విశ్వాసికి నిజమైన అలంకారం విధేయతే!

Devotional information by Prabhu Kiran

పరాక్రమం హద్దులు దాటితే అది అరాచకం సృష్టిస్తుంది, అనర్థదాయకమవుతుంది. దావీదు సైన్యాధిపతి యోవాబు విషయంలో అదే జరిగింది. ఎన్నో యుద్ధాల్లో అతను దావీదుకు చేదోడు వాదోడుగా నిలిచి యుద్ధాలు గెలిపించాడు. కాని అతనిది కుట్రపూరితమైన స్వభావం, నిచ్చెనలెక్కే విషయంలో అందెవేసిన చేయి. తనవంటి శూరులే అయిన అబ్నేరు, అమాశాను చక్రవర్తి అయిన దావీదు ఆజ్ఞకు విరుద్ధంగా చంపి, దావీదు సైన్యానికి చివరికి రాజకుమారుడైన అబ్షాలోమును కూడా రాజాజ్ఞను ఉల్లంఘించి స్వయంగా చంపాడు.

యోవాబు మహా పరాక్రమవంతుడే, కాని ‘విధేయత’లో అత్యంత బలహీనుడు. విజ్ఞత, విచక్షణ, లోపించిన పరాక్రమమతనిది. అలాటి వాడివల్ల దేశానికి మేలుకన్నా కీడే ఎక్కువగా జరుగుతుందన్న ముందు చూపుతో, దావీదు తన వారసుడైన సొలోమానుకు యోవాబు చేసిన రాజవ్యతిరేక చర్యలు వివరించి చెప్పి యోవాబు విషయంలో ‘నీకు తోచినట్టుగా చేయమని’ హెచ్చరించాడు. తానెంతో పరాక్రమవంతుణ్ణని, తనకెదురు లేదని భావించే యోవాబు ‘విచ్చలవిడితనం’తో సోలోమోను శత్రువులతో కలిశాడు. అదే అదనుగా భావించి సోలోమోను అతన్ని హతమార్చి, తనకూ, దేశానికీ కూడా ఉన్న బెడదను శాశ్వతంగా రూపుమాపాడు.

లోకంలో చాలామంది జ్ఞానులు, పరాక్రమవంతులు, విజ్ఞుల బలహీనత తకున్న ‘హద్దులు’ తెలుసుకోలేకపోవడమే. ఎంతటి శూరుడైనా రాజాజ్ఞకు బద్ధుడు. ఈ చిన్న విషయం అంతటి పరాక్రమవంతుడైన యోవాబుకు తెలియకపోవడం ఆశ్చర్యం. శూరుని విధేయతే అతని పరాక్రమానికి వన్నె తెస్తుంది. దేవుని పరిచర్య ‘బ్రహ్మాండంగా’ చేసే చాలా మంది దైవ జనుల్లో, ఆ దేవుని పట్ల ‘విధేయత’ లోపించిన ప్రతిసారీ వారిలో ఒక యోవాబు కనిపిస్తాడు.

దేవుడు అప్పగించిన పనిని మనం ఎంతో గొప్పగా చేస్తున్నామన్నది ఏమాత్రం ప్రాముఖ్యం కాదు. దేవుని పట్ల ఎంత విధేయంగా ఉంటున్నార్నదే వారి ప్రతిభకు గీటురాయి. ఎంతో శూరులనుకున్న చాలామంది చివరి దశలో ఆత్మీయంగా, కేరక్టర్‌ పరంగా దిగజారి చరిత్రహీనులు కావడానికి దారి తీసిన ఒకే కారణం దేవునిపట్ల వారి అవిధేయత. విశ్వాసికి నిజమైన అలంకారం విధేయతే! గొప్ప పనులు చేయడం ద్వారా కాదు, దేవుడు చెప్పిన పనులు చేయడం ద్వారా దేవునికి ప్రీతిపాత్రమవుతాం.

యేసుప్రభువు చెప్పిన ఒక ఉపమానంలోని యజమానికి తాను చెప్పినట్లు చేసిన తన సేవకుణ్ణి ‘భళా, నమ్మకమైన మంచి దాసుడా!’ అని అభినందిస్తాడు. దేవుని దృష్టిలో గొప్ప దైవజనులుండరు. నమ్మకమైన విధేయ దైవజనులు మాత్రమే ఉంటారు.

– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top