పిల్లల పెంపకంలో టెన్షన్‌

Discussion About Motherhood Web Series Movie - Sakshi

పిల్లల పట్ల తల్లికి ఉండే ప్రేమను, బాధ్యతను, వాత్సల్యాన్ని కలగలిపి ‘మాతృత్వం’ అంటుంటారు. ఇంగ్లిష్‌లో ‘మదర్‌హుడ్‌’. ఈ మాతృత్వం గొప్పదని, వరమని అంటూ తల్లి చుట్టూ బంధాలు బిగించారా? పిల్లల పెంపకంలో వొత్తిడి మదర్‌హుడ్‌ను మెంటల్‌హుడ్‌గా మార్చిందా? బాలాజీ టెలిఫిల్మ్స్‌ తీసిన కొత్త వెబ్‌సిరీస్‌ ‘మెంటల్‌హుడ్‌’ ఆ విషయాన్నే చర్చిస్తుంది.

భర్తలు బయటికెళ్లి సంపాదించుకుని రావాలి, భార్యలు ఇంటి పట్టున ఉండి పిల్లల ఆలనా పాలనా చూడాలి అనేది అనాదిగా ఉన్న భారతీయ సంప్రదాయం. ‘రోజంతా ఇంట్లో ఉంటావ్‌ కదా... ఏం చేస్తుంటావ్‌?’ అని అనే భర్తలు ఇప్పుడూ ఎప్పుడూ ఉండనే ఉంటారు. భార్యను పుట్టింటికి పంపి, పిల్లలతో ఒకరోజు ఇంట్లో గడిపితే తెలుస్తుంది రోజంతా ఇంట్లో ఉండి భార్య ఏం చేస్తుందో. పిల్లలను రోజూ నిద్ర లేపి, రెడీ చేసి, టిఫెన్లు తినిపించి, స్కూళ్లకు పంపే పని తండ్రులు ఎంతమంది చేస్తారు ఇళ్లల్లో అనేది ఎవరికి వారు ఆలోచించుకుంటే తల్లులు పడే వొత్తిడి తెలిసి వస్తుంది. నిత్య జీవితంలో సమస్యలు అన్నీ సినిమా ఫార్ములాకు తగినట్టుగా ఉండవు. అందుకే చాలా విషయాలు పెద్ద తెర మీద కనిపించవు. థ్యాంక్స్‌ టు వెబ్‌ సిరీస్‌. వెబ్‌ కంటెంట్‌కు డిమాండ్‌ పెరిగిన నేపథ్యంలో రకరకాల స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌ వచ్చాక తప్పనిసరై ఇంటి సమస్యల పై కూడా దృష్టి పడుతోంది. ఇప్పుడు తాజాగా బాలాజీ టెలిఫిల్మ్స్‌ ఏక్తా కపూర్‌ నిర్మాణంలో ‘మెంటల్‌హుడ్‌’ వెబ్‌ సిరీస్‌ను తయారు చేసింది. మార్చిలో ‘జీ5’లో ఈ సిరీస్‌ టెలికాస్ట్‌ కానుంది. హిందీలో పేరున్న స్టార్స్‌– కరీష్మా కపూర్, డినో మారియా, సంజయ్‌ సూరి తదితరులు ఇందులో నటించారు.

మెంటల్‌హుడ్‌ కథ ప్రధానంగా ఐదుగురు తల్లుల చుట్టూ తిరుగుతుంది. వీరితో పాటు ఒక ‘హౌస్‌ హజ్బెండ్‌’ కూడా ఉంటాడు. హౌస్‌ హజ్బెండ్‌ అంటే భార్య ఉద్యోగానికి వెళితే ఇంట్లోనే ఉండి పిల్లల బాగోగులు చూసుకునే తండ్రి అనమాట. ఈ ఆరుగురు తమ పిల్లల జీవితాలను ఎలా డీల్‌ చేశారనేది కథ. ఇందులో కరీష్మా ముగ్గురు పిల్లల తల్లిగా నటించింది. ఈమె సగటు గృహిణి. పిల్లలు పెంచే వొత్తిడిని భర్త ఏ మాత్రం పంచుకోడు. ఆమె ఏం చేయాలి? మరో తల్లి ‘వర్కింగ్‌ మదర్‌’గా ఉంటూనే తన మాతృత్వానికి పూర్తి న్యాయం చేయాలని పెనుగులాడుతూ ఉంటుంది. ఒక తల్లి తన పిల్లలకు కేవలం ఆల్టర్నేట్‌ మెడిసిన్‌ వాడాలని, వాళ్లు ఆర్గానిక్‌ ఫుడ్‌ తినాలని అనుకుంటూ ఉంటుంది. వీళ్లలో ఒక పాపను స్కూల్లో మోలెస్ట్‌ చేస్తారు. ఆ వొత్తిడి ఎలా ఎదుర్కోవాలి?... ఇవన్నీ సమస్యలు. మన వొడిలో కూచుని ఆడుకుని ఎదిగిన పిల్లలే వయసు పెరిగే కొద్దీ అభిప్రాయాలు పెంచుకుని, అంచనాలు తెచ్చుకుని తల్లిని ప్రేమించాలా ద్వేషించాలా అనేవరకు ఈ మదర్‌హుడ్‌ వెళుతుంది. ప్రతి కుటుంబం తనను తాను చూసుకునే ఈ వెబ్‌ సిరీస్‌కు దర్శకురాలు కూడా స్త్రీయే. కరిష్మా కోహ్లి. కనుక స్త్రీల దృష్టికోణంలో పిల్లల పెంపకాన్ని ఈ సిరీస్‌ గట్టిగా చర్చకు పెడుతుందని చెప్పవచ్చు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top