ఒక నిమిషం – ఒక విషయం

Devotional information - Sakshi

ఆకుపూజ ఎందుకు?

ఆంజనేయునికి తమలపాకుల పూజ చేయడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే– ఒకసారి సీతమ్మతల్లి అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముడిని ‘‘స్వామీ ఏమిటది? మీ నోరు అంత ఎర్రగా ఎందుకయ్యింది?’’ అని అడిగాడు. అప్పుడు రాముడు ‘తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది. అంతేకాదు, ఆరోగ్యానికి చాలా మంచిది’ అని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి నుండి వెళ్లిపోయి కొంతసేపటికి ఒళ్లంతా తమలపాకులను కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు.
ఆంజనేయుడు ఎక్కువగా తమలపాకు తోటల్లోనూ, కదళీవనం (అరటితోట)లోనూ విహరిస్తాడు. ఆంజనేయస్వామి రుద్రసంభూతుడు. ఆయనకు తమలపాకులు శాంతినిస్తాయి. అందువలన తమలపాకులతో పూజించడం వలన మనకు కూడా శాంతి, సుఖం లభిస్తాయి. తమలపాకులకు మరోపేరు నాగవల్లీదళాలు. తమలపాకులతో పూజించడం వలన నాగదోష శాంతి కూడా జరుగుతుంది.

ధ్యానం... విధానం
సుఖాసనంలో.. హాయిగా.. కూర్చుని .. చేతులు రెండూ కలిపి.. కళ్ళు రెండూ మూసుకుని.. ప్రకృతి సహజంగా జరుగుతూన్న ఉచ్ఛ్వాస నిశ్వాసలనే.. ఏకధారగా.. గమనిస్తూ వుండాలి. ఏ దేవతారూపాన్నీ, ఏ గురు రూపాన్నీ ప్రత్యేకంగా ఊహించుకోరాదు. ఏ దైవ నామస్మరణా వుండరాదు. ఈ విధమైన ఆలోచనారహిత–స్థితిలో కలిగే అనేకానేక శారీరక, నాడీమండల, అత్మానుభవాలను శ్రద్ధగా గమనిస్తూ వుండాలి.

ఆ స్థితిలో శరీరం వెలుపల వున్న విశ్వమయ ప్రాణశక్తి.. అపారంగా శరీరంలోకి ప్రవేశించి.. నాడీమండలాన్ని శుద్ధి చేస్తూ వుంటుంది. ఎవరి వయస్సు ఎంత (సంవత్సరాలు) వుంటుందో.. కనీసం అన్ని నిమిషాలు.. తప్పనిసరిగా.. రోజుకి రెండుసార్లుగా.. ధ్యానం చెయ్యాలి. ఈ విధంగా ప్రతి రోజూ నియమబద్ధంగా ధ్యాన అభ్యాసాన్ని అలవాటు చేసుకోవాలి.

ధ్యానం వల్ల లాభాలు...
♦ ధ్యానసాధన ద్వారా శారీరక, మానసిక అనారోగ్యాలైన బి.పి, షుగరు, చర్మ వ్యాధులు, డిప్రెషన్, వెన్నునొప్పి, క్యాన్సరు, గుండెనొప్పి వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుతాయి. దుర్గుణాలు, దురలవాట్లను కూడా పోగొట్టుకోవచ్చు.
♦ మానసిక ఆందోళనలు, ఒత్తిడిని జయించి మానసిక ప్రశాంతతను పొందవచ్చు.
♦ జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, బుద్ధికుశలత మొదలైనవి పెరుగుతాయి.
♦  ధ్యాన సాధన చేసిన వారిలో ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరిగి జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను, లాభ నష్టాలను సమబుద్ధితో స్వీకరించగలుగుతారు.
♦ మూఢ నమ్మకాలు, భయాలు పోతాయి. చావు–పుట్టుకల జ్ఞానం ద్వారా మరణభయాన్ని జయించగలరు.
♦ ధ్యానం మనిషిని ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి, హింస నుండి అహింస వైపు, అజ్ఞానం నుండి ఆత్మజ్ఞానం వైపు, మానవత్వం నుండి దైవత్వం వైపు నడిపిస్తుంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top