ఒక కుటుంబం ఆరు చపాతీలు.. | Eldeco Green Midge Society From UP Helping Towards Migrant workers In Lockdown | Sakshi
Sakshi News home page

ఒక కుటుంబం ఆరు చపాతీలు..

Jun 1 2020 4:15 AM | Updated on Jun 1 2020 4:15 AM

Eldeco Green Midge Society From UP Helping Towards Migrant workers In Lockdown - Sakshi

లాక్‌డౌన్‌లో వలస కార్మికులకు, ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వడానికి ఎంతో సేవాగుణం గలవారు చేస్తున్న సాయం గురించిన కథనాలు వింటున్నాం. చూస్తున్నాం. నోయిడాకు చెందిన ఎల్డికో గ్రీన్‌ మిడ్జ్‌ సొసైటీ మహిళలు మరో ప్రత్యేకమైన చొరవ తీసుకొని వలస కార్మికులకు, తమ ఇళ్లకు చేరుకోలేని వారికి  పేదప్రజలకు సాయం చేస్తున్నారు. ప్రతి ఇంటి నుండి ఆరు చపాతీలను సేకరించి పేదలకు పంచుతున్నారు. 

ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడాలో ఎల్డికో గ్రీన్‌ మిడ్జ్‌ సొసైటీ భవన సముదాయాలలో నివసిస్తున్న మహిళలు పేదలకు ఏ విధంగానైనా సహాయం చేయాలనుకున్నారు. వారుంటున్న రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌లలో దాదాపు 8వేల కుటుంబాలు నివసిస్తున్నాయి. ప్రతిరోజూ 100 ఇళ్లలో ఒక్కో కుటుంబం నుంచి ఆరు రొట్టెలను సేకరించడం మొదలుపెట్టారు. ఆ విధంగా సేకరించినదానికి రోటీ బ్యాంకు అని పేరు పెట్టారు. రోటీ బ్యాంక్‌ దగ్గర వివిధరకాల కూరగాయలనూ ఉంచారు. ఇప్పటివరకు వేలాదిమంది పేదలకు ఈ రోటీ బ్యాంక్‌ నుండి సహాయం అందుతోంది.

ఏకాభిప్రాయం
ఈ సొసైటీలో నివసించే సుమితా వైద్య మాట్లాడుతూ ‘ఇక్కడ చాలా మంది మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. వారు తమ కుటుంబాలను చూసుకుంటూనే వివిధ సంస్థలలో కూడా పనిచేస్తారు. లాక్‌డౌన్‌ కారణంగా వలస కార్మికులు ఎన్నో కిలోమీటర్ల దూరం నడుస్తున్నట్లు టీవీ న్యూస్‌ ఛానెళ్లలో చూస్తున్నాం. గ్రేటర్‌ నోయిడా, నోయిడాలో నివసిస్తున్న కార్మికుల బాధాకరమైన వార్తలను చూసి అందరం బాధపడ్డాం. ఆ తరువాత మహిళలందరితో మాట్లాడటం ద్వారా పేదవారికి సహాయం చేయడానికి ఒక ఏకాభిప్రాయం ఏర్పడింది. మహిళలందరూ కలిసి వలస కార్మికులకు ఒక కుటుంబానికి 6 రోటీలు ఇస్తామని నిర్ణయించుకున్నాం. దీనిలో సామాజిక కార్యకర్తల సహాయం కూడా తీసుకున్నాం’ అని వివరించారు.

ఈ పనిలో దిగువ, మధ్య, ఎగువ అని తేడా లేకుండా మహిళలందరూ పాల్గొంటున్నారు. లాక్డౌన్‌ 2.0 నుండి ఈ మహిళలు సృష్టించిన రోటీ బ్యాంక్‌ వేలాది మంది పేదలకు రొట్టెలను పంపిణీ చేసే పని చేస్తూనే ఉంది. గృహిణి అంజలి సింగ్‌ మాట్లాడుతూ – ‘చిన్న పిల్లలున్న కార్మికులను గుర్తించాం. వారు తినడానికి చాలామంది బియ్యం ఇస్తున్నారు. కాని రోటీస్‌ రావడం లేదు. దీనితో ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని వివరించారు. బృందాల వారీగా సేవ సామాజిక కార్యకర్త హరేంద్ర భాటి మాట్లాడుతూ ‘మహిళలందరూ ఉదయం 9 గంటల సమయంలో తమ ఇళ్లలో రోటీలను సిద్ధం చేస్తారు.

ఒక వ్యక్తి పెట్టెను పట్టుకొని ప్రతి ఇంటికీ వెళ్లి బెల్‌ కొడతాడు. ఆ కుటుంబంలో ఉన్న మహిళ రోటీలను ఆ పెట్టెలో ఉంచుతుంది. ఇందుకోసం మహిళలు సొసైటీని మండలాలుగా విభజించి తమను తాము గ్రూపులుగా విభజించుకున్నారు. వారు ఈ బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తున్నారు. మొత్తం సొసైటీ నుండి ఆహారాన్ని సేకరించిన తరువాత మధ్యాహ్నం 12 గంటలకు బాక్స్‌ మెయిన్‌ గేటుకు పంపిస్తారు. ఆకలితో ఉన్నవారికి ఆహారాన్ని అందించేందుకు మరొక బృందం ఆ గేటు వద్దకు చేరుకుంటుంది. ఇలా బృందాలుగా సేవ చేస్తున్న ఎల్డికో గ్రీన్‌ మిడ్జ్‌ సొసైటీ  మహిళలను అందరూ ప్రశంసిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement