దేవుడు ‘నో’ చెబితే ఆశీర్వాదం!!

Devotional information by prabhu kiran - Sakshi

మన వాహనాలకు బ్రేకులెందుకుంటాయి? వేగాన్ని అదుపు చేయడానికి అనుకొంటున్నారా? ఒక్కసారి ఆలోచించండి, బ్రేకులుంటే గంటకు 200 కిలోమీటర్ల వేగంతో కూడా వెళ్ళడానికి వెనకాడని మీరు, అదే బ్రేకుల్లేని వాహనమైతే, దాన్ని ఆపే అవకాశం లేదు గనుక, గంటకు 5 కిలోమీటర్ల వేగంతో వెళ్ళడానికి కూడా సంకోచిస్తారు. అంటే బ్రేక ుల ఉద్దేశ్యం వాహనాన్ని ఆపడమే కాదు, మరింత వేగంగా వెళ్ళడానికి వీలు కల్పించడం కూడా అన్నది సుస్పష్టం. మన జీవిత ప్రయాణాల్లో, మన ప్రణాళికల్లో దేవుడు బ్రేకులు వేసేది కూడా మనల్ని అడ్డుకోవడానికి మాత్రమే కాదు, మనం ఆయన సంకల్పం మేరకు మరింత వేగం పుంజుకోవడానికి కూడా!!

కొత్తనిబంధన కాలపు చర్చిని పరిశుద్ధాత్మదేవుడు పెంతెకొస్తు పండుగ నాడు యెరూషలేములోని మేడగదిలో స్థాపించాడు (అపొ.కా 2వ అధ్యాయం). కాని ఆనాటి అభిషేకంతో అక్కడినుండి బయలుదేరి అపొస్తలులుగా బయలువెళ్లిన వాళ్లంతా ప్రపంచంలోని నలుమూలల్లో ఆ చర్చి శాఖల్ని స్థాపించారు. వారిలో ప్రాముఖ్యమైనవాడు అపొస్తలుడైన పౌలు. అనేక పట్టణాలు, ప్రాంతాల్లో ఆయన ఆ చర్చి శాఖల్ని ఎన్నో స్థాపించాడు. అలా స్థాపిస్తూ యూరోప్‌ నుండి ఆసియా ఖండానికి వెళ్ళాలన్న పౌలు ప్రయత్నానికి దేవుడు ఒకరోజు బ్రేకులు వేశాడు (అపొ.కా.16:6). అపుడు దేవుని సంకల్పం కొరకు ఎదురుచూసిన పౌలుతో దేవుడు ఒక దర్శనం ద్వారా మాట్లాడాడు. మాసిదోనియా ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి తమ వద్దకు వచ్చి తమకు సువార్త చెప్పమని వేడుకొంటున్న ఒక దర్శనాన్ని పౌలు ఒక రాత్రి చూశాడు.

మాసిదోనియా ప్రాంతం అలెగ్జాండర్‌ చక్రవర్తి జన్మభూమి, అతని సొంత స్థలం. ఆయన తర్వాత రాజ్యమేలిన చక్రవర్తులు ఆయన మీదున్న అసూయతో ఆ ప్రాంతాన్నంతా కొల్లగొట్టి బూడిద చేశారు. ఫలితంగా పేదరికం, అరాచకం, మితిమీరిన విచ్చలవిడితనం రాజ్యమేలే ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్ళడానికి సాహసించేవారు కాదు. అందుకే పౌలు అక్కడికి వెళ్లాలనుకోలేదు. కాని దేవుడు అతని ప్రయాణానికి బ్రేకులు వేసి మరీ ఆ ప్రాంతానికి పంపించాడు. ఫలితంగా మాసిదోనియా ప్రదేశంలో ఆయన అక్కడి రాజధానియైన ఫిలిప్పిలో, బెరయ అనే పట్టణంలో, థెస్సలొనీక పట్టణంలో కూడా చర్చి శాఖల్ని అద్భుతమైన రీతిలో ఆయన స్థాపించాడు. ఆ విధంగా ఆయన ముందనుకొన్న మార్గంలో కాకుండా ఇపుడు మరో మార్గంలో కొనసాగి కొరింథీ వంటి ఇంకా అనేక ప్రాముఖ్యమైన ఇతర పట్టణాల్లో కూడా విజయవంతంగా చర్చి శాఖల్ని స్థాపించాడు.

మరోవిధంగా చెప్పాలంటే పౌలు చేసిన సువార్త యాత్రంతటినీ మాసిదోనియాకు ముందు ఆ తర్వాత అని విభజించగలిగినంత ప్రభావాన్ని ఆయన మాసిదోనియా సౌవార్తిక పర్యటన చూపించింది. దేవుడు మన ఆలోచనలకు సమ్మతి తెలుపకుండా నిరాకరించినపుడు, వాటిని అడ్డుకున్నపుడు, అంతకన్నా మెరుగైనదేదో ఆయన ఇవ్వబోతున్నాడని, లేదా మనం తలపెట్టిన దానిలో మనకు కనిపించని, అర్ధం కాని హానికరమైన అంశమేదో ఉందని అర్ధం. దేవుడు మనకు’నో’ చెప్పినపుడు దేవుడసలు మనల్ని ప్రేమిస్తున్నాడా? అన్న అనుమానం రాకమానదు. అయితే ఆయన ప్రేమించేవాడు గనుకను మనల్ని అడ్డుకొంటున్నాడన్న విశ్వాస స్థాయిలోకి మనం ఎదగాలి. అప్పుడు ఆయన ’నో’ చెబితే మనం ఆయనకు ’థాంక్‌ యు’ చెబుతాం.

మనం ప్రవేశించాలనుకున్న తలుపును దేవుడు మూసిస్తే దాన్నే తెరవమంటూ పదే పదే బాదడం విశ్వాసం కానే కాదు. ఆ ద్వారం నీ స్థాయికి సరిపోదని అంతకన్నా శ్రేష్టమైన ద్వారాన్ని, మార్గాన్ని ఆయన నీ కోసం సిద్ధపరచాడని తెలుసుకోవాలి. ఒక్కసారి మన జీవితాల్లో వెనక్కి తిరిగి చూసుకుంటే, మనకు దేవుడు బ్రేకులు వేసిన సందర్భాల కారణంగా ఎంత గొప్ప ఆశీర్వాదాలు మనకు చేకూరాయో మనకే అర్ధమవుతుంది. మనముందున్న జీవన ప్రయాణమంతా తెలుసుకోగలిగిన విజ్ఞత, శక్తి ఏ మానవునికి లేదు. అదంతా ఎరిగిన సర్వజ్ఞానిగా దేవుడు మన ప్రయాణాన్ని అడ్డుకొని మరో తెలియని మలుపు తిప్పితే, అంతకన్నా ఆశీర్వాదం మరొకటి ఉందా? అలా దేవుని చేతిలో చెయ్యి వేసి ప్రయాణించగలగడంలోని నిర్భయత్వం, నిశ్చింతా ఎంతో విలువైనది కాదా?

– రెవ. డా.టి.ఎ. ప్రభుకిరణ్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top