కుటుంబవ్యవస్థే సమాజానికి కీలకం...

Devotional information from prabhu kiran - Sakshi

ఎఫ్రాయిము మన్యంలో నివసించిన యాజక వంశీయుడైన లేవీయుడు ఎల్కానా (న్యాయా 17:7). హన్నా అతనికి రెండవ భార్య, వారికి పిల్లలు లేరు. ఇశ్రాయేలీయుల మందిరం అప్పట్లో షిలోహులో ఉండేది. ప్రజలంతా అవిధేయులై దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న కారణంగా దేవుని ప్రత్యక్షత పూర్తిగా అరుదైపోయి, నిర్ణయాత్మకత, పటిష్టత లోపించిన ఎలీ లాంటి అసమర్థ యాజకుని ఆత్మీయనాయకత్వంలో దేవుని మందిరం తన ప్రాభవాన్ని కోల్పోయిన చీకటి రోజుల్లో హన్నా ప్రార్థనలకు జవాబుగా సమూయేలు ప్రవక్త ఒక వ్రతపుత్రుడుగా జన్మించాడు. హన్నా తాను మొక్కుకున్నట్టుగానే, ఇంకా పసిబాలుడుగానే ఉన్న సమూయేలును తెచ్చి మందిరంలో పరిచర్యకు ప్రతిష్టించింది.

సమూయేలును మందిరంలోనే వదిలి హన్నా వెళ్ళిపోయింది. అలా సమూయేలు ప్రవక్త పసివాడుగా ఉన్నప్పటినుండే ఆలయంలో దేవుని పరిచర్యను నిబద్ధతతో చెయ్యడం ఆరంభించాడు. సమూయేలుతో దేవుడు పసితనం నుండే మాట్లాడుతూ ఉండటంతో, దేవుని ప్రత్యక్షతలు మళ్ళీ ఆరంభమై చీకటి రోజులకు తెరపడింది. ఇది కుటుంబ వ్యవస్థ సాధించిన ఘన విజయం.

లేవీయులంతా దేవుని మందిరపు దరిదాపుల్లోనే నివసించాల్సి ఉండగా, ఏ కారణంవల్లో షిలోహు మందిరానికి దూరంగా ఎఫ్రాయిము మన్యంలో నివసించిన ఎల్కానా దేవుని మందిరాన్ని మర్చిపోకుండా ఏటేటా దర్శించిన విశ్వాసి కాగా, నాకొక కుమారుణ్ణి ప్రసాదిస్తే అతన్ని నీ సేవకు ప్రతిష్ఠిస్తానంటూ మొక్కుబడి ప్రార్థన చేసి తన మాటకు కట్టుబడిన అంతకన్నా గొప్ప విశ్వాసి హన్నా!! అలా హన్నా తన ప్రార్ధనతో గొడ్రాలితనమనే తన వ్యక్తిగత సమస్యను తీర్చుకుంది, దేవుని ప్రత్యక్షత కరువైన ఆనాటి ఇశ్రాయేలీయుల ఆత్మీయ సమస్యను కూడా తన కుమారుడైన సమూయేలు ద్వారా పరిష్కరించింది.

ప్రార్థనాపరులైన తల్లిదండ్రులు అటు కుటుంబాన్ని, ఇటు సమాజాన్ని కూడా ఎంత గొప్పగా ఈనాడు కూడా ప్రభావితం చెయ్యగలరన్న దానికి ఎల్కానా, హన్నాలే ప్రత్యక్ష సాక్ష్యం. కొడుకు పుడితే తమకెంతో ప్రయోజకుడవుతాడు, వృద్ధాప్యంలో అండగా ఉంటాడన్న స్వార్థంతో సమూయేలును వాళ్ళు తమవద్దే ఉంచుకోవచ్చు. కానీ తమ ప్రయోజనాలకన్నా, సమాజ ప్రయోజనాలు, దేవుని సంకల్పాలే మిన్న అని నమ్మిన ఆదర్శ దంపతులు వారు.

అప్పుడే పాలు విడిచిన, బహుశా కేవలం మూడేళ్ళ వయసున్న తన పసి కుమారుణ్ణి, అతని ఆలనాపాలనా ఎలా ఉంటుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఆలయంలో ఒంటరిగా వదిలి వెళ్తున్నపుడు హన్నా హృదయం ఎంతగా తల్లడిల్లిందో మనం అర్థం చేసుకోవచ్చు. తల్లి కౌగిలిలో వెచ్చగా ఒదిగి హాయిగా పడుకోవాల్సిన సమూయేలు, ఇకనుండి మందిరంలో రాతినేలపై ఒక్కడే పడుకోవలసి ఉంటుందని హన్నాకు తెలుసు. అందుకు ఆమె ఒక పరిష్కారాన్ని కనుగొంది. అంత పిన్నవయసులోనూ ఆమె తన కుమారునికి దేవుణ్ణి పరిచయం చేసింది(1సమూ 1:28). ఇకనుండి దేవుడే తన కుమారునికి తోడుగా ఉండాలని, ఉంటాడని ఆమె నమ్మింది.

అలా తల్లిదండ్రులిద్దరి ఆత్మీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ఎదిగిన సమూయేలు త్వరలోనే గొప్ప ప్రవక్తగా ఆ దేశంలో స్థిరపడి ఇశ్రాయేలీయులకు గొప్ప నాయకత్వాన్నిచ్చాడు. సౌలు, దావీదు చక్రవర్తుల కాలంలో రాచరిక వ్యవస్థకు, ప్రజలకు మధ్య గొప్ప అనుసంధానకర్తగా ఉంటూ చీకటి రోజులను కాస్తా అటు ఆత్మీయంగా, ఇటు లోకపరంగా కూడా క్షేమకాలంగా మార్చడంలో ముఖ్యపాత్ర వహించాడు. తమ పిల్లలకు అన్నీ ఇచ్చేందుకు, వారి భవిష్యత్తును బంగారు బాటగా తీర్చిదిద్దేందుకు ఆరాటపడే తల్లిదండ్రులు వారికి దేవుణ్ణివ్వడం, దేవుణ్ణి పరిచయం చెయ్యడంలో మాత్రం ఎంతో అలసత్వం ప్రదర్శిస్తుంటారు.

’ఇదిగో మీ అమ్మ, నాన్న, మామ, తాత, అమ్మమ్మ’ అంటూ మాటలు రానప్పుడే పిల్లలకు అందర్నీ పరిచయం చేసే తల్లి, తండ్రి, ‘ఇదిగో నీ దేవుడు’ అని కూడా పరిచయం చెయ్యాలి. తల్లి ఒడి వెచ్చదనం, తండ్రి నేతృత్వంలోని భద్రతా భావంతోపాటు దేవుని నిత్యసహవాసం, ఆదరణ, విశ్వాసపు తొలిపాఠాలు పసితనంలోనే పిల్లలకు ఉగ్గుపాలతోపాటు రంగరించి పోయాలి. అలాంటి పెంపకంలోనే పిల్లలు సమాజ కల్యాణానికి పాల్పడే గొప్ప విశ్వాసులుగా తయారవుతారు.

– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్‌

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top