 
															విశ్వాసంతో జయిస్తున్నారా?
ఒక్కసారి మనల్ని మనం నమ్మితే అద్భుతాలు సృష్టించవచ్చు, ఎప్పుడూ సంతోషంతో ఉండవచ్చు.
	సెల్ఫ్‌చెక్
	
	ఒక్కసారి మనల్ని మనం నమ్మితే అద్భుతాలు సృష్టించవచ్చు, ఎప్పుడూ  సంతోషంతో ఉండవచ్చు. మనకు కావలసిన ఎలాంటి అనుభూతులనైనా సాధ్యం చేసుకోవచ్చు. ఇది జరగనప్పుడు? ఏదైనా సాధించగలను అనుకోవటం మరుక్షణం డీలా పడిపోవటం... నా జీవితం ఎప్పటికీ ఇంతే... లోకంలో కష్టాలన్నీ నాకే ఎందుకు వస్తాయి? జీవించటం అవసరమా? ఇలా ఎప్పుడూ అభద్రతా భావంతో, నిరాశా వాదంతో, నిస్సత్తువతో ఉండటంవల్ల మనశ్శాంతి ఉండదు. దేనినీ నమ్మక, ఎవరిపై నమ్మకం ఉంచక చివరికి వారినివారే ద్వేషించుకుంటూ తమపై విశ్వాసాన్ని కోల్పోయేవారు ఏదీ సాధించలేరు. తమపై తాము విశ్వాసాన్ని కోల్పోవటానికి సాధారణంగా కుటుంబ, వ్యక్తిగత, సమాజ పరిస్థితులు కారణంగా ఉంటాయి. అయితే వీటిని అధిగమించటం పెద్ద సమస్యేమీ కాదు. మీ విశ్వాసాన్ని రెట్టింపు చేసుకోవటం కష్టమేమీ కాదు.
	
	1.    మీ పనులను మీరు చేసుకొంటున్నా అవసరమైనప్పుడు ఇతరుల సహాయం తీసుకుంటారు. అహానికి తావివ్వరు.
	    ఎ. అవును  బి. కాదు
	
	2.    ‘‘నువ్వు దేనికీ పనికిరావు, నువ్వు సరిగా పనిచేయటం లేదు’’ ఇలా మిమ్మల్ని ఎవరైనా నిరుత్సాహ పరిస్తే ఎలాంటి ఒత్తిడికి లోనవ్వరు.
	    ఎ. అవును     బి. కాదు
	
	3.    హడావిడి పడరు, ప్లాన్డ్‌గా ఉంటారు. ప్రతిచిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మీకిష్టం ఉండదు.
	    ఎ. అవును     బి. కాదు
	
	4.    మిమ్మల్ని ఇబ్బందిపెట్టే సమస్యలను గుర్తు చేసుకొని నోట్ చేసుకుంటారు. వాటిని ఎలా పరిష్కరించవచ్చో, మార్గాలు అన్వేషిస్తారు.
	    ఎ. అవును     బి. కాదు
	
	5.    అసంబద్ధంగా ఉన్నదాన్ని నమ్మాలంటే సదేహిస్తారు. కాని మీ అభిప్రాయం మీద మీకున్న విశ్వాసాన్ని కోల్పోరు.
	    ఎ. అవును     బి. కాదు
	
	6.    దార్శనికతను ఏర్పరచుకుంటారు. దానికోసం కావలసిన ఇన్‌పుట్స్‌ను పొందుతారు. మీ విజన్‌కున్న ప్రతికూల అంశాలను గుర్తించగలరు.
	    ఎ. అవును     బి. కాదు
	
	7.    విజన్‌ను ఏర్పరచుకొని అంతటితో వదిలేయరు. దాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ మోటివేట్ అవుతారు. అనుకున్నది సాధించలేనేమోనని భయపడరు.
	    ఎ. అవును     బి. కాదు
	
	8.    మీ విశ్వాసాన్ని నీరుకార్చే ఆలోచనలు వస్తే వాటిని ఆహ్వానిస్తారు. తర్వాత వాటిని పాజిటివ్‌గా మరల్చుకొనేందుకు ప్రయత్నిస్తారు.
	    ఎ. అవును     బి. కాదు
	
	9.    కొన్ని సందర్భాల్లో, నమ్మకాన్ని కోల్పోవటం మీకు మాత్రమే జరగదని, ఇలా ప్రతివ్యక్తిలో జరుగుతుందని అనుకుంటారు. అందుకే దీనిని కామన్ ప్రాబ్లమ్‌గా నిర్వచిస్తారు.
	    ఎ. అవును     బి. కాదు
	
	10.    ప్రయత్నించడం అంటే మీకిష్టం. మీరు ట్రై చేసిన మొదటిసారే మీరనుకున్న ఫలితం రావాలని ఆశించరు. ప్రయత్నం మీద దేనినైనా సాధించవచ్చని నమ్ముతారు.
	    ఎ. అవును     బి. కాదు
	
	‘ఎ’ సమాధానాలు ఏడు దాటితే మీ విశ్వాసాన్ని ఎలాంటి పరిస్థితుల్లో కోల్పోరు. విశాలదృక్పథంతో, ఆప్టిమిజంతో పనులను చేస్తుంటారు. దీనివల్ల మంచి ఆరోగ్యం మీ సొంతమవుతంది. ఇబ్బందిపెట్టే ఆలోచనలను దరిచేరనివ్వరు. ‘బి’ లు ఆరు దాటితే మనశ్శాంతితో ఉండరు. జీవితంలో ఎలా ఆనందించాలో, సమస్యలపై ఎలా స్పందించాలో మీకు తెలియదు. మీ నిరాశావాదానికి ఇకనైనా చెక్  చెప్పండి. ‘ఎ’ సమాధానాలను సూచనలుగా తీసుకోవటంతోపాటు ఆత్మవిశ్వాసం ఎలాపొందాలో తెలిపే పుస్తకాలు చదవండి. ఆశావాదులతో స్నేహం చేయండి. ఆల్ ద బెస్ట్.
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
