన్నీ ‘ఫెర్న్’ జాతికి చెందిన అధమస్థాయివే తప్ప, ఇప్పటి చెట్లలాగా పువ్వులు పూచేవీ ఆకులు రాల్చేవీగావు. వాటిల్లో కొన్ని రకాల పెరుగుదల ఇప్పటి వృక్షాల పరిమాణానికి ఏమాత్రం తీసిపోదు. ఈనాటి గనుల్లో బొగ్గుగా దొరుకుతున్న సరుకంతా వాటిదేనంటే, ఆ చెట్లు ఎంత పెద్దవిగా ఉండేవో ఊహించుకోవచ్చు.

ఈ యుగం ముగిసేముందు రెప్టైల్స్ (సరీసృపాలు) ఉనికిలోకి వచ్చాయి. శ్వాస ద్వారా ప్రాణవాయువును గ్రహించే ఊపిరితిత్తులను సంతరించుకుని, ఇవి నేలను ఆశ్రయించిన జంతువులు. పొట్టమీద ప్రాకేవే కాకుండా నాలుగు కాళ్ళమీద నడిచే ‘తొండ’ వంటి రెప్టైల్స్ కూడా అదే సమయంలో కనిపిస్తాయి. మొత్తంగా చూస్తే అప్పటి ప్రపంచం - పువ్వులు లేని చెట్లూ, పక్షులు లేని అడవులూ, గొంతులు లేని కీటకాలతో అతి నిశ్శబ్దమైన తరగతి గది వంటిది. కనీసం కుందేలు పరిమాణంలోవుండే జంతువైనా నేలమీద కనిపించదు. సముద్రతీరాలవెంట, పరిమితంగా విస్తరించిన ప్రాణం మినహాయిస్తే, మిగతా నేలంతా అప్పటికీ నిప్పచ్చరమే.
 ప్రాణుల ప్రాపకంలో నిమగ్నమై, భూగోళం స్థితిగతుల గురించిన చర్చ మధ్యలో వదిలేశాం. ప్యాలియోజోయిక్ యుగం ముగిసేదాకా కూడా భూగోళం సంసారం ఒరగడ్డంగానే సాగింది. ఎక్కడో పేలిపోయిన నక్షత్రాల ముక్కలు వందలమైళ్ళ విస్తీర్ణం కలిగిన నిప్పుకణాలుగా భూమిని ఢీకొని, ప్రళయ భయంకరమైన ఉపద్రవాలు కలిగించేవి. వాటి ఆగడానికి జీవరాసిలో తొంభైశాతానికి పైగా నశించేది. ఎక్కడబడితే అక్కడ లావా ఉప్పొంగి, కొత్త నేలలకు మాతృత్వం నెరిపే ప్రక్రియలోకూడా జీవులకు ప్రమాదం ఎదురయ్యేది. ఇప్పుడు మనం అనుభవిస్తున్న బొగ్గుగనుల నిక్షేపాలు ఆనాడు భూగోళాన్ని అతలాకుతలం చేసిన భూకంపాల ప్రసాదమే. ఇలాంటి అవాంతరాలన్నిటినీ ఎదిగొచ్చింది. ఆ ఎదుగుదల ప్రస్థానంలో నాలుగవ అంచెను సూచించేవి ‘మీసోజోయిక్’ శిలలు, ఐదవ అంచెకు ప్రాతినిధ్యం వహించేవి ‘సీనోజోయిక్’ శిలలు. వాటిని గురించి ముందు ముందు తెలుసుకుందాం.

 

రచన: ఎం.వి.రమణారెడ్డి
 

Advertisement
 
Advertisement
 
Advertisement