నిను వీడిన నీడ

Death And Other Holidays By Marsi Vogel - Sakshi

కొత్త బంగారం

‘నాకిద్దరు తండ్రులుండేవారు. ఇప్పుడు ఒక్కరూ లేరు. మొదటి మరణం ఉద్దేశపూర్వకమైనది. రెండోది కణాలు తెచ్చిపెట్టిన ప్రమాదం.’ డెత్‌ అండ్‌ అదర్‌ హోలీడేస్‌ నవలికకు కథానాయికా, కథకురాలూ అయిన ఏప్రిల్‌ తన సవతి తండ్రి విల్సన్‌ క్యాన్సర్‌తో పోయినప్పుడు చెప్తుందీ మాటలు. ‘నాకు 16 ఏళ్ళున్నప్పుడు, నాన్న బెల్టుతో ఉరేసుకున్నాడు. తన డాట్సన్‌ కారు నాకు వదిలిపెట్టాడు. క్లచ్‌ వేయడం నేర్చుకోడానికే నెలలు పట్టాయి’ అంటుంది ఇరవైల్లో ఉన్న ఏప్రిల్‌. నవలికలో ఉండే ఆమె సొంత తండ్రి గురించిన వివరాలవి మాత్రమే.

అమెరికాలోని లాస్‌ ఏంజెలిస్‌లో విల్సన్‌ చనిపోయిన 1998 వసంతకాలం నుండీ 1999 శీతాకాలం వరకూ కొనసాగే కథనంలో ఉన్న నాలుగు అధ్యాయాలకీ, నాలుగు రుతువుల పేర్లుంటాయి. ‘తన జ్ఞాపకాలు చెదిరిపోకుండా ఉండేందుకు’ రోజూ ఒక ఫొటో తీసుకుంటానన్న ఏప్రిల్‌ నిర్ణయంతో మొదలవుతుంది మార్సీ వోగల్‌ రాసిన యీ పుస్తకం. విల్సన్‌కూ, సవతి కూతురుకీ బాగా పడేది. ‘నీ జీవితం ఇప్పుడే ప్రారంభమవుతోంది’ అని విల్సన్‌ తను చనిపోయేముందు ఏప్రిల్‌కు చెప్తాడు. దాన్తో పాటు ‘మొదలుపెట్టింక, పద’ అని రాసిస్తాడు.

ఆ వసంతకాలంలోనూ, వేసవిలోనూ చుట్టూ ఉన్న ప్రపంచం యథావిధిగా సాగుతుండగా, ఏప్రిల్‌ మాత్రం నిర్వీర్యురాలవుతుంది. ఇద్దరు తండ్రులూ, పెళ్ళవబోయే ఆప్తమిత్రురాలు లిబ్బీ గుర్తొస్తుంటారు. ఆకురాలు కాలపు మొదటి రోజు, లిబ్బీ ప్రధానపు రోజు ఫొటోలను డెవలప్‌ చేస్తూ, ‘అక్కడే ఉన్నానే! నా కెమెరా రికార్డ్‌ చేసినది నా మనస్సెందుకు పట్టుకోలేకపోయిందో!’ అనుకుంటుంది. కారణం– పూల్‌ పక్కన కూర్చున్న హ్యూగో కజిన్‌ విక్టర్, అతని కుక్క ఏర్గోస్‌నీ తను గమనించకపోవడం. ఏప్రిల్, విక్టర్‌ ప్రేమలోపడి కలిసి తోటపని చేస్తారు. రహస్యాలు పంచుకుంటారు.

ఏప్రిల్‌ థెరపిస్ట్‌ వద్దకి వెళ్తుంది. అయితే– తండ్రి ఆత్మహత్యా, విల్సన్‌ మరణం గురించిన తన అనుభూతులు వ్యక్తపరచలేకపోతుంది. కానీ, జిమ్‌లో తారసపడిన ఒక అపరిచితుడు– తన తండ్రి కూడా అలాగే మరణించాడని చెప్పినప్పుడు, ‘మేమిద్దరం ఆత్మహత్యకు కొడుకూ కూతుళ్ళం’ అనుకుంటుంది. ప్రేమలో భద్రత అన్న ఆమె భావం కాస్తా, ‘ఏదీ శాశ్వతం కాదు’ అన్న అభిప్రాయానికి మారినప్పుడు, ‘ఏర్గోస్‌ ముసలి కుక్క. విక్టర్‌ పిరికివాడు’ అనేసుకుని, ‘తన్ని తాను చంపుకోగలిగే నీలాంటి మనిషిని ప్రేమించదలచుకోలేదు’ అని అతనికి చెప్తుంది. సంవత్సరం గడిచి వసంతకాలం ప్రవేశిస్తుండగా– ఏప్రిల్, విల్సన్‌ సలహా పాటించి, విక్టర్‌తో రాజీపడి, ముందుకు కదిలి జీవితం ప్రారంభిస్తుంది.

నవలికలో, ఏప్రిల్‌ యూదు కుటుంబ సభ్యుల మనస్తత్వాలూ, అలవాట్ల వివరాలూ చాలానే ఉంటాయి. డిపార్టుమెంట్‌ స్టోర్‌లో ఏప్రిల్‌ కొన్న సామాన్లేమేమిటో కూడా పేర్లూ, బరువుతో సహా విశదంగా ఉంటాయి. అన్ని అధ్యాయాల్లోనూ విల్సన్‌ గురించిన చిన్న ఉంటంకింపులుంటాయి. హాస్యం, కోపం, బాధ సమపాళ్ళలో కనపరిచే నవలిక– మృత్యువు, వేదన గురించినదైనప్పటికీ రచయిత్రి శైలివల్ల, మనుష్యుల జీవితాలను యథాత«థంగా చూపుతుంది. మరణాన్ని మనం ఎంత పట్టించుకోకపోయినా అది పక్కనే తచ్చాడుతుందని చెబుతుంది.

కవయిత్రయిన వోగల్‌ భాష ఆకర్షణీయమైనది. ఒక సంవత్సరపు ఆవేదనను చూపించే 126 పేజీలున్న ఈ పుస్తకాన్ని 2018లోప్రచురించినది మెల్విల్‌ హౌస్‌. ‘మయామి బుక్‌ ఫెయిర్‌ ప్రైజ్‌ ఫర్‌ ద బెస్ట్‌ నొవెలా’ మొట్టమొదటి అవార్డు గెలుచుకుంది. అమెరికాలో నవలికలను గౌరవించే ఒకే ఒక అవార్డు ఇది. కాలిఫోర్నియాలో పుట్టిన వోగల్‌– అనువాదకురాలు కూడా. సదరన్‌ కాలిఫోర్నియా యూనివర్సిటీనుండి పీహెచ్‌డీ చేసి, ప్రస్తుతం పోస్ట్‌ డాక్టరల్‌ స్కాలర్‌గా ఉన్నారు. 
- కృష్ణ వేణి
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top