గిరుల ఝరి... గీతానాయక్

గిరుల ఝరి... గీతానాయక్ - Sakshi


- మేకల కల్యాణ్ చక్రవర్తి, సాక్షి ప్రతినిధి, నల్లగొండ

గిరిజనవర్గం నుంచి అంచలంచెలుగా ఎదిగి ఏకంగా డాక్టరేట్ దక్కించుకున్న గీతానాయక్ తన పరిశోధనలకు కూడా అణగారిన వర్గాలకు లబ్ధి కలిగించే ఉపాధి హామీ పథకాన్నే అంశంగా ఎంచుకున్నారు. ముఖ్యంగా తనలాంటి గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారతలో ఈ పథకం ఎలాంటి పాత్ర పోషిస్తుందో తెలుసుకోవాలను కున్నారామె. అందుకే నల్లగొండ జిల్లాలో ఉపాధి హామీ పథకం అమలు తీరుపై పరిశోధన చేసి డాక్టరేట్‌ను పొందారు. ఈ సందర్భంగా ఆమె సక్సెస్ స్టోరీ.

గీతానాయక్‌ది నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం కొక్కిరాల గౌరారం. తండ్రి పోలీసుశాఖలో విశ్రాంత ఉద్యోగి. తల్లి గృహిణి. అత్యంత వెనుకబడిన లంబాడ సామాజికవర్గంలో జన్మించిన ఆమె ఐదో తరగతి వరకు స్థానిక ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నారు. ఆరోతరగతి నుంచి, ఇంటర్మీడియట్ వరకు చలకుర్తి క్యాంపు నవోదయ పాఠశాలలో చదువుకున్నారు. వెంటనే ఆమెకు నల్లగొండలోని నాగార్జున డిగ్రీ కళాశాలలో రికార్డు అసిస్టెంట్‌గా ఉద్యోగం లభించింది. ఆ వెంటనే వివాహం కూడా అయిపోయింది. కానీ ఆమెకు ఆ ఉద్యోగం సంతృప్తినివ్వలేదు. ఏదో సాధించాలనే తపనతో అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ ద్వారా డిగ్రీ పూర్తి చేశారు.అక్కడితో ఆగకుండా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) చదివి, ఆ కోర్సులో యూనివర్శిటీ టాపర్‌గా నిలిచారు. పీజీ చేసినా గీతలోని విద్యాకాంక్ష చల్లారలేదు. నెట్ పరీక్ష రాసి జూనియర్ రీసెర్చ్ ఫెల్లోషిప్ సాధించారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కేటగిరీలో ఈ ఘనత సాధించిన ఎస్టీ మహిళల్లో తొలి మహిళ గీతానాయక్. ఫెలోషిప్‌కు వెళ్లాలంటే ఉద్యోగానికి సెలవుపెట్టాలి. అయితే అధికారులు అందుకు అంగీకరించలేదు.జూనియర్ అసిస్టెంట్‌కు పీహెచ్‌డీ అవసరమా అని కామెంట్లు చేసిన వారూ ఉన్నారు. అయినా ఆత్మస్థైర్యంతో లాస్ ఆఫ్ పే తో వెళ్లిపోయారు.  తర్వాత ఉపాధి హామీ పథకం అమలుపై నల్లగొండ జిల్లాలో చేసిన పరిశోధనకు గాను ఆమెకు డాక్టరేట్ లభించింది.  విశేషం ఏమిటంటే... జేఆర్‌ఎఫ్‌కు వెళ్లిన మూడు నెలలకే జూనియర్ లెక్చరర్ ఉద్యోగం, ఆ తర్వాత మూడునెలలకే డిగ్రీ కళాశాల లెక్చరర్ ఉద్యోగం సాధించటం.

 

మహిళల కోసమే...

పరిశోధన కోసం ఉపాధి హామీ పథకాన్నే ఎందుకు ఎంచుకున్నారనే దానికి సమాధానంగా తాను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడి పరిస్థితులు  ముఖ్యంగా గ్రామాల్లోని మహిళలకు ఆర్థిక సాధికారత ఏ మేరకు సాకారమవుతుందనే అంశాలను తెలుసుకునేందుకే ఎంచుకున్నా నంటున్నారు గీతానాయక్. ఈ పథకం అమలులో కొన్ని లోపాలున్నా... మొత్తంమీద మహిళలకు కొంత ఆర్థిక భరోసా లభించిందని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పురుషులతో సమానంగా స్త్రీలకు వేతనం ఇవ్వడమనే విప్లవాత్మక మార్పునకు నాంది పలికిందని సంతృప్తి వ్యక్తం చేశారామె. ఇప్పటి వరకు ఆమె 12 జాతీయస్థాయి సెమినార్లు, రెండు అంతర్జాతీయ సెమినార్లలో పాల్గొని ప్రెజెంటేషన్ ఇచ్చారు.

 

ద్దరు పిల్లలున్నా...

గీతానాయక్ సక్సెస్ స్టోరీ వెనుక ఆమె అకుంఠిత దీక్ష, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, ముఖ్యంగా భర్త చంద్రకాంత్ నాయక్ అండ, అలాగే ఆమె గైడ్ డాక్టర్ వై.పార్థసారథి, ఉద్యోగ సహచరుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎన్.సురేష్, ఫెలో స్కాలర్స్ రమేష్, డాక్టర్ వెంకట రామిరెడ్డిల సహకారం ఎంతగానో ఉన్నాయి. పెళ్లి అయి, ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత కూడా తన చదువుల ప్రస్థానాన్ని ముందుకు సాగించి, లక్ష్యసాధన పూర్తి చేసిన గీతానాయక్‌ను చూస్తే యూత్‌కి రోల్ మోడల్‌గా అనిపిస్తారు. ‘‘వెనుకబడిన వర్గాలు, అణగారిన ప్రజలకు ఆర్థిక వనరుగా ఈ పథకం ఉంది. ఈ పథకం ద్వారా వారి జీవనశైలిలో కూడా మార్పు వచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు ఈ పథకం ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకునేందుకే దీనిపై పరిశోధన చేశా’’

 - డాక్టర్ గీతానాయక్

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top