ఏకదండి.. ద్విదండి... త్రిదండి అంటే ఏమిటి?

devotional information

సన్యాసులు (స్వామీజీలు) వైరాగ్యానికి, తాత్వికతకు, ద్వైత, అద్వైత భావానికి గుర్తుగా  చేతిలో పొడవాటి కర్రలు ఎల్లవేళలా పట్టుకుంటారు. ఈ (దండాలు) కర్రలు వివిధ ఆకారాలలో ఉంటాయి. ప్రతీదానికి ఓ అర్థం ఉంది. గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం అనే పంచభూతాల సమ్మేళనమే మనిషి, కాబట్టి సన్యాసులు ఐదడుగుల కర్రను ధరిస్తారు. ఈ కర్రలలో ఏకదండి, ద్విదండి, త్రిదండి అనే మూడు విధాలు ఉన్నాయి. (దండి అంటే కర్ర అని అర్థం)

ఒక కర్రను (ఏకదండి ) ధరించి ఉండేవారు అద్వైత సిద్ధాంతాన్ని నమ్మేవారు (ఆది శంకరాచార్యులు). అద్వైతం అనగా జీవుడు, దేవుడు ఒక్కటేననే సిద్ధాంతం. అంతరాత్మకు విరుద్ధంగా అక్రమ, అన్యాయ మార్గాన సంచరించినా, ప్రవర్తించినా ఆ పాపఫలితాన్ని బతికి ఉండగానే ఏదో ఒక రూపంలో ఇక్కడే తప్పకుండా అనుభవించక తప్పదు అనే సిద్ధాంతాన్ని వారు బోధిస్తారు. వీరి చేతిలో జ్ఞానానికి సంకేతమైన రావిచెట్టునుండి సేకరించిన ఒక కర్ర ఉంటుంది.

రెండు కర్రలు కలిపి ఒక్కటిగా కట్టి (ద్విదండి)ధరించి బోధనలు చేసేవారు ద్వైత సిద్ధాంతం కలవారు (మధ్వాచార్యులు). వీరిని ‘ద్విదండి స్వాములు’ అంటారు వీరు విష్ణుభక్తులు. వీరు దేవుడు వేరు– జీవుడు వేరు అని బోధిస్తారు. జీవాత్మ, పరమాత్మ వేరువేరు అనే ఈ సిద్ధాంతాన్నే శ్రీకృష్ణుడు అర్జునునికి బోధిస్తాడు.

మూడు కర్రలను ఒకే కట్టగా కట్టి (త్రిదండి) భుజాన పెట్టుకునేవారు కూడా ఉన్నారు, దీనిని తత్వత్రయం అంటారు. ఇలా ధరించే వారు విశిష్ఠాద్వైతాన్ని బోధిస్తారు. వీరిది రామానుజాచార్యుల పరంపర.
శరీరంలో జీవుడున్నట్లే, జీవునిలో అంతర్యామిగా శ్రీమన్నారాయణుడు ఉంటాడని, జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి సత్యాలని, ఈ మూడింటిని నారాయణ తత్వంగా నమ్ముతూ, జీవుడు ఆజ్ఞానంతో సంసార బంధాన చిక్కుకుంటాడని, నారాయణుని శరణు వేడిన వారు భగవదనుగ్రహం వలన అజ్ఞానం నుండి విముక్తులై, మరణానంతరం నారాయణ సాన్నిధ్యం, మోక్షం పొందుతారని, వారికి మరుజన్మ ఉండదని విశిష్ఠాద్వైతపు సిద్ధా్దంతాన్ని బోధిస్తారు !!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top